Share News

Hyderabad: పురపాలనలో గందరగోళం!

ABN , Publish Date - Apr 29 , 2025 | 05:16 AM

పురపాలక శాఖ విషయంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం గందరగోళానికి దారితీసింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ శాఖలో ఇద్దరు కార్యదర్శుల మధ్య పాలనా పరమైన విభజన చేయడం ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది.

Hyderabad: పురపాలనలో గందరగోళం!

  • ఇద్దరు కార్యదర్శుల మధ్య పని విభజనే కారణం

  • కేంద్రంతో సంప్రదింపులకు బాధ్యత ఎవరిదనే దానిపై చర్చ

  • సీడీఎంఏనూ విభజించారా.. సందేహాలు

  • ఓఆర్‌ఆర్‌ అవతల అని పేర్కొనడమే కారణం

  • ప్రభుత్వం స్పష్టత ఇస్తుందంటున్న అధికార్లు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): పురపాలక శాఖ విషయంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం గందరగోళానికి దారితీసింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ శాఖలో ఇద్దరు కార్యదర్శుల మధ్య పాలనా పరమైన విభజన చేయడం ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో మునిసిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌, పట్టణాభివృద్ధి అని వేర్వేరు విభాగాలు ఉన్నా.. రాష్ట్ర స్థాయిలో మాత్రం ఒకే అధికారి పర్యవేక్షణ చేసేవారు. అయితే ప్రస్తుతం పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి పోస్టు లేకుండా ఇద్దరు కార్యదర్శుల మధ్య పని విభజన చేశారు. 2012లో నీటిపారుదల శాఖలో ఇదే తరహాలో ముగ్గురు ముఖ్యకార్యదర్శులు ఉండేవారు. ఈ ముగ్గురు తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాలకు ఒక్కొక్కరు చొప్పున ప్రాతినిధ్యం వహించేవారు. దీంతో వారి కిందిస్థాయిలో పని చేసే ఉద్యోగుల ఏసీఆర్‌లను ఎవరు రాస్తారనే ప్రశ్న తలెత్తింది. ఇదే విషయాన్ని ప్రస్తుతం సీడీఎంగా, పురపాలకశాఖ కార్యదర్శిగా కొనసాగుతున్న టి.కె.శ్రీదేవి అప్పట్లో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న జోషిని ప్రశ్నించారు. అయితే ముగ్గురిలో ఎవరు సీనియర్‌ అధికారి అయితే.. వారికే పాలనాపరమైన నిర్ణయాలపై అధికారం ఉంటుందని జోషి స్పష్టతనిచ్చారు. ఇప్పుడు మళ్లీ పురపాలక శాఖలో ఇదే తరహాలో ఇద్దరు కార్యదర్శులు రావడంతో ఉద్యోగుల్లో రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఆర్థిక సంఘం నిధుల విషయంలో, కేంద్రం నుంచి నిధులు వచ్చే అమృత్‌, స్మార్ట్‌సిటీ, స్వచ్ఛభారత్‌ వంటి పథకాల విషయంలో రాష్ట్రం తరఫున ప్రతిపాదనలు, నిధుల కోసం లేఖలు ఎవరు పంపుతారనే చర్చ జరుగుతోంది.


సీడీఎంఏను కూడా రెండుగా విభజించారా?

సాధారణంగా పట్టణ ప్రాంతాల నిధులు, అభివృద్ధి పనులు, ఉద్యోగుల బదిలీలు, పాలనా పరమైన విషయాలపై పురపాలక శాఖ కమిషనర్‌, సంచాలకుల కార్యాలయం(సీడీఎంఏ) నుంచే నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఆదివారం ఐఏఎస్‌ అధికారుల బదిలీల ఉత్తర్వుల్లో ‘ఓఆర్‌ఆర్‌ అవతల’ అనే పదం సీడీఎంఏకి వర్తిస్తుందని పేర్కొనడంతో.. దీనిని కూడా రెండుగా విభజించారా? అనే చర్చ మొదలైంది. దీనిపై పురపాలక శాఖకు చెందిన ఓ అధికారి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. సీడీఏంఏ ఒక్కరే ఉంటారని, ఇందులో ఎలాంటి విభజన లేదని చెప్పారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ డైరెక్టర్‌గా సీడీఏంఏనే వ్యవహరిస్తున్నారని, నోడల్‌ ఏజెన్సీగా ఉన్న సీడీఎంఏ నుంచే స్వచ్ఛభారత్‌ నిధులు జీహెచ్‌ఎంసీకి కూడా వెళతాయని తెలిపారు.


సీడీఏంఏ నుంచే కొంత మంది ఉద్యోగులను జీహెచ్‌ఎంసీకి పంపుతారని, పాలనా పరమైన విషయాల్లో సీడీఎంఏ గతంలో ఎలా పని చేసిందో ఇప్పుడు కూడా ఒకే ఏజెన్సీగా పని చేస్తుందని అన్నారు. హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ ఏజెన్సీ అని, అభివృద్ధిపరమైన విషయాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం ఇద్దరు కార్యదర్శులను ఏర్పాటు చేసి ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం మొత్తమ్మీద 153 మునిసిపాలిటీలు ఉంటే.. రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహించినప్పుడు ఎక్కువ సమయం హెచ్‌ఎండీఏ సమీక్షకే సరిపోతోంది. దానిపరిధిలో ఏకంగా 40 మునిసిపాలిటీలు ఉండడమే ఇందుకు కారణం. తాజాగా ఇద్దరు కార్యదర్శుల నియామకం వల్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Jagga Reddy: జగ్గారెడ్డి మాస్ డైలాగ్.. రాజకీయాల్లో విలన్ మేమే, హీరోలం మేమే

Meta AI Chatbot: అశ్లీలతకు అడ్డాగా మారిన మెటా ఏఐ చాట్ బాట్స్

Updated Date - Apr 29 , 2025 | 05:16 AM