Medchal: అన్నను పొడిచి చంపిన తమ్ముళ్లు
ABN , Publish Date - Feb 17 , 2025 | 04:28 AM
మద్యం మత్తులో ఇంటిల్లిపాదిని తిడుతూ నిత్యం నానాయాగి చేస్తున్న అన్నను అతని తమ్ముళ్లే చంపేశారు. కత్తులతో వెంబడించి విచక్షణారహితంగా పొడిచి నడిరోడ్డుపైనే అతని ప్రాణం తీశారు.

మేడ్చల్‌లో పట్టపగలు నడిరోడ్డుపై హత్య
మేడ్చల్ టౌన్, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో ఇంటిల్లిపాదిని తిడుతూ నిత్యం నానాయాగి చేస్తున్న అన్నను అతని తమ్ముళ్లే చంపేశారు. కత్తులతో వెంబడించి విచక్షణారహితంగా పొడిచి నడిరోడ్డుపైనే అతని ప్రాణం తీశారు. మేడ్చల్ పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఉమేశ్(30) అనే వ్యక్తి మరణించాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా, మాసిరెడ్డి గ్రామానికి చెందిన గన్య.. మేడ్చల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఉద్యోగరిత్యా భార్య, కుమారులు ఉమేశ్, రాకేశ్, కుమార్తెతో కలిసి గన్య మేడ్చల్‌లో నివాసముంటున్నాడు. గన్య పెద్దకొడుకు ఉమేశ్(30)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, కుటుంబ కలహాల వల్ల మద్యానికి బానిసైన ఉమేశ్ మద్యం మత్తులో ఇంటికివచ్చి నిత్యం గొడవలు పడుతుంటాడు.
అలాగే, ఆదివారం కూడా తప్పతాగి ఇంటికొచ్చిన ఉమేశ్.. తల్లి, భార్యను కొట్టడమే కాక ఇతర కుటుంబసభ్యులను దుర్బాషలాడాడు. దీంతో ఆగ్రహించిన అతని తమ్ముడు రాకేశ్, వారి బాబాయి కొడుకు లక్ష్మణ్‌తో కలిసి ఉమేశ్‌పై దాడి చేశాడు. వారి నుంచి తప్పించుకున్న ఉమేశ్.. మేడ్చల్ ఆర్టీసీ డిపో ముందున్న జాతీయ రహదారిపై పరుగులు తీశాడు. అయితే, ఉమేశ్‌ను అడ్డుకున్న రాకేశ్, లక్ష్మణ్ తమ వెంట తెచ్చుకున్న కత్తులతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు. దాదాపు 12 కత్తిపోట్లకు గురైన ఉమేశ్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఉమేశ్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, ఈ దారుణాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. దాడిని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించినా ఆపలేకపోయారు.