Adilabad: వర్షాకాలం.. వాగు దాటాలంటే హడల్!
ABN , Publish Date - Jul 11 , 2025 | 06:05 AM
ఆదిలాబాద్ ఏజెన్సీలోని పలు గ్రామాల్లో చిన్నపాటి వర్షాలకే వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో గిరిజనులు పడరాని పాట్లు పడుతున్నారు.

ఆదిలాబాద్ ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనుల పాట్లు
అత్యవసర సమయాల్లో ప్రమాదకరంగా ప్రయాణం
ఆదిలాబాద్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్ ఏజెన్సీలోని పలు గ్రామాల్లో చిన్నపాటి వర్షాలకే వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో గిరిజనులు పడరాని పాట్లు పడుతున్నారు. వాగులను దాటలేక కొన్ని సార్లు రోజుల తరబడి గ్రామాలకే పరిమితమవుతున్నారు. అత్యవసర సమయాల్లో దేవుడే దిక్కు అన్నట్లుగా కాలం గడుపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి, సిరికొండ, నార్నూర్, ఉట్నూర్, బజార్‌హత్నూర్, ఇచ్చోడ మండలాల్లోని పలు గ్రామాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.
ముఖ్యంగా ఇంద్రవెల్లి మండలంలోని చిట్టాబట్ట, జెండాగూడ, జైత్రంతండా, ఆర్కాపూర్, మామిడిగూడ, బజార్‌హత్నూర్ మండలం కొత్తపల్లి, మోర్కాండి, ఉమర్ధా, బుద్దునాయక్‌తండా, మన్కాపూర్, ఉట్నూర్ మండలం నర్సాపూర్ జె, ఆడగూడ, వంకతుమ్మ, పాటగూడ, నార్నూర్ మండలంలో ఉమ్రి, చిట్టగూడ గ్రామాలకు వెళ్లే దారు లు ప్రమాదకరంగా ఉన్నాయి. వాగులు, వంకలపై బ్రిడ్జిలు లేకపోవడంతో వరద నీటిని దాటేందుకు ప్రాణాలు పణంగా పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. బజార్‌హత్నూర్ మండలంలోని కొత్తపెల్లి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ గత ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలను గ్రామస్థులు బహిష్కరించారు. చివరకు అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని హామీ ఇవ్వడంతో సాయంత్రం గంటసేపు మాత్రమే ఓట్లు వేశారు. అయినా.. ఇప్పటిదాకా ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించకపోవడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి.
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
గొంతు నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కా..
ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి
Read Latest Telangana News and National News