Share News

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు..మరోసారి ప్రభాకర్‌రావు విచారణ

ABN , Publish Date - Jul 16 , 2025 | 03:30 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు మరోసారి సిట్‌ విచారణకు హజరయ్యారు

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు..మరోసారి ప్రభాకర్‌రావు విచారణ

  • పలువురు సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నలు

  • అంతా ఉన్నతాధికారులకు తెలుసు

  • విచారణలో వెల్లడించిన ప్రభాకర్‌రావు

హైదరాబాద్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు మరోసారి సిట్‌ విచారణకు హజరయ్యారు. డీసీపీ విజయకుమార్‌, ఏసీపీ వెంకటగిరి ఆయనను మంగళవారం సుమారు ఎనిమిదిన్నర గంటల పాటు విచారించారు. రాత్రి 7.30 సమయంలో సిట్‌ కార్యాలయం నుంచి పంపించారు. ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి.. మోసపూరిత విధానాలతో 618 మంది వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్‌ చేసిన విషయంలో ప్రభాకర్‌రావును సిట్‌ అధికారులు నిశితంగా విచారించారు. ‘‘నక్సల్స్‌ సమాచారం కోసమంటూ, మావోయిస్టులతో సంబంధం లేని రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, పారిశ్రామిక వేత్తలు, సెలబ్రిటీల ఫోన్లను ఎందుకు ట్యాప్‌ చేయించారు? మీరు అలా చేయడానికి కారణం ఏమిటీ?.. అది మీ సొంత నిర్ణయమా? లేక ఎవరైనా ఆదేశించారా? ’ అంటూ ప్రభాకర్‌రావుపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. మావోయిస్టుల సమాచారం కోసమంటూ ప్రభాకర్‌రావు పెట్టిన లిస్టులోని 618 మందిలో దాదాపు 300 మంది వాంగ్మూలాలను సిట్‌ అధికారులు ఇప్పటికే నమోదు చేశారు. ఈ వాంగ్మూలాలను ప్రభాకర్‌ రావు ముందు పెట్టి, వీరంతా మావోయిస్టులతో సంబంధం లేని వారే కదా?? ఎందుకు మీరు ఆ విధంగా చేయాల్సి వచ్చిందంటూ ప్రశ్నించారు. ప్రభాకర్‌ రావు చాలా ప్రశ్నలకు సమాధానమివ్వలేదని, విచారణకు సహకరించలేదని.. ‘‘గుర్తులేదు.. తెలియదు’’ అనే సమాధానాలు ఇచ్చారని తెలుస్తోంది. మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావులు ప్రభాకర్‌రావు ఆదేశాలను పాటించినట్లు సిట్‌కు ఇచ్చిన వాంగ్మూలాల్లో పేర్కొన్న విషయం తెలిసిందే..! దీన్ని ప్రభాకర్‌రావు తప్పుబడుతూ వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. ‘‘పోలీసు కస్టడీలో వాంగ్మూలానికి చట్టబద్ధత లేదు. మీరు రాసుకునేది రాసుకుంటారు. రాయించేది రాయిస్తున్నారు. నా సర్వీసు మొత్తంలో ఉన్నతాధికారులు చెప్పినట్లే చేశాను. నాపైన చాలా మంది అధికారులు ఉన్న సంగతి మీకూ తెలుసు. అంతా ఉన్నతాధికారులకు తెలుసు’’ అని మంగళవారం నాటి విచారణ సందర్భంగా ప్రభాకర్‌రావు వ్యాఖ్యానించినట్లు సమాచారం.


కాగా, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎంఎల్‌సీ చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నకు సిట్‌ నోటీసులు జారీ చేసింది. గురువారం విచారణకు రావాలని సిట్‌ ఏసీపీ వెంకటగిరి ఆయనకు నోటీసు జారీ చేశారు.

19న నూతన సీజేగా ఏకే సింగ్‌ ప్రమాణం

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియామకమైన అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ (ఏకే సింగ్‌) ఈ నెల 19న రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ నూతన సీజేతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. 19న మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ మేరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.

కన్వీనర్‌ కోటా మెడికల్‌ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌లో పాల్గొనదల్చిన అభ్యర్థులు ఈ నెల 16 నుంచి 25వ తేదీ లోపు వర్సిటీ వెబ్‌సైట్‌లో తమ వివరాలను అప్‌లోడ్‌ చేసుకోవాలని తెలిపింది. ముఖ్యంగా కులం, స్థానికతకు సంబంధించిన ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయాలని సూచించింది.

Updated Date - Jul 16 , 2025 | 03:30 AM