Bandi Sanjay Etela Feud: బీ కేర్‌ఫుల్.. కొడకా
ABN , Publish Date - Jul 20 , 2025 | 02:48 AM
తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్.. సాక్షాత్తూ

వాడు సైకోనా.. శాడిస్టా?.. పశువా?
ఎవని అండతో ధైర్యం చేస్తున్నాడు?
కేంద్రమంత్రి బండిపై పరోక్షంగా..
ఎంపీ ఈటల సంచలన వ్యాఖ్యలు
ధీరులతో కొట్లాడుతా.. కుట్రలు చేసే వారితో కాదు..
హుజూరాబాద్ కార్యకర్తలతో ఈటల
హైదరాబాద్/మేడ్చల్/హుజూరాబాద్, జులై 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్.. సాక్షాత్తూ సొంత పార్టీకే చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బీ కేర్‌ఫుల్.. కొడకా.. బీ కేర్‌ఫుల్’ అంటూ హెచ్చరిక జారీ చేశారు. ‘‘వాడు సైకోనా.. శాడిస్టా? మనిషా.. పశువా? ఏ పార్టీలో ఉన్నడు? ఎవని అండతో ధైర్యం చేస్తున్నడు? మేం శత్రువుతో కొట్లాడుతం. కానీ, కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే సంస్కృతి మా రక్తంలో లేదు. నీ శక్తి ఏంది? యుక్తి ఏంది? నీ చరిత్ర ఏంది? మా చరిత్ర ఏందిరా?’’ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో ఏమేం పెడుతున్నారో అన్నీ పైకి పంపిస్తానన్నారు. ఇలాంటి వాటిని అరికట్టకపోతే తనకేమీ నష్టం లేదని వ్యాఖ్యానించారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంటుకు సంబంధించి ఈటల రాజేందర్‌కు, బండి సంజయ్‌కి మధ్య అంతర్గతంగా విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో శనివారం పలువురు హుజూరాబాద్ నాయకులు, కార్యకర్తలు శామీర్‌పేటలోని ఈటల నివాసానికి వచ్చారు. ఈటలతోపాటు బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరిన తమకు స్థానికంగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలిపారు. జిల్లాలో ఇతర బీజేపీ నాయకులు.. ఈటల వర్గాన్ని పార్టీకి దూరం చేయాలని చూస్తున్నారని మొర పెట్టుకున్నారు. స్థానిక ఎన్నికల్లో తమకు సీట్లు కేటాయించేలా చూడాలని కోరారు. దీంతో ఆగ్రహానికి గురైన ఈటల.. పరోక్షంగా సంజయ్‌పై నిప్పులు చెరిగారు.
మౌనంగా ఉంటే బలహీనుడిగా చూడొద్దు..
‘‘మౌనంగా ఉండేవాణ్ని బలహీనుడిగా చూడవద్దు. పిచ్చి వేషాలు వేస్తే నష్టం ఎవరికో మీకు తెలుస్తుంది. నా జోలికి రావద్దు.. అడ్డు రావద్దు. శామీర్‌పేట బీజేపీ అడ్డా. ఇక్కడ ఎంపీని నేను. ప్రధాని మోదీ మొదట ప్రచారం చేసిన గడ్డ ఇది. గ్రామంలో క్రెడిబులిటీ ఉన్న లీడర్ లేకపోతే పార్టీ బతకదని నమ్మినవాణ్ని. వ్యక్తులు ఎదగకుండా పార్టీలు ఎదగవు. మానవ సంబంధాలు మీకేం తెలుసు? సోషల్ మీడియాను నమ్ముకొని, అబద్ధాల పునాదుల మీద, కుట్రలు కుతంత్రాల మీద కొంతమంది బతుకుతున్నారు. నాది స్ర్టెయిట్ ఫైట్. స్ర్టీట్ ఫైట్ ఉండదు. రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్ లాంటి వాళ్లతోనే కొట్లాడాం. ధీరుడు ఎక్కడా భయపడడు. కొంతమంది వెకిలిగాళ్లు ఇంకెక్కడి తెలంగాణ ఉద్యమం అంటున్నారు. కానీ, హుజూరాబాద్‌లో మేము చేసిన ఉద్యమం ఇంకా మా గుండెల్లో ఉంది. చైతన్యం, ముక్కుసూటితనంతో బరిగీసి కొట్లాడిన గడ్డ హుజూరాబాద్ గడ్డ.
మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్లం’’ అని ఈటల అన్నారు. ధీరుడితో కొట్లాడుతాం తప్ప కుట్రదారులతో కొట్లాడేవాళ్లం కాదన్నారు. బీఆర్‌ఎస్ నుంచి తమకు తాముగా బయటకు రాలేదని, అనేక అవమానాలకు గురిచేసి బలవంతంగా బయటకు పంపారని తెలిపారు.. దేశచరిత్రలో ఆరు నెలల పాటు ఎన్నికల ప్రచారం జరిగింది హుజురాబాద్‌లోనే అని, అయినా.. తెలంగాణ ఆత్మగౌరవం గెలిచిందని, ప్రజలు కేసీఆర్ చెంప చెళ్లుమనిపించారని తెలిపారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి అంకితభావంతో పనిచేశానని పేర్కొన్నారు.
పదిరోజులకోసారి హుజురాబాద్ వస్తా..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తాను అడుగుపెట్టని గ్రామం లేదని ఈటల అన్నారు. ‘‘ప్రతీ పదిరోజులకోసారి హుజురాబాద్ వస్తా. మీ గెలుపుకోసం పని చేస్తా. నియోజకవర్గంలోని ప్రతీ మండల కేంద్రంలో ఆఫీసు ఉంటుంది. ప్రతి ఊర్లో మన సర్పంచ్ ఉంటారు. నన్ను నమ్ముకున్న గడ్డ. గుర్తించి టికెట్ ఇేస్త సరే.. లేదంటే వార్డు మెంబర్ నుంచి సర్పంచ్.. ఎంపీటీసీ నుంచి ఎంపీపీ వరకు, జడ్పీటీసీ నుంచి జడ్పీ చైర్మన్ వరకు అన్నీ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తారనే నమ్మకం ఉంది’’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్
Read Latest Telangana News and National News