Share News

కోపంతో విసురుగా తోసేస్తే..

ABN , Publish Date - Mar 02 , 2025 | 04:30 AM

కోపంతో ఆ భర్త భార్యను నెట్టేస్తే రోడ్డు మీద పడింది.. మరో ఘటనలోనూ భర్త ఇలానే నెట్టేస్తే భార్య తల గోడకు తగిలింది. ఈ రెండు ఘటనల్లోనూ ఇద్దరూ ప్రాణాలొదిలారు.

కోపంతో విసురుగా తోసేస్తే..

  • రెండు ఘటనల్లో భర్తల క్షణికావేశం

  • తలకు తీవ్రగాయాలతో భార్యల మృతి

  • మరో ఘటనలో భార్యను చంపిన భర్త

పెద్దేముల్‌, కామారెడ్డి టౌన్‌, దేవరకొండ, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): కోపంతో ఆ భర్త భార్యను నెట్టేస్తే రోడ్డు మీద పడింది.. మరో ఘటనలోనూ భర్త ఇలానే నెట్టేస్తే భార్య తల గోడకు తగిలింది. ఈ రెండు ఘటనల్లోనూ ఇద్దరూ ప్రాణాలొదిలారు. ఇంకో ఘటనలో ఆ భర్త మాత్రం భార్యను కత్తితో పొడిచి చంపాడు. రంగారెడ్డి జిల్లా పెద్దేముల్‌ మండలం హన్మాపూర్‌కు చెందిన ప్రవీణ్‌, కల్పన (26) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కూతుళ్లున్నారు. కొన్నాళ్లుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం బయట నుంచి ప్రవీణ్‌ ఇంట్లోకి వస్తూ బయట కూర్చున్న కల్పనతో గొడవపడ్డాడు. బయట ఎందుకు కూర్చున్నావు? అని గద్దించాడు. అయినా ఆమె ఇంట్లోకి రాకపోవడంతో బలంగా తోసేశాడు. ఆమె వీధిలోని సిమెంటు రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. ఆమెను హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచింది.


నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండకు చెందిన కొట్టెం లక్ష్మయ్య, వెంకటమ్మ(63) భార్యాభర్తలు. లక్ష్మయ్య, వెంకటమ్మ తరచూ కలిసి మద్యం తాగి.. ఆ మత్తులో గొడవపడుతున్నారు. శుక్రవారం రాత్రి కమలాపూర్‌లో వీరభద్రస్వామి జాతరకు వెళ్లి మద్యం తాగి మాటామాటా అనుకున్నారు. లక్ష్మయ్య ఆవేశంలో వెంకటమ్మను గోడకేసి విసురుగా నెట్టేశాడు. ఆమె తలకు గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందింది. కామారెడ్డిలో నరసింహులు, భార్య మహేశ్వరి (45) ఓ సులభ్‌ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయి. శనివారం సులభ్‌ కాంప్లెక్స్‌ వద్దే ఘర్షణ జరిగింది. కోపంతో నరసింహులు, పక్కనే ఉన్న కత్తి తీసుకొని.. మహేశ్వరి మెడపై, కడుపులో పొడిచాడు. తీవ్రగాయాలతో మహేశ్వరి అక్కడికక్కడే మృతిచెందింది. తర్వాత నరసింహులు కూడా కత్తితో కడుపులో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Mar 02 , 2025 | 04:30 AM