సికింద్రాబాద్: ఆర్మీ డ్రెస్‌లో కాలేజీలోకి దూరిన దుండగులు.. ఏం చేశారంటే!
ABN , Publish Date - Jun 20 , 2025 | 11:48 AM
సికింద్రాబాద్: ఉద్యోగం పేరుతో రకరకాల మార్గాల్లో యువతను మాయచేస్తున్నారు కేటుగాళ్లు. సికింద్రాబాద్ లోనూ తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. ఆర్మీ నకిలీ ఐడీ కార్డుతో మిలటరీ కాలేజీ ప్రాంగణంలోకి చొరబడిన ఆగంతకులు ఏం చేశారంటే..

Fake Army ID Card Arrest: ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆశచూపి నిరుద్యోగుల నుంచి డబ్బు గుంజుతూ మోసాలకు పాల్పడే మాయగాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. నకిలీ వీసాలు, జాబ్ ఆఫర్ లెటర్లు ఇచ్చి అమాయకులను నట్టేట ముంచుతున్నారు కేటుగాళ్లు. తాజాగా అలాంటి ఘరానా మోసమే సికింద్రాబాద్‌లో వెలుగు చూసింది. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ యువతను మోసగిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఆర్మీ టీ షర్ట్స్ ధరించి సికింద్రాబాద్ మిలిటరీ కాలేజీలోకి దూరారు ఆగంతకులు. లోపలికి వెళ్లాక వీరి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో భద్రతా సిబ్బంది ప్రశ్నించారు.
సికింద్రాబాద్ పరిధిలోని ఎంసీఈఎంఈలోని టెక్నో చౌక్ గేటు నుంచి నలుగురు వ్యక్తులు ఆర్మీ అధికారులమంటూ నకిలీ గుర్తింపు కార్డుతో చొరబడటం కలకలం రేపుతోంది. క్యాంటీన్, ఆర్మీ రహస్య ప్రాంతాల వద్ద ఫోటోలు, వీడియోలు తీస్తుండగా భద్రతా సిబ్బంది దుండగులను అడ్డుకున్నారు. వారి వద్ద ఉన్న గుర్తింపు కార్డులను పరిశీలించగా అవి నకిలీవని నిర్ధారణ అయింది. దీంతో లెఫ్టినెంట్ కల్నల్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇద్దరు అమ్మాయిలకు జాబ్ ఇప్పిస్తానని నమ్మబలికాడు ఓ యువకుడు. ఈ క్రమంలోనే తాను ఆర్మీ అధికారినని నమ్మించేందుకు తన ముఠాతో కలిసి నకిలీ ఐడీ కార్డులతో మిలిటరీ కాలేజీలోకి ప్రవేశించారు. ఆర్మీ డ్రెస్ ధరించి ఉండటంతో గేటు దగ్గర ఉన్న సిబ్బంది కూడా వాళ్లని ఆపలేదు. అలా కాలేజీ ప్రాంగణంలోకి ప్రవేశించిన ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయిలు మిలటరీ క్యాంటీన్ వద్ద వీడియోలు తీయడం మొదలుపెట్టారు. ఇది గమనించిన భద్రతా సిబ్బంది అనుమానం రావడంతో వారిని ప్రశ్నించారు. గుర్తింపు కార్డులు చెక్ చేయగా అవి నకిలీవని తేలింది. వెంటనే నిందింతులను తిరుమలగిరి పోలీసులకు అప్పగించారు. అయితే, నలుగురు నిందితులు ఆర్మీ రహస్య ప్రాంతాలను చిత్రీకరించడంతో మరేదో కారణం కూడా ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారణ జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి
భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
Nita Ambani Donation: బల్కంపేట ఎల్లమ్మకు నీతా అంబానీ భారీ విరాళం
Read Latest Telangana News And Telugu News