Share News

Cyclone Mocha Damages Crops: 4,47,864 ఎకరాల్లో పంట నష్టం

ABN , Publish Date - Oct 31 , 2025 | 03:14 AM

మొంథా తుఫాను రాష్ట్ర రైతాంగం నడ్డివిరిచింది. చేతికొచ్చే దశలో ఉన్న పంటలను ఊహించని విధంగా దెబ్బతీసింది. తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా...

Cyclone Mocha Damages Crops: 4,47,864 ఎకరాల్లో పంట నష్టం

  • మొంథా తుఫాన్‌ దెబ్బతో వరంగల్‌, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో తీవ్ర నష్టం

  • 12 జిల్లాల్లోని 179 మండలాల్లో ప్రభావం

  • నష్టపోయిన రైతులు 2.5 లక్షల మందిపైనే..

  • వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక

  • సమగ్ర సర్వే తర్వాత పూర్తిస్థాయి నిర్ధారణ

  • ఎకరాకు 10వేలు పరిహారం ప్రకటించే చాన్స్‌

  • రాష్ట్రవ్యాప్తంగా రోడ్లకు రూ.225 కోట్ల నష్టం

  • అప్రమత్తంగా ఆర్‌అండ్‌బీ: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాను రాష్ట్ర రైతాంగం నడ్డివిరిచింది. చేతికొచ్చే దశలో ఉన్న పంటలను ఊహించని విధంగా దెబ్బతీసింది. తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 4,47,864 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమిక సర్వేలో గుర్తించింది. ఇందులో సగానికిపైగా వరి పంటే ఉందని.. పత్తి, మొక్కజొన్న, మిర్చి, వేరుశనగ, పప్పుధాన్యాలు, ఇతర పంటలకూ నష్టం జరిగిందని గుర్తించింది. రాష్ట్రంలో 12 జిల్లాల్లోని, 179 మండలాల్లో తుఫాన్‌ ప్రభావం చూపిందని, 2.53 లక్షల మంది రైతులు పంటలు నష్టపోయారని లెక్కతేల్చింది. ముఖ్యంగా వరంగల్‌, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పంట నష్టం తీవ్రంగా ఉందని తేల్చింది. ఈ మేరకు గురువారం వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను సమర్పించింది.


ప్రభావిత ప్రాంతాల్లో సర్వే చేసి..

ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్‌ జిల్లాల్లో మొంథా తుఫాను ప్రభావానికి పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో వరి, మక్కలు, పత్తి తడిసిపోయాయి. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ బుధ, గురువారాల్లో ప్రాథమిక సర్వే నిర్వహించింది. 2,82,379 ఎకరాల్లో వరి, 1,51,707 ఎకరాల్లో పత్తి, 4,963 ఎకరాల్లో మొక్కజొన్న, 3,613 ఎకరాల్లో మిర్చి, 1,228 ఎకరాల్లో పప్పు ధాన్యాలు, 2,674 ఎకరాల్లో వేరుశనగ, 1,300 ఎకరాల్లో ఉద్యాన పంటలు కలిపి మొత్తం 4,47,864 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు గుర్తించింది. అత్యధికంగా వరంగల్‌ జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 80,500 మంది రైతులు నష్టపోయారు. ఖమ్మం జిల్లాలో 62,400 ఎకరాలు, సూర్యాపేటలో 56,330, నల్లగొండలో 52,071 ఎకరాల్లో పంటనష్టం జరిగింది. ఇక నష్టంపై పూర్తిస్థాయి సర్వే చేపట్టాలని వ్యవసాయ మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు.

సమగ్ర సర్వే తర్వాత పంటనష్టం నిర్ధారణ

తుఫాను, భారీ వర్షాలతో వచ్చిన వరదల ప్రభావం ఇంకా తగ్గలేదు. అధికారులు పూర్తిస్థాయిలో క్షేత్ర పర్యటనలు చేయలేదు. సమగ్ర సర్వే చేపడితే పంటనష్టంపై కచ్చితమైన నిర్ధారణకు వచ్చే అవకాశాలున్నాయి. దీనితో వ్యవసాయ, రెవెన్యూ, ఉద్యాన, అనుబంధ శాఖల అధికారులతో బృందాలను ఏర్పాటుచేసి సమగ్ర సర్వే చేపట్టి.. నష్ట శాతాన్ని తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరద నీళ్లు తగ్గాగానే కొన్ని పంటలు కోలుకునే అవకాశాలు ఉంటాయి. దానికితోడు ఎక్కడైనా, ఏదైనా పంట 33శాతానికి మించి దెబ్బతింటేనే నష్టపరిహారం కోసం సిఫారసు చేయాలనే నిబంధన ఉంది. పంటలు ప్రస్తుమున్న దశను బట్టి నష్టశాతం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు ప్రధాన పంటలు దిగుబడికి ముందు దశలో ఉండటంతో నష్టశాతం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.


నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం: తుమ్మల

మొంథా తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తారని తెలిపారు. ఎకరానికి ఎంత నష్టపరిహారం ఇవ్వాలనే దానిపై సీఎంతో చర్చించిన తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. నష్టపోయిన రైతులకు పరిహారం తప్పకుండా చెల్లిస్తామని భరోసా ఇచ్చారు.

ఎకరానికి పది వేల పరిహారం?

రాష్ట్రంలో ప్రస్తుతం పంటల బీమా పథకం అమల్లో లేదు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాన్ని కూడా అమలు చేయటం లేదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు రాష్ట్ర ప్రభుత్వమే సర్వే చేయించి, నష్టపరిహారం ఇస్తోంది. గత ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే తరహాలో ఎకరానికి రూ.10వేల చొప్పున పంపిణీ చేయవచ్చని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రాథమిక నివేదిక ప్రకారం చూస్తే.. 4.48 లక్షల ఎకరాల్లో పంట నష్టానికి రూ.448 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి రానుంది.

4.jpg2.jpg3.jpg

Updated Date - Oct 31 , 2025 | 03:14 AM