Share News

SriSailam Project: నేడు తెరుచుకోనున్న శ్రీశైలం గేట్లు!

ABN , Publish Date - Jul 08 , 2025 | 04:36 AM

ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో సీజన్‌ ప్రారంభానికి ముందే వరద పోటెత్తడంతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి.

SriSailam Project: నేడు తెరుచుకోనున్న శ్రీశైలం గేట్లు!

192.53 టీఎంసీలకు నీటి నిల్వ.. కృష్ణమ్మకు పూజలు చేయనున్న ఏపీ సీఎం చంద్రబాబు

  • మహారాష్ట్రలో భారీ వర్షాలతో ఎరుపెక్కిన గోదావరి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో సీజన్‌ ప్రారంభానికి ముందే వరద పోటెత్తడంతో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. మరోవైపు, శబరి, సీలేరు ఉపనదుల వరద ఉధృతి పెరగడంతో గోదావరి నీరు ఎరుపెక్కింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 18.20 అడుగులకు చేరుకుంది. ఇక, గత నెల మొదటి వారం నుంచే ఇన్‌ఫ్లో పెరగడంతో మంగళవారం ఉదయం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు సతీ సమేతంగా ఉండవల్లి నుంచి నేరుగా హెలికాప్టర్‌లో నంద్యాలలోని సున్నిపెంటకు 11 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకుని 11:50-12:10 గంటల మధ్య కృష్ణమ్మకు జల హారతిఇచ్చి శ్రీశైలం గేట్లు ఎత్తుతారు. గతేడాది జూలై 29న శ్రీశైలం గేట్లు ఎత్తగా ఈ ఏడాది ముందస్తు వరదలతో 21 రోజులు ముందే గేట్లు తెరుచుకోనున్నాయి. జూలై మొదటి వారంలోనే గేట్లు ఎత్తడం గత పాతికేళ్లలో ఇదే తొలిసారి. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 192.53 టీఎంసీలకు చేరుకున్నాయి. గతేడాది 184 టీఎంసీలు ఉన్నప్పుడే గేట్లు తెరవగా ఈ ఏడాది ఎక్కువగా నీటిని నిల్వ చేశారు.


ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 1,71,550 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఇక శ్రీశైలం ఎగువన ఉన్న ఆలమట్టి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 88.24 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఈ ప్రాజెక్టుకు 1.11 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 1.15 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌ రిజర్వాయర్‌ పూర్తిస్థాయి సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 26.93 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఇన్‌ఫ్లో 1.15 లక్షలు వస్తుండగా 30 గేట్ల ద్వారా 1.12 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. జూరాలకు 1.12 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.66 టీఎంసీలకు గాను 7.31 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. 12 గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా 1.10 లక్షల క్యూసెక్కులను శ్రీశైలానికి వదులుతున్నారు. ఇక కృష్ణా ఉపనది తుంగభద్రపై ఉన్న టీబీ డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యం 105.79 టీఎంసీలు కాగా ప్రస్తుతం 76.71 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఇన్‌ఫ్లో 54,550 క్యూసెక్కులు వస్తుండగా, 61,884 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్‌ పూర్తి నీటి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 162.4 టీఎంసీలకు చేరుకున్నది. ఎగువన శ్రీశైలం నుంచి నీరు విడుదల చేయడంతో సాగర్‌ నీటిమట్టం రోజుకు రెండు అడుగుల చొప్పున పెరుగుతోంది. మరోవైపు, ఎడమకాల్వ ద్వారా 3,374క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1350 క్యూసెక్కులతో కలిపి సాగర్‌ నుంచి మొత్తం 4724 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


మేడిగడ్డ వద్ద నిలకడగా గోదావరి

మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తింది. శబరి, సీలేరు ఉప నదుల ప్రవాహం కలవడంతో 3,4 రోజుల్లో వరద మరింత పెరుగుతుందని కేంద్ర జలసంఘం, జల వనరులశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి ప్రవాహం నిలకడగా ఉంది. సోమవారం బ్యారేజీలోకి 70,710 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా 85గేట్లను ఎత్తి, అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరాం సాగర్‌లోకి 5,178 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టుకు 4488, ఎల్లంపల్లికి 962 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది.


జలవిద్యుత్తు జోరు

ముందే వర్షాలు కురవడంతో జలవిద్యుత్‌ జెన్‌కో సిరులు కురిపిస్తోంది. జూరాలలో 3.25మిలియన్‌ యూనిట్లు, లోయర్‌ జూరాలలో 3.57మిలియన్‌ యూనిట్లు, శ్రీశైలంలో 17.88మిలియన్‌ యూనిట్లు, సాగర్‌లో 2.11మిలియన్‌ యూనిట్లు, పులిచింతలలో 0.36మిలియన్‌ యూనిట్లు కలిపి ప్రతీరోజు 2.7 కోట్ల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తవుతోంది. దీంతో తెలంగాణ జెన్‌కోకు రోజూ రూ.10కోట్లఆదాయం వస్తోంది.


కొన్ని జిల్లాలకు అతిభారీ వర్షాలు

రాష్ట్రంలో నేడు, రేపు కొన్నిజిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, మెదక్‌, కామారెడ్డి జిల్లాలకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక బుధవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ ఇచ్చింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.


ఇవి కూడా చదవండి

జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం,


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 08 , 2025 | 04:36 AM