Sighachi Tragedy: నెలరోజులైనా పరిహారమేదీ?
ABN , Publish Date - Jul 29 , 2025 | 04:22 AM
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో ఉన్న సిగాచి రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగి, 46మంది చనిపోయి బుధవారానికి నెలరోజులు. నెల రోజులవుతున్నా మృతుల కుటుంబాలకు ఇంతవరకు పరిహారం అందలేదు.

‘సిగాచి’ మృతుల కుటుంబాలకు ఇంకా అందని రూ.కోటి పరిహారం
సంగారెడ్డి, జూలై 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో ఉన్న సిగాచి రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగి, 46మంది చనిపోయి బుధవారానికి నెలరోజులు. నెల రోజులవుతున్నా మృతుల కుటుంబాలకు ఇంతవరకు పరిహారం అందలేదు. పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదైనా ఎలాంటి చర్యల్లేవు. ప్రమాదంపై రెండు కమిటీలను నియమించినప్పటికీ.. అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణమేంటనేది తేలలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిగాచి పరిశ్రమలో జూన్ 30న భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు నెలరోజుల్లోగా రూ.కోటి చొప్పున పరిహారం ఇప్పిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. కంపెనీ యాజమాన్యం కూడా అంగీకరించింది. కానీ, ఇప్పటివరకు అంత్యక్రియల కోసం రూ.1.50లక్షల చొప్పున మాత్రమే ఇచ్చారు. 15కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున చెల్లించారు. డెత్ సర్టిఫికెట్లు, పంచనామా, ఎఫ్‌ఐఆర్ కాపీలు లేనందునే పరిహారంలో జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు, గల్లంతైనట్లుగా ప్రకటించిన 8మంది కుటుంబాలకు రూ.15లక్షల చొప్పున అందజేశారు. అయితే, తమ వాళ్ల పేరిట కూడా డెత్ సర్టిఫికెట్లు ఇచ్చి రూ.కోటి పరిహారం ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇక తీవ్రగాయాలైన వారికి రూ.10లక్షల చొప్పున అంగీకరించారు కానీ, రూ.50వేలు అందజేసి చేతులు దులుపుకున్నారు.
కారణమేంటో తేల్చని కమిటీలు
సిగాచి ప్రమాద ఘటనపై నెలరోజుల్లోగా పూర్తి వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం రెండు కమిటీలను నియమించింది. ప్రమాదం జరిగిన మరుసటి రోజే సీఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో సీనియర్ ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలతో కూడిన కమిటీ ఏర్పాటైంది. అదే విధంగా ప్రమాద కారణాలను విశ్లేషించడానికి అనుభవం ఉన్న నిపుణులతో మరో కమిటీని నియమించారు. ఈ కమిటీ పలుమార్లు పరిశ్రమను సందర్శించినా.. ప్రమాద కారణమేంటనేది తేల్చి చెప్పలేదు. కంపెనీలో రియాక్టర్ పేలిందా.. బాయిలర్ ధ్వంసమైందా.. అన్న విషయాలపై స్పష్టత లేదు. 4 రోజుల క్రితం ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లుగా తెలిసింది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి అంశం బయటకు రాలేదు.
మాకు సంబంధం లేదంటున్నారు
మా బావ సిలివేరి రవి సిగాచి కంపెనీలో సీనియర్ క్వాలిటీ మేనేజర్‌గా పనిచేసేవారు. ప్రమాదంలో గల్లంతయ్యారు. ఆయన తిరిగివస్తారని పదిరోజులు ఎదురుచూశాం. కానీ ఫలితం లేదు. ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామన్నారు. కానీ 15లక్షలు మాత్రమే ఇచ్చారు. ఎవరిని అడిగినా మాకు సంబంధం లేదంటున్నారు. మా అక్క, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ప్రభుత్వం స్పందించాలి.
-కిశోర్, మృతుడు సిలివేరి రవి బంధువు
డెత్ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదు
మాది బిహార్. నా భార్య రుక్సానా సిగాచి ప్రమాద ఘటనలో చనిపోయింది. పరిహారం కింద ఇప్పటివరకు కేవలం రూ.10లక్షలు మాత్రమే అందజేశారు. ఇప్పుడు డెత్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడానికి వెనుకాముందు చేస్తున్నారు. ఎవరిని అడిగినా పట్టించుకోవట్లేదు. బీమా క్లెయిమ్ కావాలంటే పంచనామా, ఎఫ్‌ఐఆర్ కాపీలు కావాలి. అవి కూడా ఇవ్వడం లేదు.
-మొహినోద్దీన్ ఖాన్, మృతురాలి భర్త
ఇవి కూడా చదవండి..
కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు, మోదీకి ఫోన్ కాల్ రాలేదు
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్
For More National News and Telugu News..