అప్పు తీర్చాలని బ్యాంకు సిబ్బంది ఒత్తిడి.. రైతు ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం !
ABN , Publish Date - Feb 26 , 2025 | 04:06 AM
రుణం చెల్లించకపోతే భూమిని స్వాధీనం చేసుకుంటామని బ్యాంకు అధికారులు హెచ్చరించడంతో ఓ రైతు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

గుర్రంపోడు, యాచారం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): రుణం చెల్లించకపోతే భూమిని స్వాధీనం చేసుకుంటామని బ్యాంకు అధికారులు హెచ్చరించడంతో ఓ రైతు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనపల్లితండాకు చెందిన రైతు వడ్త్యా జవహర్‌లాల్(35) మండల కేంద్రంలోని కేంద్ర సహకార బ్యాంకు లో భూమిని తనఖా పెట్టి నాలుగేళ్ల క్రితం రూ.15లక్షలు అప్పు తీసుకున్నాడు. రెండు కిస్తీలను చెల్లించకపోవడంతో మంగళవారం బ్యాంకు సిబ్బంది రైతు ఇంటికి వెళ్లి అప్పు చెల్లించని పక్షంలో భూమిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. మనోవేదనకు గురైన వడ్త్యా జవహర్‌లాల్ బ్యాంకు సిబ్బంది ఎదుటే గడ్డి మందు తాగాడు. నల్లగొండ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు.
అలాగే, రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గడ్డమల్లయ్యగూడకు చెందిన ఇక్కె మల్లమ్మకు మేడిపల్లిలోని సర్వే నం.95లో మూడెకరాల భూమి ఉంది. దీనిపై సొసైటీలో ఆమె రూ.4.28 లక్షల రుణం తీసుకుంది. ఈ భూమిని ఫార్మాసిటీకి కోసం గతంలో ప్రభుత్వం తీసుకోవడంతో పరిహారం వస్తుందని, రైతు రుణమాఫీ అవుతుందన్న ఉద్దేశంతో మల్లమ్మ రుణం చెల్లించలేదు. దీంతో వడ్డీతో కలిపి అప్పు రూ.7.28 లక్షలకు చేరింది. బాకీ చెల్లించడం లేదన్న కారణంతో మంగళవారం మల్లమ్మ ఇంటికి వచ్చిన బ్యాంకు అధికారులు అక్కడే ఉన్న బైక్‌ను తీసుకెళ్లిపోయారు. కాగా, తీసుకున్న రుణంలో రూ.2.60 లక్షల బాకీ చెల్లించామని, అయినా బాకీ పడ్డామని బైక్ తీసుకెళ్లడం అన్యాయమని, పైగా ఆ బైక్ కూడా తనది కాదని పొలం పనులకు వచ్చే కూలీదని మల్లమ్మ కుమారుడు పర్వతాలు ఆవేదన వ్యక్తం చేశాడు.