Excise Raids: 699 లీటర్ల కల్తీ కల్లు ధ్వంసం
ABN , Publish Date - Jul 17 , 2025 | 05:39 AM
హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా కల్లు కాంపౌండ్‌లపై ఎక్సైజ్ దాడులు కొనసాగుతున్నాయి. సోమవారం ప్రారంభమైన ప్రత్యేక తనిఖీలను ఎక్సైజ్ స్టేషన్ల సిబ్బందితో కలిసి నిర్వహిస్తున్నారు.

గ్రేటర్ పరిధిలో కల్లు కాంపౌండ్లపై.. కొనసాగుతున్న ఎక్సైజ్ శాఖ దాడులు
3 దుకాణాలపై కేసులు.. ముగ్గురి అరెస్టు
హైదరాబాద్ సిటీ, జూలై 16 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా కల్లు కాంపౌండ్‌లపై ఎక్సైజ్ దాడులు కొనసాగుతున్నాయి. సోమవారం ప్రారంభమైన ప్రత్యేక తనిఖీలను ఎక్సైజ్ స్టేషన్ల సిబ్బందితో కలిసి నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితంఉప్పల్ నల్లచెరువు, ఘట్‌కేసర్, సరూర్‌నగర్, రామంతాపూర్, ముషీరాబాద్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో 420 లీటర్ల కల్తీ కల్లును ఎక్సైజ్ సిబ్బంది స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. తాజాగా బుధవారం గ్రేటర్ పరిధిలోని మల్లాకుంట, మంగళ్‌హాట్, గుడిమల్కాపూర్‌లో నిర్వహించిన దాడుల్లో 699 లీటర్ల కల్తీ కల్లును స్వాధీనం చేసుకొని పారబోశారు. మూడు దుకాణాలపై కేసులు నమోదు చేసి, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మల్లాకుంట ప్రాంతంలో 70 లీటర్ల కల్తీ కల్లును ధ్వంసం చేసి నిందితుడు మల్లప్పను అరెస్టు చేశారు. మరో నిందితుడు ఎస్.బసవరాజ్‌పై కేసు నమోదు చేశారు. మంగళ్‌హాట్ ప్రాంతంలోని ఓ దుకాణంలో అనుమతి లేకుండా విక్రయిస్తున్న 247 లీటర్ల కల్లును ఎక్సైజ్ అధికారులు పారబోశారు. దుకాణ నిర్వాహకుడు బి.అనిల్‌గౌడ్‌ను అరెస్టు చేశారు. రామచంద్రయ్య అనే మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. కాగా, గుడిమల్కాపూర్‌లోని హీరానగర్‌లో అనుమతి లేని కల్లు డిపోలో 382 లీటర్ల కల్లును పారబోశారు. నిర్వాహకుడు గోదా రాఘవేందర్ గౌడ్‌ను అరెస్టు చేశారు. రామకృష్ణగౌడ్ అనే మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ మూడు కేసులను ధూల్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. శేరిలింగంపల్లిలోని పలు కల్లు డిపోలపై సీఐ నాగరాజు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు.
నిరంతరం శాంపిల్స్ సేకరణ..
కల్లు కాంపౌండ్‌లపై ఇక నుంచి నిరంతరం దాడులు నిర్వహించి శాంపిల్స్ సేకరించాలని, కల్తీ కల్లు విక్రయిస్తున్నట్లు తేలితే వెంటనే కేసులు నమోదు చేసి, దుకాణాలు సీజ్ చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసిం ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. కూకట్‌పల్లి పరిధిలో జరిగిన కల్తీకల్లు ఘటనలు మరెక్కడా పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సొసైటీలు ఉన్నాయి? వాటి పరిధిలో నడిచే కల్లు దుకాణాలు ఎన్ని? ఆ దుకాణాల్లో అమ్మకాలు జరుపుతున్న కల్లు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు? అనే డేటాతో పాటు అమ్మకాలు జరుపుతున్న దుకాణాల నుంచి కల్లు శాంపిళ్లను సేకరించి కచ్చితంగా పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించాలని అన్నారు. అనుమతులు లేకుండా నడుపుతున్న కల్లు దుకాణాలను సీజ్ చేయడంతో పాటు వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి
కాళేశ్వరం అవినీతి ఇంజినీర్లకు ఇక చుక్కలే..ఈడీ విచారణకు సిద్ధం..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి