Share News

NHAI: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి పర్యావరణ అనుమతులు!

ABN , Publish Date - Apr 30 , 2025 | 04:32 AM

రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం నిర్మాణం దిశగా మరో అడుగు ముందుకుపడింది. కేంద్ర ప్రభుత్వం ఈ రహదారికి పర్యావరణ అనుమతులను మంజూరు చేసింది.

NHAI: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి పర్యావరణ అనుమతులు!

  • ఈ ప్రాజెక్టుకు కేంద్ర అనుమతులన్నీ వచ్చేసినట్లే

  • కేంద్ర క్యాబినెట్‌లో ఆమోదించడమే తరువాయి

  • నిర్వాసితులకు పరిహారం చెల్లింపునకూ సుగమం

  • 6 లేన్లతో రహదారి నిర్మాణం.. తుది దశకు డీపీఆర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం నిర్మాణం దిశగా మరో అడుగు ముందుకుపడింది. కేంద్ర ప్రభుత్వం ఈ రహదారికి పర్యావరణ అనుమతులను మంజూరు చేసింది. ఇప్పటికే అటవీ అనుమతులు వచ్చాయి. దీంతో రోడ్డు నిర్మాణానికి కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులన్నీ వచ్చేసినట్లయింది. ఇక ఈ ప్రాజెక్టును కేంద్ర క్యాబినెట్‌లో ఆమోదించడమే తరువాయి. మంత్రివర్గ ఆమోదం లభించగానే రహదారి నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశం ఉంటుంది. తాజాగా పర్యావరణ అనుమతులు రావడంతో భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులకు మార్గం సుగమమైంది. త్వరలోనే ఈ ప్రక్రియ వేగిరమవనుంది. అయితే తమకు అధిక పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాగు భూములు కోల్పోతున్న రైతులకు ఆమోదయోగ్యంగా ఉండేలా మెరుగైన పరిహారం చెల్లించే మార్గాలను అన్వేషించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం నిర్మాణం కోసం 1,920 హెక్టార్ల భూమిని సేకరిస్తుండగా, పరిహారం కోసం సుమారు రూ.5,200 కోట్లు కావాలని అధికారులు అంచనా వేస్తున్నారు.


ఇందులో రాష్ట్ర వాటాగా రూ.2,600 కోట్లు ఇవ్వాలి. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం రహదారిని 4 వరసలతోనే నిర్మించాలని కేంద్రం తొలుత నిర్ణయుంచింది. అయితే రోడ్డు నిర్మాణం పూర్తయి, అందుబాటులోకి వచ్చే సమయానికి ట్రాఫిక్‌ పెరుగుతుందని.. 6 వరసలకు విస్తరించాల్సి వస్తుందని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) భావిస్తోంది. ఇప్పటికే రహదారి మార్గంలో ట్రాఫిక్‌పై సర్వే నిర్వహిస్తోంది. ప్రాథమిక గణాంకాల ప్రకారం రహదారి అందుబాటులోకి వచ్చే సమయానికి వాహనాల రద్దీ భారీగా పెరుగుతుందని తేలింది. దీంతో రోడ్డును 6 వరసలుగా నిర్మించేందుకు గాను.. సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్‌) రూపొందించాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ఓ సంస్థకు బాధ్యతలు అప్పగించారు.


డీపీఆర్‌ పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే కేంద్రానికి కూడా సమర్పిస్తారని తెలుస్తోంది. రహదారి వరసలను పెంచితే ఇప్పటికే ఖరారు చేసిన జంక్షన్లు, ఇంటర్‌చేంజ్‌ల్లోనూ పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఉత్తర భాగం రహదారి సంగారెడ్డిలో మొదలై నర్సాపూర్‌, తూప్రాన్‌, జగదేవ్‌పూర్‌, ప్రజ్ఞాపూర్‌, గజ్వేల్‌, భువనగిరి మీదుగా చౌటుప్పల్‌ వరకు 161 కి.మీ. మేర ఉండనుంది. రహదారి నిర్మాణం కోసం 2024 డిసెంబరు 27న రూ.7,104 కోట్లతో ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లను ఆహ్వానించింది. మొత్తం రోడ్డును 5 ప్యాకేజీలుగా విభజించింది. ఇప్పుడు రహదారి నిర్మాణంలో రెండు వరసలు పెరిగిన నేపథ్యంలో కొత్త టెండర్లను పిలవనున్నారు.


ఇవి కూడా చదవండి

TGSRTC: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన

Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి

Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు

PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ

Miss World 2025: ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్

For Telangana News And Telugu News

Updated Date - Apr 30 , 2025 | 04:32 AM