Share News

Bird Flu: యాదాద్రి జిల్లాలో బర్డ్‌ఫ్లూ

ABN , Publish Date - Feb 23 , 2025 | 04:19 AM

తెలంగాణలో మొదటి బర్డ్‌ఫ్లూ కేసు నమోదైంది. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం నేలపట్లలోని ఓ కోళ్లఫారమ్‌లోని కోళ్లకు బర్డ్‌ఫ్లూ పాజిటివ్‌గా శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

Bird Flu: యాదాద్రి జిల్లాలో బర్డ్‌ఫ్లూ

  • రాష్ట్రంలో తొలి బర్డ్‌ఫ్లూ కేసు

  • స్వాములవారి లింగోటంలో ఐదు వేల కోళ్ల మృత్యువాత

  • మరో 9 వేల కోళ్ల పూడ్చివేత

  • చౌటుప్పల్‌లో 2వేల నాటుకోళ్ల మృతి.. బర్డ్‌ఫ్లూ కాదన్న వైద్యులు

చౌటుప్పల్‌ రూరల్‌/ఐనవోలు, ఫిబ్రవరి 22: తెలంగాణలో మొదటి బర్డ్‌ఫ్లూ కేసు నమోదైంది. యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం నేలపట్లలోని ఓ కోళ్లఫారమ్‌లోని కోళ్లకు బర్డ్‌ఫ్లూ పాజిటివ్‌గా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ప్రభుత్వ ఆదేశాలతో వివిధ శాఖల అధికారులు శనివారం ఆ కోళ్లఫారాన్ని సందర్శించి శానిటైజ్‌ చేశారు. చౌటుప్పల్‌ మండలం నేలపట్లలో పబ్బు మల్లేశానికి చెందిన కోళ్లఫారమ్‌లో ఈనెల 14, 15 తేదీల్లో వెయ్యి కోళ్లకు పైగా మృత్యువాతపడ్డాయి. సమాచారం అందుకున్న పశు వైద్యాధికారి డాక్టర్‌ పృథ్వీరాజ్‌ ఆ ప్రాంతాన్ని సందర్శించి, చనిపోయిన కోళ్లను హైదరాబాద్‌, మధ్యప్రదేశ్‌లోని వెటర్నరీ బయొలాజికల్‌ పరిశోధన కేంద్రాలకు పంపించారు. ఆ కోళ్లు బర్డ్‌ఫ్లూతోనే మృతిచెందినట్టు హైదరాబాద్‌ ల్యాబ్‌ శాస్త్రవేత్తలు శుక్రవారం నిర్ధారించి, ప్రభుత్వానికి నివేదిక ఆందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పశుసంవర్థక శాఖ జిల్లా అధికారి డాక్టర్‌ జానయ్య, ఆర్డీవో శేఖర్‌రెడ్డి, వైద్యాధికారి డాక్టర్‌ యశోద, మండల పశువైద్యాధికారులు డాక్టర్‌ పృథ్విరాజ్‌, డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి కోళ్లఫారాన్ని సందర్శించారు.


సుమారు 50 మంది సిబ్బందితో కోళ్ల ఫారాన్ని శానిటైజ్‌ చేయించారు. ఫారంలోని మట్టిని తొలగించి, ఎక్స్‌కవేటర్‌తో ఓ గోతిలో పూడ్చిపెట్టారు. ఈ పరిసరాల్లోని ఖాళీగా ఉన్న ఆరు కోళ్ల ఫారాల్లోనూ శానిటైజ్‌ చేయించారు. గ్రామాన్ని పరిసరాల్లోని 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని నిఘా జోన్‌గా.. ఒక కిలోమీటర్‌ వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించి, ప్రజలను అప్రమత్తం చేశారు. గ్రామంలోని నాటు కోళ్లను, బ్రాయిలర్‌ కోళ్లను చంపివేయాలని ఆదేశించారు. సమీప గ్రామాల్లోని కిరాణా దుకాణాల్లో ఉన్న కోడి గుడ్లను పారబోశారు. ఇతరులు ఈ గ్రామంలోకి రాకుండా.. పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బందిని నియమించారు. కాగా.. ఇదే మండలంలోని స్వాములవారి లింగోటంలో 5 వేల కోళ్లు మృతిచెందాయి. బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయిన నేలపట్లకు ఈ గ్రామం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. స్వాములవారి లింగోటానికి చెందిన ఆకుల మధు, ఆకుల రవికి 12 వేల కోళ్ల సామర్థ్యంతో షెడ్లు ఉన్నాయి. సోమ లక్ష్మమ్మకు 7 వేల కోళ్ల సామర్థ్యంతో ఫారమ్‌ ఉంది. ఆకుల మధు ఫారంలో 1,500.. రవి షెడ్‌లో మరో 1,500, లక్ష్మమ్మ ఫారంలో 2 వేల కోళ్లు మృతిచెందాయి. నేలపట్లలో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అవ్వడంతో.. రవి, మధు తమ వద్ద మిగిలిన 9 వేల కోళ్లను పూడ్చిపెట్టారు. ఈ ప్రాంతాన్ని పశువైద్యులు ఇంకా సందర్శించాల్సి ఉంది.


2 వేల నాటు కోళ్ల మృతి

రెండు రోజుల వ్యవధిలో 2వేల నాటు కోళ్లు మృత్యువాతపడిన సంఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలో కలకలం లేపింది. తొలుత బర్డ్‌ఫ్లూగా భావించి ఆందోళన చెందగా, వెటర్నరీ వైద్యులు కోళ్లకు పోస్టుమార్టం చేసి.. బర్డ్‌ఫ్లూ కాదని తేల్చారు. కొక్కెర వ్యాధితో ఈ కోళ్లు మృతిచెందినట్లు స్పష్టం చేశారు. కోళ్ల మృతిచెందడంతో పెంపకందారులైన స్వయం సహాయక బృందం(ఎ్‌సహెచ్‌జీ) సభ్యురాలు నోముల సంగీతకు రూ.8లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లింది. నాలుగు నెలల క్రితం శ్రీనిధి కింద రూ.3 లక్షల రుణం తీసుకున్న సంగీత.. 2,400 నాటుకోడి పిల్లల్ని తీసుకువచ్చి, ఫారంలో పెంచుతున్నారు. కోళ్ల వయసు ఐదో నెలకు చేరుకోగా.. ఇప్పటి వరకు వాటి దానాకు, నిర్వహణ ఖర్చులకు, వ్యాక్సిన్లకు కలిపి రూ.8 లక్షల మేర పెట్టుబడి పెట్టారు. శుక్ర, శనివారాల్లో 2 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. కోళ్ల పెంపకంతో అప్పులపాలయ్యానని, ప్రభుత్వమే తనను ఆదుకోవాలని సంగీత కోరుతున్నారు.

Updated Date - Feb 23 , 2025 | 04:19 AM