Share News

Road Accident: అతి వేగం.. అజాగ్రత్త

ABN , Publish Date - Apr 21 , 2025 | 04:14 AM

రాష్ట్రంలో ఆదివారం రహదారులు నెత్తురోడాయి. హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై, నిజామాబాద్‌ జిల్లాలో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Road Accident: అతి వేగం.. అజాగ్రత్త

  • కారు అదుపుతప్పి ఓఆర్‌ఆర్‌పై ఇద్దరు ఐటీ ఉద్యోగుల దుర్మరణం

  • నిజామాబాద్‌ జిల్లాలో లారీ ఢీకొని ఇద్దరు బాలుర మృతి

  • అదే జిల్లాలో కూలీలపైకి ట్రాక్టర్‌.. ఒకరి మృత్యువాత

దుండిగల్‌/ఆర్మూర్‌ టౌన్‌/ సిరికొండ, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆదివారం రహదారులు నెత్తురోడాయి. హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై, నిజామాబాద్‌ జిల్లాలో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒడిశాకు చెందిన భానుప్రకాశ్‌ (36), నలీన్‌ కంఠబిస్వాల్‌ (36) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. కోకాపేటలో ఉంటున్న వీరు ఆదివారం తెల్లవారుజామున మేడ్చల్‌ నుంచి పటాన్‌చెరుకు కారులో బయలుదేరారు. మల్లంపేట వద్ద కారు అదుపు తప్పి వేగంగా డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరి తలలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదానికి అతి వేగం, అజాగ్రత్తే కారణమేనని పోలీసులు భావిస్తున్నారు. మరో ఘటనలో నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పెర్కిట్‌ 44వ జాతీయ రహదారిపై లారీ బైక్‌ను ఢీకొని ఇద్దరు బాలురు మరణించగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్మూర్‌ అశోక్‌నగర్‌కు చెందిన బంజ విశ్వనాథ్‌ ఆదివారం పెర్కిట్‌లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తన కుమారుడు ఓంకార్‌ (14) అతడి స్నేహితుడు భానుప్రసాద్‌ (11)ను బైక్‌పై తీసుకొని బయల్దేరాడు. పెర్కిట్‌ 44వ జాతీయ రహదారి వద్ద రోడ్డు దాటుతుండగా నిర్మల్‌ నుంచి వస్తున్న ఓ లారీ వీరి బైక్‌ను ఢీ కొట్టింది.


ఈ ప్రమాదంలో భానుప్రసాద్‌ అక్కడిక్కడే మృతి చెందగా గాయాలపాలైన తండ్రీ కుమారులు విశ్వనాథ్‌, ఓంకార్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఓంకార్‌ మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన విశ్వనాథ్‌ను ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అదే జిల్లా సిరికొండ మండలం కొండాపూర్‌లో రోడ్డు పక్కన నిద్రిస్తున్న కూలీలపైకి ట్రాక్టర్‌ దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కొండాపూర్‌ గ్రామశివారులో రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించేందుకు బిహార్‌ నుంచి వచ్చిన కూలీలు లారీలోకి ఎక్కించారు. అనంతరం వారిలో ముగ్గురు రోడ్డు పక్కన చెట్టు కింద సేద తీరుతుండగా ఓ ట్రాక్టర్‌ వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో భూమశ్రీ (50) అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు కూలీలు చింటు, గోవింద్‌కు తీవ్ర గాయాలవగా వారిని ఆస్పత్రికి తరలించారు. తప్పతాగి వాహనం నడిపిన ట్రాక్టర్‌ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read:

క్రికెట్ ఆడుతోండగా పిడుగు పడి.. యువకులు మృతి

థాకరే, రాజ్ మధ్య సయోధ్యపై బీజేపీ ఆసక్తికర వ్యాఖ్యలు

గుజరాత్‌లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి

For More Telangana News and Telugu News..

Updated Date - Apr 21 , 2025 | 04:14 AM