Etela Rajender: లక్ష కోట్ల బడ్జెట్ 3లక్షల కోట్లకు పెరిగింది
ABN , Publish Date - May 07 , 2025 | 04:03 AM
ఈటల రాజేందర్ సీఎం రేవంత్‌రెడ్డి పాలనను తీవ్రంగా ఆక్షేపించారు. బడ్జెట్ పెరుగుదలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మంచిదని, రేవంత్ వ్యాఖ్యలు పొరపాటుగా నిరూపించారని అన్నారు.

పాలన చేతగాక పేద రాష్ట్రమంటారా?: ఈటల
అధికారులను బ్యాంకులు దొంగల్లాగా చూస్తున్నాయని రాష్ట్రం పరువు తీశారు
రేవంత్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలి: ఈటల
హైదరాబాద్, మే 6(ఆంధ్రజ్యోతి): ఉద్యోగ సంఘాల సమ్మెపై సీఎం రేవంత్ మాట్లాడిన మాటలతో తెలంగాణ సమాజం తలదించుకోవాల్సి వచ్చిందని, ఆయన రాష్ట్రం పరువు తీశారని మల్కాజ్‌గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. 2014లో రూ.30వేల కోట్ల పన్ను ఆదాయం ఉన్న రాష్ట్రం 11 ఏళ్లలో రూ.1.30 లక్షల కోట్లకు చేరుకుందంటే అది దివాలానా అని ప్రశ్నించారు. లక్ష కోట్ల బడ్జెట్ 3లక్షల కోట్లకు పెరగడం ఆర్థిక సంక్షోభమా అని నిలదీశారు. తాజా వ్యాఖ్యలతో రేవంత్ అబద్ధాలకోరు అని తేలిందన్నారు. తెలంగాణ దివాలా తీసిందని రేవంత్ పదే పదే చెప్తూ తన దివాలాకోరుతనాన్ని బయటపెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలన చేతగాకపోతే రేవంత్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేనందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. పరిపాలన చేతగాక తెలంగాణను పేద రాష్ట్రంగా చిత్రించే సీఎం ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఈటల అన్నారు. తెలంగాణ అధికారులు బ్యాంకులకు పోతే దొంగల్లాగా చూస్తున్నారని సీఎం వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ఒక వేళ నిజంగానే ఆర్థిక పరిస్థితి లేదనుకుంటే సీఎం మరింత నిబద్ధతతో, ప్రణాళికతో పనిచేయాలని, అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని సూచించారు. కానీ సీఎం రేవంత్ ఇంత తొందరగా కాడి వదిలేస్తారని, తెలంగాణ సమాజం, రాష్ట్రం పరువు తీస్తారని ఎవరూ ఊహించలేదన్నారు.
తెలంగాణ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను ఇప్పటికైనా ప్రభుత్వం చెల్లించాలని, ఆర్టీసీ కార్మికులను పిలిచి మాట్లాడాలని ఈటల డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజం కుంగిపోవద్దని, ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. 2014-15లో రూ.లక్ష కోట్ల బడ్జెట్ పెట్టిన రాష్ట్రంలో.. 11 ఏళ్ల తరువాత ఇటీవల భట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ రూ.3.4 లక్షల కోట్లు ఉందంటే రాష్ట్రం పురోగమిస్తున్నట్టా.. కాదా.. అని ఈటల ప్రశ్నించారు. తెలంగాణలో పెట్టుబడి వ్యయం 2014-15లో రూ.8,373 కోట్లుంటే.. 2023-24లో రూ.44 వేల కోట్లు, రేవంత్ పాలనలో కూడా రూ.32 వేల కోట్లు ఉందన్నారు. ఏ రాష్ట్రంలో పెట్టుబడి వ్యయం పెరుగుతుందో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందనడానికి నిదర్శనమని చెప్పారు. తాను ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ఆదాయం క్రమంగా పెరిగిందని ఈటల చెప్పారు. 2014-15లో రూ.29,285 కోట్లు ఉంటే.. 2024-25లో రూ.1.28లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. ఈ లెక్కలు రాష్ట్ర బలమైన ఆర్థిక స్థితిని సూచిస్తున్నాయని చెప్పారు. అలాంటి రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి. ఒక వ్యక్తిని, ఒక పార్టీని దృష్టిలో పెట్టుకుని దివాలా తీసిందని పదే పదే చెప్పడం సరికాదని ఈటల ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.