Share News

Surana Group: ‘సురానా’.. ఘరానా మోసం!

ABN , Publish Date - Apr 19 , 2025 | 05:52 AM

సురానా గ్రూపు కంపెనీలు.. రూ.వేల కోట్ల రుణాలు తీసుకొని బ్యాంకులను ముంచేశాయి. ఈ కంపెనీలకు చెందిన మరో రెండు రియల్‌ ఎస్టేట్‌ సంస్థల బండారాన్ని ఈడీ అధికారులు బట్టబయలు చేశారు.

Surana Group: ‘సురానా’.. ఘరానా మోసం!

  • స్థిరాస్తి లావాదేవీల్లో రూ.100 కోట్ల నల్లధనం

  • ఒకే ప్లాట్‌ను పలువురికి అమ్మేసిన వైనం

  • సరైన అగ్రిమెంట్లు లేకుండానే బయానాలు

  • సురానా, సాయిసూర్య డెవలపర్స్‌ యజమానుల వంచన

  • విచారణలో గుర్తించిన ఈడీ అధికారులు

  • సోదాల్లో రూ.74 లక్షలు, నల్లధనం సమాచారం స్వాధీనం

  • హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో ఫిర్యాదులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): సురానా గ్రూపు కంపెనీలు.. రూ.వేల కోట్ల రుణాలు తీసుకొని బ్యాంకులను ముంచేశాయి. ఈ కంపెనీలకు చెందిన మరో రెండు రియల్‌ ఎస్టేట్‌ సంస్థల బండారాన్ని ఈడీ అధికారులు బట్టబయలు చేశారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల క్రితం నిర్వహించిన సోదాల్లో రూ.100 కోట్ల నల్లధనం చలామణీకి సంబంధించిన ఆధారాలు లభించినట్లు అధికారులు తెలిపారు. సురానా గ్రూపునకు చెందిన భాగ్యనగర్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ చైర్మన్‌ నరేంద్ర సురానా, అనుబంధ సంస్థ అయిన సాయిసూర్య డెవలపర్స్‌ యజమాని సతీశ్‌చంద్ర గుప్తా పక్కా పథకం ప్రకారం పలువురిని మోసం చేసినట్లు ఈడీ విచారణలో గుర్తించారు. సొంతింటి కోసం బయానాలు ఇచ్చిన పలువుర్ని వంచించినట్లు తేల్చారు.


ఈ రెండు కంపెనీల ద్వారా అనధికార లేఅవుట్లలో ప్లాట్లు అమ్మారని, అది కూడా ఒకే ప్లాట్‌ను బైనంబర్ల ద్వారా పలువురికి రిజిస్ట్రేషన్లు చేశారని, సరైన అగ్రిమెంట్లు లేకుండా నగదు రూపంలో డబ్బు తీసుకున్నారని విచారణలో గుర్తించారు. ఇలా రూ.100 కోట్లకు పైగా నల్లధనాన్ని సేకరించి, ఆ డబ్బును వివిధ మార్గాల ద్వారా దారి మళ్లించారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ రెండు కంపెనీలపై హైదరాబాద్‌లోని వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైన నేపథ్యంలో తాము ఈసీఎన్‌ఆర్‌ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగిన సోదాల్లో రూ.74.50 లక్షల నగదు, రూ.100 కోట్ల నల్లధనానికి సంబంధించిన లెక్కలు గుర్తించామని చెప్పారు. నరేంద్ర సురానా కార్యాలయం నుంచి లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక సతీశ్‌చంద్రపై ఇప్పటి వరకు పలు పోలీస్‌ స్టేషన్లలో 11 కేసులు నమోదైనట్లు చెప్పారు.

Updated Date - Apr 19 , 2025 | 05:52 AM