Share News

Konda Surekha: మంత్రి కొండా సురేఖకు షాక్‌

ABN , Publish Date - Aug 03 , 2025 | 04:06 AM

టాలీవుడ్‌ నటులు నాగచైతన్య, సమంత విడాకులకు మాజీ మంత్రి కేటీఆరే కారణం అంటూ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది.

Konda Surekha: మంత్రి కొండా సురేఖకు షాక్‌

  • 21లోపు ఆమెపై క్రిమినల్‌ కేసు నమోదు చేయండి.. నోటిసులు ఇవ్వండి

  • కేటీఆర్‌ పరువు నష్టం దావా కేసులో పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశం

  • రాజకీయాల్లో విషం చిమ్మేవారికి ఇది గుణపాఠం: కేటీఆర్‌

  • కేసులు, కొట్లాటలు కొత్త కాదు.. న్యాయవ్యవస్థపై గౌరవం ఉంది: సురేఖ

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): టాలీవుడ్‌ నటులు నాగచైతన్య, సమంత విడాకులకు మాజీ మంత్రి కేటీఆరే కారణం అంటూ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తన పరువుకు భంగం కలిగిందని నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ కోర్టులో గత అక్టోబరులో కేటీఆర్‌ క్రిమినల్‌ పరువు నష్టం దావా వేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన న్యాయస్థానం ప్రాథమిక సాక్ష్యాలను పరిశీలించి, సురేఖపై ఈనెల 21లోపు క్రిమినల్‌ కేసు నమోదు చేసి, ఆమెకు నోటీసులు జారీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కేటీఆర్‌పై సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారన్న తమ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించిందని కేటీఆర్‌ తరఫు న్యాయవాది సిద్ధార్థ్‌ తెలిపారు. సాక్షుల వాంగ్మూలాలను, కోర్టులో తాము సమర్పించిన వీడియోలు, వార్తలను న్యాయస్థానం పరిశీలించి బీఎన్‌ఎ్‌స సెక్షన్‌ 356 కింద ఈ ఉత్తర్వులు ఇచ్చిందని ఆయన చెప్పారు. కాగా.. గతంలో మీడియాలో, ఇతరత్రా మాధ్యమాల్లో వచ్చిన వార్తల ఆధారంగానే సురేఖ ఆ వ్యాఖ్యలు చేశారని ఆమె తరఫు న్యాయవాది చేసిన వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది.


అర్థంలేని విమర్శల చేస్తే అధికారం రక్షించదు: కేటీఆర్‌

‘‘నిజం ఎప్పటికైనా గెలిచి తీరుతుంది’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. పరువునష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు చేయాలంటూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో కేటీఆర్‌ ఈ వ్యాఖ్య చేశారు. ‘‘నువ్వు అర్థం లేని విమర్శలు చేస్తే అధికారం నిన్ను రక్షించదు. ప్రజల జీవితాలను బురదలోకి లాగే హక్కు అధికారం నీకు ఇవ్వదు. అధికారమనేది ప్రజలకు సేవ చేసేందుకు ఓ అవకాశం తప్ప.. ప్రత్యర్థులపై వదంతలు ప్రచారం చేయడానికో.. వ్యక్తిత్వ హననం చేయడానికో.. బురద చల్లడానికో కాదు. రాజకీయాల పేరుతో విషం చిమ్మే ప్రతి ఒక్కరికీ ఇది ఒక గుణపాఠం అవుతుందని ఆశిస్తున్నాను. గెలిచే వరకు పోరాడుతూనే ఉంటాం.. ఈపోరాటంలో మనం ఇంకా సగం వరకే వచ్చాం’’ అని ఎక్స్‌లో ఖాతాలో కేటీఆర్‌ పేర్కొన్నారు.


..సాధారణ విషయం: సురేఖ

కేసులు, కొట్లాటలు కొత్త కాదని, తన జీవితమే ఒక పోరాటం అని మంత్రి కొండా సురేఖ అన్నారు. న్యాయ వ్యవస్థపై గౌరవం, నమ్మకం తనకు ఉన్నాయని చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్‌పై తాను చేసిన ఆరోపణల కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సురేఖ స్పందించారు. తన కేసును విచారణకు తీసుకొని ముందుకెళ్లాలని కోర్టు స్పష్టం చేసిందని.. కోర్టులు విచారణకు తీసుకోవాలని చెప్పడం ఏ కేసులోనైనా సర్వసాధారణమైన విషయం అని అన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్‌ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి

ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 03 , 2025 | 04:06 AM