Srushti Fertility Center : సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్ నమ్రతకు ఐదు రోజుల కస్టడీ..
ABN , Publish Date - Aug 01 , 2025 | 09:43 AM
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ(శుక్రవారం) డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు.

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ(శుక్రవారం) డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు నమ్రతను గోపాలపురం పోలీసులు విచారించనున్నారు.
ప్రస్తుతం నమ్రత హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలో ఖైదీగా ఉన్నారు. ఆమెను జైలు నుంచి కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు. నమ్రతపై హ్యూమన్ ట్రాఫికింగ్‌తో పాటు పలు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పిల్లలు లేని దంపతులను టార్గెట్‌గా చేసుకుని భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో(Srushti Fertility Center) సరోగసి మాటున శివశివుల విక్రయాలు జరిపినట్లు నిర్దారణ కావడంతో డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్ట్ చేశారు.
కొన్నేళ్ల క్రితం సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పేరుతో ఓ కేంద్రాన్ని ప్రారంభించిన డాక్టర్ నమ్రత.. పిల్లలు లేని దంపతులే లక్ష్యంగా సోషల్ మీడియా ద్వారా తన కేంద్రానికి విస్తృత ప్రచారం చేసుకున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్‌బుక్ ద్వారా రకరకాల వీడియోలు, పోస్టులు చేసేవారు. టెస్ట్ ట్యూబ్ బేబీ, సరగసీ విధానాల ద్వారా తల్లిదండ్రులు కావాలనే కోరికను తన ఆస్పత్రిలో నెరవేర్చుకోవచ్చని ప్రచారం చేసేవారు.
అంతేకాక, తమ క్లినిక్‌లో ఉచిత పరీక్షలు అంటూ ఆకట్టుకునేవారు. డిజిటల్ ప్రచారంతో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పేరు మార్మోగేలా చేసి పిల్లలు లేని దంపతులు క్యూకట్టేలా చేసుకున్నారు. అనంతరం దంపతుల బలహీనతను ఆసరాగా చేసుకొని అక్రమ మార్గంలో చిన్నారులను కొనుగోలు చేసి వారికి అప్పగించినట్టు తెలుస్తోంది. కాగా, నమ్రత కస్టడీ విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రేపట్నుంచి ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ షురూ
దేవాదాయశాఖలో ఈ ఆఫీసు సేవలు షురూ..