Surana Group: రియల్‌ఎస్టేట్ సంస్థల్లో ఈడీ సోదాలు
ABN , Publish Date - Apr 17 , 2025 | 05:07 AM
వివిధ బ్యాంకులకు రూ.13 వేల కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన కేసులో రియల్‌ఎస్టేట్ సంస్థ సురానా గ్రూప్, దాని అనుబంధ సంస్థలు- సాయిసూర్య డెవలపర్స్, ఆర్యవన్ ఎనర్జీలపై చెన్నైవిభాగం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు.

సురానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్.. ఆర్యవన్ ఎనర్జీ సంస్థల్లో తనిఖీలు
రూ.13వేల కోట్ల మేర.. బ్యాంకులను మోసగించిన సురానా
2019లో కేసు నమోదు చేసిన సీబీఐ
హైదరాబాద్, బోయినపల్లి, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): వివిధ బ్యాంకులకు రూ.13 వేల కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన కేసులో రియల్‌ఎస్టేట్ సంస్థ సురానా గ్రూప్, దాని అనుబంధ సంస్థలు- సాయిసూర్య డెవలపర్స్, ఆర్యవన్ ఎనర్జీలపై చెన్నైవిభాగం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ మోసాలపై ఐడీబీఐ బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో 2019లోనే బెంగళూరు విభాగం సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా మనీల్యాండరింగ్ కోణంలో ఈడీ రంగంలోకి దిగింది. సురానా గ్రూప్ చైర్మన్, ఇతర డైరెక్టర్లు చెన్నైలో నివసిస్తున్నా.. వారికి హైదరాబాద్‌లో వ్యాపారాలున్నాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని.. అనుబంధ సంస్థలకు అక్రమంగా మళ్లించినట్లు ఈడీ గుర్తించింది.
దీంతో..హైదరాబాద్‌లోని సురానా గ్రూప్, సాయిసూర్య, ఆర్యవన్ ఎనర్జీ కార్యాలయాలు, వాటి డైరెక్టర్ల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో బోయినపల్లి డైమండ్ పాయింట్ సమీపంలోని అరిహంట్ కార్డు మాస్టర్ ఎన్‌క్లేవ్ కాలనీలోని సురానా యజమానుల ఇంట్లో బుధవారం తెల్లవారుజాము నుంచి ఈడీ అధికారుల సోదాలు కొనసాగాయి. కీలకమైన పత్రాలు, భూముల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రాత్రి కడపటి వార్తలందేసరికి సోదాలు కొనసాగుతూనే ఉన్నా యి. దీంతోపాటు.. సురానా గ్రూప్ ఎండీ దేవేందర్ సురా నా ఇళ్లు, కార్యాలయాలు, సాయిసూర్య, ఆర్యవన్ ఎనర్జీ కార్యాలయాల్లోనూ ఈడీ సోదాలు జరిగాయి. కాగా.. సాయిసూర్య డెవలపర్స్ ఎండీ సతీశ్‌చంద్ర గుప్తాపై ఇటీవలే పోలీసులకు పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. అపార్ట్‌మెంట్లు, విల్లాలు కట్టిస్తామంటూ ప్రీలాంచ్‌పేరిట కోట్లను వసూలు చేసి, మోసగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.