Nalgonda: అల్లుడిని చెడగొట్టాడనే కసితో అతడి సోదరుడి హత్య
ABN , Publish Date - Apr 17 , 2025 | 05:18 AM
మరో యువతి మోజులో పడి.. తన కుమార్తెను అల్లుడు దూరం పెట్టాడని.. అల్లుడిని ఇలా చెడగొట్టింది అతడి సోదరుడేనని భావించాడు ఆ మామ. ఆ సోదరుడిని చంపితే తప్ప అల్లుడు దారికి రాడని భావించాడు.

మామ పథకం.. ఓకే చెప్పిన కూతురు
నేవీ మాజీ ఉద్యోగికి రూ.15 లక్షల సుపారీ
నల్లగొండ హత్య కేసులో వీడిన మిస్టరీ
నల్లగొండ, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): మరో యువతి మోజులో పడి.. తన కుమార్తెను అల్లుడు దూరం పెట్టాడని.. అల్లుడిని ఇలా చెడగొట్టింది అతడి సోదరుడేనని భావించాడు ఆ మామ. ఆ సోదరుడిని చంపితే తప్ప అల్లుడు దారికి రాడని భావించాడు. ఈ ప్రణాళికకు అతడి కూతురు కూడా ఓకే చెప్పడం విశేషం. ఈ మేరకు నల్లగొండలో 11న జరిగిన ఫొటో స్టూడియో యజమాని గద్దపాటి సురేశ్ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను బుధవారం ఎస్పీ శరత్‌చంద్ర వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన విశ్రాంత ఎక్సైజ్ సీఐ మాతరి వెంకటయ్య తన కుమార్తె ఉమామహేశ్వరిని నకిరేకల్‌కు చెందిన గద్దపాటి సురేశ్ తమ్ముడు నరేశ్‌కు ఇచ్చి 2017లో వివాహం జరిపాడు. మూడేళ్ల తర్వాత నరేశ్, మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకొని.. భార్యను దూరంపెడుతున్నాడు.. ఆమెను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నాడు. దీనిపై భార్యాభర్తల మధ్య కోర్టులో కేసు నడుస్తోంది. నరేశ్ మరో యువతితో సంబంధం కొనసాగిస్తూ ఓ బిడ్డనూ కన్నాడని అతడి మామ వెంకటయ్య తెలుసుకున్నాడు.
అంతకుముందే సురేశ్ కూడా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, తన అల్లుడు నరేశ్ చెడిపోయేందుకు సురేశ్ ప్రోత్సాహమే కారణం అని మామ వెంకటయ్య భావించాడు. ఈ క్రమంలో వెంకటయ్య, ఆయన కుమార్తె ఉమామహేశ్వరి సురేశ్‌ను హత్య చేయించడానికి నిర్ణయించుకున్నారు. ఇందుకు గతంలో నేవీలో పనిచేసి రిటైర్ అయి.. స్కౌట్ డిటెక్టివ్ ఎజెన్సీ నడుపుతున్న చిక్కు కిరణ్‌కుమార్‌ను సంప్రదించారు. రూ.15 లక్షలు ఇచ్చేందుకు కిరణ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్సుగా రూ.2లక్షలు ఇచ్చా రు. కిరణ్‌కుమార్ నెలక్రితం హైదరాబాద్‌కు చెందిన బంధువైన ముషం జగదీశ్‌కు రూ.3లక్షలు ఇస్తానని చెప్పి తన పథకంలో భాగస్వామిగా చేసుకున్నాడు. ఈ క్రమంలో నెలరోజులుగా నల్లగొండలో సురేశ్ కదలికలపై కిరణ్, జగదీశ్ నిఘా పెట్టారు. ఈనెల 11న రాత్రి కిరణ్, జగదీశ్ కలిసి సురేశ్ నిర్వహిస్తున్న ఫొటో స్టూడియో వద్దకు వెళ్లి.. కత్తితో దాడిచేశారు. గొంతులో, వీపులో పొడవడంతో తీవ్ర గాయాలై సురేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. కేసులో వెంకటయ్య, కిరణ్ కుమార్, జగదీశ్, ఉమామహేశ్వరిని అదుపులోని తీసుకున్న పోలీసులు నిందితులను గురువారం కోర్టులో హాజరుపర్చారు.