Share News

Mental Stress: బిల్లులు రాక మాజీ సర్పంచ్‌ భర్త ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Jul 16 , 2025 | 05:12 AM

అభివృద్ధి పనుల బిల్లులు ఏళ్ల తరబడి నిలిచిపోవడంతో మనస్తాపానికి గురైన మాజీ సర్పంచ్‌ భర్త గడ్డి మందు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు.

Mental Stress: బిల్లులు రాక మాజీ సర్పంచ్‌ భర్త ఆత్మహత్యాయత్నం

  • ఆస్పత్రికి తరలింపు.. పరిస్థితి విషమం

  • కరీంనగర్‌ జిల్లా లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ఘటన

గంగాధర, జూలై 15 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పనుల బిల్లులు ఏళ్ల తరబడి నిలిచిపోవడంతో మనస్తాపానికి గురైన మాజీ సర్పంచ్‌ భర్త గడ్డి మందు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి మాజీ సర్పంచ్‌ తాళ్ల విజయలక్ష్మి తన పదవీ కాలంలో అప్పులు చేసి గ్రామంలో డ్రైనేజీలు, సీసీ రోడ్లను నిర్మించారు. వాటికి సంబంధించిన రూ.11 లక్షల బిల్లులు ప్రభుత్వానికి సమర్పించి మూడున్నరేళ్లు గడిచినా మంజూరు చేయడంలేదు. అప్పులిచ్చిన వారు అడుగుతుండడంతో గతంలో పది గుంటల వ ్యవసాయ భూమితోపాటు మెడలోని బంగారాన్ని కుదువపెట్టి విజయలక్ష్మి కొందరికి చెల్లించారు. మిగతా అప్పులకు వడ్డీలు పెరిగాయి. అప్పులిచ్చిన వాళ్లు అడుగుతుండడం.. అప్పులు, వడ్డీలు చెల్లించే మార్గం కనిపించకపోవడంతో ఆందోళన చెందిన సర్పంచ్‌ విజయలక్ష్మి భర్త రవి సోమవారం గడ్డి మందు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబసభ్యులు వెంటనే కరీంనగర్‌లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, సర్పంచ్‌గా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అప్పులు చేసి సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించానని, వడ్డీలకు 10 గుంటల భూమి అమ్మి, బంగారం కుదువ పెట్టి కొంత మొత్తం చెల్లించినా, వడ్డీలు కట్టినా ఇంకా అసలు అలాగే ఉందని మాజీ సర్పంచ్‌ విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు, మరో వైపు వడ్డీలు కట్టలేక తన భర్త మనోవేదనతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని, ప్రభుత్వం తమ బాధలు అర్థం చేసుకుని పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని ఆమె కోరారు.

Updated Date - Jul 16 , 2025 | 05:12 AM