Moinabad: 1000 కోట్ల భూకుంభకోణం
ABN , Publish Date - Jul 15 , 2025 | 04:19 AM
మెయినాబాద్ మండలం ఎనికేపల్లిలోని సర్వేనంబరు 180లో 99.14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని కొన్ని దశాబ్ధాలుగా స్థానిక పేదలు సాగుచేసుకుంటున్నారు. తమకు ప్రభుత్వమే ఈ భూములు అప్పగించి, పొజిషన్ ఇచ్చిందని..

రాజధాని హైదరాబాద్ శివార్లలో భారీ భూ కుంభకోణం
ఎనికేపల్లి ‘గోశాల’ భూములకు అక్రమార్కుల ఎసరు.. తప్పుడు పత్రాలతో 99.14 ఎకరాల భూమి అమ్మకానికి!
అందులోనే గోశాల నిర్మాణానికి సర్కారు సన్నాహాలు.. ఈ భూసేకరణపై ఇప్పటికే కొనసాగుతున్న వివాదం
ఈ భూముల కొనుగోలుకు రూ.కోటిన్నర అడ్వాన్స్ ఇచ్చి మోసపోయినవారి ఫిర్యాదుతో వెలుగులోకి విషయం
ఫోర్జరీ పత్రాలపై రెవెన్యూ అధికారుల విచారణ.. పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్లు ప్రాథమికంగా నిర్ధారణ
గత ప్రభుత్వ హయాంలోని కొందరు పెద్దల హస్తం?
రాజధాని హైదరాబాద్ శివార్లలో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన గోశాల భూములపై స్థానిక రైతులకు, రెవెన్యూ అధికారుల మధ్య ఓ వైపు వివాదం నడస్తుండగా.. మరోవైపు తప్పుడు పత్రాలతో ఈ భూములను కొల్లగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ మొదలు పెట్టిన రెవెన్యూ అధికారులు.. ఈ భూముల వ్యవహారంలో ఇప్పటికే పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీని వెనుక గత ప్రభుత్వ హయాంలోని కొందరు పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి/మెయినాబాద్)
మెయినాబాద్ మండలం ఎనికేపల్లిలోని సర్వేనంబరు 180లో 99.14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని కొన్ని దశాబ్ధాలుగా స్థానిక పేదలు సాగుచేసుకుంటున్నారు. తమకు ప్రభుత్వమే ఈ భూములు అప్పగించి, పొజిషన్ ఇచ్చిందని.. కానీ పట్టా ఇవ్వలేదని రైతులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ప్రభుత్వం రాష్ట్రంలో గోసంరక్షణ కోసం నాలుగు గోశాలలను నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా భూసేకరణ పనులు మొదలుపెట్టి ఎనికేపల్లిలోని భూమిలో గోశాల నిర్మాణ పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. సర్కారు ఆదేశాల మేరకు అధికారులు ఆగమేఘాలపై రంగంలోకి దిగి.. ఆ భూమిలో రెండెకరాలు కబ్జాకు గురైనట్టు గుర్తించి, ఆ స్థలాన్ని కబ్జా కోరల నుంచి విడిపించారు. మరోవైపు.. తాము సాగు చేసుకుంటున్న ఈ భూములను సర్కారు స్వాధీనం చేసుకునే యత్నం చేయడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. 50 ఏళ్లుగా ఈ భూములు సాగు చేసుకుంటున్నామని, కావాలంటే గోశాలను వేరే ప్రాంతంలో నిర్మించుకోవాలని చెబుతూ వారు ఈ భూముల స్వాధీనాన్ని అడ్డుకుంటున్నారు. లేదంటే తమకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించిన తరువాతనే భూములు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. వారికి సంఘీభావంగా ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా రోజువారీ నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సోమవారం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా నిరసన కార్యక్రమాల్లో పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. అయితే రెవెన్యూ అధికారులు మాత్రం ఈ భూములను పేదలకు అసైన్ చేసినట్లు రికార్డుల్లో ఎక్కడా లేదని చెబుతున్నారు. చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ, మెయినాబాద్ తహసీల్దార్ గౌతమ్ రైతులను కలిసి ఇదే విషయాన్ని వివరించారు. అయినా రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ భూమికిసమీపంలో అభివృద్ధి చేసిన లే-అవుట్‌లో ఎకరానికి 300 గజాల చొప్పున రైతులకు పరిహారం కింద ఇస్తామన్నారు. ఈ ప్రతిపాదనను కొందరు వ్యతిరేకించగా మరికొందరు అంగీకరించారు. ఇలా అంగీకరించిన 21 మంది రైతులకు మంగళవారం పట్టాలు ఇస్తున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఇంతలోనే.. రూ.1000 కోట్లకు పైగా విలువైన ఆ 99.14 ఎకరాల భూమినీ కొనుగోలు చేసేందుకు తాము ఒప్పందం చేసుకున్నామంటూ కొందరు వ్యక్తులు అధికారులను ఆశ్రయించడంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది!
అధికారుల విచారణ..
ఎనికేపల్లి భూములను కొట్టేసే కుట్ర విషయం బయటపడడంతో.. రెవెన్యూ యంత్రాంగం విచారణ మొదలు పెట్టింది. ఈ భూములకు సంబంధించి పెద్ద మొత్తంలో చేతులు మారిన సంగతి వారి ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయినట్టు సమాచారం. విశ్వసనీయ వర్గాలు తెలిపిన మేరకు.. గత ప్రభుత్వ హయాంలో కొందరు వ్యక్తులు.. డప్పు రమేశ్ అనే వ్యక్తితో సహా 46 మంది పేర్లపై ఈ భూములకు సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించారు. 20 ఏళ్ల నుంచి ఆ భూమి తమ పొజిషన్‌లోనే ఉన్నట్లుగా మెయినాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయం పేరుతో ఫోర్జరీ పొజిషన్ సర్టిఫికెట్ సృష్టించారు. డప్పు రమేశ్.. మిగిలిన 45 మంది నుంచీ ఏజీపీ తీసుకున్నట్లు మరో పత్రం సృష్టించారు. ఆ తప్పుడు పత్రాల సాయంతో మొత్తం 99.14 ఎకరాల భూమినీ.. హైదరాబాద్‌కు చెందిన బి.లింగారెడ్డి, సుభాష్ చంద్ అగర్వాల్, నవీన్ అగర్వాల్‌కు విక్రయించేందుకు సిద్ధమయ్యాడు. 2019 ఫిబ్రవరి 11, అక్టోబర్ 4 తేదీల్లో వారితో ఒప్పందాలు చేసుకుని.. మూడు దశల్లో రూ.కోటిన్నర అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. గడువు ముగిసినా భూములను రిజిస్ట్రేషన్ చేయకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇటీవల ఈ భూములను గోశాల కోసం ప్రభుత్వం సేకరిస్తుందనే విషయం పత్రికల్లో రావడంతో.. ఒప్పందం చేసుకున్న వారు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. భూములు ప్రభుత్వానివని తెలిసి వారంతా కంగుతిన్నారు. తాము మోసపోయామని గుర్తించి.. సోమవారం స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసులను ఆశ్రయించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో డప్పు రమేశ్ తమను మోసం చేశాడని.. బి.లింగారెడ్డి రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎనికేపల్లిలో సర్వేనంబరు 180లోని ప్రభుత్వ భూమిని ప్రైవేటు పట్టా భూమిగా చూపించి, కుట్రపూరితంగా తమకు అగ్రిమెంట్ చేసి రూ.1.5 కోట్లు అడ్వాన్స్ కింద తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు మెయినాబాద్ పోలీసులు డప్పు రమేశ్‌పై కేసు నమోదు చేశారు. పైకి డప్పు రమేశ్ పేరు వినిపిస్తున్నప్పటికీ.. ఈ వ్యవహారంలో తెర వెనుక గత ప్రభుత్వానికి చెందిన కొందరు పెద్దల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై లోతైన విచారణ జరిపితే వారి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాగా.. ఈ కుంభకోణంపై సర్కార్ కూడా సీరియ్‌సగా ఉన్నట్లు తెలిసింది. దీని వెనుక ఉన్న వ్యక్తుల పేర్లను వెలికి తీయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదు '
తిరుపతి రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం.. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చెలరేగిన మంటలు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి