Pocharam Srinivas Reddy; సుప్రీం తీర్పుపై ఏం చేద్దాం?
ABN , Publish Date - Aug 03 , 2025 | 05:08 AM
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు శనివారం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై వారు చర్చించారు.

న్యాయ సలహా తీసుకోవాలనే యోచన
పోచారం నివాసంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ
హైదరాబాద్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు శనివారం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై వారు చర్చించారు. ఈ కేసును వాదిస్తున్న సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, ముకుల్ రోహిత్గీలను సంప్రదించి, న్యాయ సలహా తీసుకుని ముందుకెళ్లాలని ఒకరిద్దరు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అదే సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నుంచి కూడా పిలుపు వస్తుందని, వేర్వేరుగా తమ అభిప్రాయాన్ని తీసుకునే అవకాశం ఉందని చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
బీఆర్‌ఎ్‌సలో తమకు సరైన ప్రాధాన్యత లేకపోవడం వల్లనే ఆ పార్టీకి దూరంగా ఉంటున్నామని, అధిష్ఠానం తీరు నచ్చక అసంతృప్త ఎమ్మెల్యేలంతా కలిసి ప్రత్యేక గ్రూపుగా ఏర్పడ్డామని, పార్టీలోనే ఉంటూ ప్రత్యేక శిబిరంగా కొనసాగుతున్నామని, ఇదే విషయాన్ని కోర్టుకు, స్పీకర్‌కు కూడా వెల్లడిస్తే బాగుంటుందని ఒకరిద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడినట్లు తెలిసింది. కాగా, ఈ భేటీకి ఉమ్మడి రంగారెడ్డిలోని గ్రేటర్‌కు సమీపంలో ఉన్న ఓ ఎమ్మెల్యే హాజరు కాలేదని సమాచారం. మిగతా 9 మందీ పాల్గొన్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయలో స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్డు ఆదేశించిన సంగతి తెలిసిందే.