Hyderabad: ఆగని మృత్యుఘోష
ABN , Publish Date - Jul 12 , 2025 | 04:40 AM
కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మృత్యుఘోష కొనసాగుతోంది. కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన వారిలో చాకలి పెద్ద గంగారం(70) శుక్రవారం తెల్లవారుజామున గాంధీ ఆస్పత్రిలో మరణించాడు.

కల్తీ కల్లు ఘటనలో మరొకరి మృతి
తొమ్మిదికి పెరిగిన మృతుల సంఖ్య
ఇంకా ఆస్పత్రుల్లో 48 మంది బాధితులు
‘గాంధీ’ నుంచి చెప్పకుండా వెళ్లిన ఓ వ్యక్తి
బాలానగర్ ఎక్సైజ్ సీఐపై సస్పెన్షన్ వేటు
మరో నలుగురు అధికారులపై విచారణ
10 గ్రాముల అల్ర్పాజోలంతో 1200 కల్తీ కల్లు సీసాలు
నిర్వాహకులకు అడ్డగోలుగా ఆదాయం
హైదరాబాద్ సిటీ, హైదర్‌నగర్, నిమ్స్, జూలై 11(ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మృత్యుఘోష కొనసాగుతోంది. కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన వారిలో చాకలి పెద్ద గంగారం(70) శుక్రవారం తెల్లవారుజామున గాంధీ ఆస్పత్రిలో మరణించాడు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. కామారెడ్డి జిల్లా బిచ్కుండ మండలం పుల్కల్ గ్రామానికి చెందిన పెద్ద గంగారం.. కొంతకాలంగా ఆల్విన్‌కాలనీ డివిజన్ ఆదర్శనగర్‌లో ఉంటున్నాడు. ఓ ప్రమాదంలో కుడి చేయి పోగొట్టుకున్న పెద్దగంగారం స్థానికంగా భిక్షాటన చేస్తూ వచ్చిన డబ్బుతో కల్లు తాగేవాడు. మరోపక్క, కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన వారిలో ఇంకా 48 మంది గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిమ్స్ ఆస్పత్రిలో 35 మందికి చికిత్స కొనసాగుతుండగా వారిలో తొమ్మిది మందికి డయాలసిస్ చేస్తున్నారు. నిమ్స్ నుంచి ఐదుగురిని శుక్రవారం డిశ్చార్జి చేశారు. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 18 మందికి డయాలసిస్ చేస్తున్నారు. ఓ బాధితుడు ఎవరికీ చెప్పకుండా గాంధీ ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. కాగా, ఇందిరానగర్ కాలనీలోని కల్లు కాంపౌండ్‌ను అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. కల్తీ కల్లు ఘటన బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన నేపథ్యంలో విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు.. బాలానగర్ ఎక్సైజ్ సీఐ వేణుకుమార్‌ను సస్పెండ్ చేశారు. మరో నలుగురు క్షేత్రస్థాయి సిబ్బందిపై కూడా చర్యలు తీసుకున్నట్టు సమాచారం. ఇంత పెద్దఎత్తున కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నా పట్టించుకోని జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారి, ఇద్దరు ఏఈఎస్ (అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్)లు, ఓ ఈఎస్ (ఎక్సైజ్ సూపరింటెండెంట్)పై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిసింది.
10 గ్రా. అల్ర్ఫాజోలంతో 1200 సీసాలు
నిబంధనల ప్రకారం తాటి చెట్ల నుంచి తీసిన కల్లును మాత్రమే దుకాణాల్లో విక్రయించాలి. చాలా చోట్ల ఈ పరిస్థితి లేదు. దీంతో కల్లు కాంపౌండ్ నిర్వాహకులు కల్తీ దందాకు తెరలేపారు. అల్ర్ఫాజోలం, డైజోఫామ్, క్లోరల్‌హైడ్రేడ్ వంటి రసాయనాలతో కల్తీ కల్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. క్లోరల్ హైడ్రేడ్ కిలో రూ.250, డైజోఫాం కిలో రూ.500 కాగా కిలో అల్ర్ఫాజోలం రూ.15 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే, రూ.15వేల విలువైన 10 గ్రాముల అల్ర్ఫాజోలంతో 100 పెట్టెల కల్లు(1200 సీసాలు)ను తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఒక సీసా కల్లు రూ.50కి విక్రయిస్తుంటారు. 100 పెట్టెలు అమ్మితే రూ.60వేల ఆదాయం వస్తుంది. ఒక్కో కాంపౌండ్‌లో రోజుకు 150-200 వరకు సీసాలు విక్రయిస్తారు. ఒక్కో నిర్వాహకుడు 4-5 దుకాణాలు నిర్వహిస్తూ నెలకు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. కాసుల వర్షం కురుస్తుండడంతో పలువురు రాజకీయ నాయకులు ఈ దందాలోకి ప్రవేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలవారీగా కల్లు కాంపౌండ్ లైసెన్సు కలిగిన వారికి నయానో బయానో చెల్లించి ఆయా దుకాణాలను తమ అనుచరులతో నడిపిస్తున్నారని తెలిసింది. ఈ దందా వెనుక రాజకీయ నాయకులు ఉండడంతో ఏం జరిగినా సరే ఎక్సైజ్ అధికారులు ఆ దుకాణాల జోలికి వెళ్లడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.
గతంలో తనిఖీలు ఇలా..
కల్లు కంపౌండ్ నిర్వాహకులు గతంలో నిర్ణీత రుసుము చెల్లించి లైసెన్సులు పొందేవారు. ఆయా దుకాణాలను ఎక్సైజ్ కానిస్టేబుళ్లు తనిఖీలు చేసి కల్లు శాంపిళ్లను ల్యాబ్‌లకు పంపేవారు. అయితే, కల్తీ కల్లుతో ప్రజల ప్రాణాలు పోతున్న ఘటనలు అధికమవ్వడంతో 2012లో రాష్ట్రవ్యాప్తంగా కల్లు కాంపౌండ్లను మూసేశారు. తెలంగాణ ఏర్పాటయ్యాక.. కల్లు గీతను గీత కార్మికుల వృత్తిగా గుర్తించిన ప్రభుత్వం నిబంధనలకు లోబడి కల్లు దుకాణాల నిర్వహణకు 2014లో అనుమతిచ్చింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్సు రుసుమును కూడా రద్దు చేసింది. దీంతో లైసెన్స్‌లు ఉన్నవారు, లేనివారు అని తేడా లేకుండా తాడి కో ఆపరేటివ్ సొసైటీ్‌సలో సభ్యులుగా ఉన్న వారి పేర్లతో బినామీలు కల్లు కంపౌండ్లు తెరిచారు. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 4064 తాడి కో ఆపరేటివ్ సోసైటీలున్నాయి. వీటిల్లో 2,24,663 మంది సభ్యులుండగా వారిలో 29,272 మందికి కల్లు కాంపౌండ్ లైసెన్సులున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3,541 కల్లు కాంపౌండ్‌లు నడుస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్ లక్ష్యంగా ఉగ్రవాద దాడులు..!
అసెంబ్లీకి కాదు.. జనాల్లోకి రావడం లేదు
For Telangana News And Telugu News