Drunk Driving: రోజూ స్టేషన్‌కొచ్చి మర్యాదలు చేయండి
ABN , Publish Date - Jan 02 , 2025 | 04:35 AM
మద్యం మత్తులో కారు నడిపి డివైడర్‌కు ఢీకొట్టడమే కాకుండా పోలీసులను దుర్భాషలాడిన ఇద్దరు యువతీయువకులకు కోర్టు బెయిలిస్తూనే విచిత్రమైన షరతులు విధించింది.

2 గంటలపాటు రిసెప్షన్‌లో కూర్చుని ఫిర్యాదుదారులకు స్వాగతం పలకండి
ఇద్దరు యువతీయువకులకు కోర్టు కండిషనింగ్ బెయిల్
రోడ్డు ప్రమాదానికి కారణమై, పోలీసులను తిట్టినందుకు
బంజారాహిల్స్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో కారు నడిపి డివైడర్‌కు ఢీకొట్టడమే కాకుండా పోలీసులను దుర్భాషలాడిన ఇద్దరు యువతీయువకులకు కోర్టు బెయిలిస్తూనే విచిత్రమైన షరతులు విధించింది. 15 రోజుల పాటు రోజూ ఠాణాకు వెళ్లి రెండు గంటలపాటు రిసెప్షన్‌లో కూర్చోవాలని, అక్కడికి వచ్చే ఫిర్యాదుదారులకు స్వాగతం పలకాలని సూచించింది. మారెడ్‌పల్లికి చెందిన దయా సాయిరాజ్ ప్రముఖ వ్యాపారి. తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఈ నెల 28న జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఓ పార్టీకి వచ్చాడు. అక్కడ ఇద్దరు మద్యం తాగారు. అనంతరం ఇంటికి వెళ్లేందుకు అర్ధరాత్రి తర్వాత బెంజ్ కారులో బయలు దేరారు. రోడ్డు నెంబరు 45లో సినీనటుడు బాలకృష్ణ ఇంటికి సమీపంలోకి రాగానే మితిమీరిన వేగంతో ఉన్న వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి గాల్లో లేచి రోడ్డుకు ఆవలివైపు పడింది.
బెలూన్లు తెరుచుకోవడంతో ఇద్దరికి సురక్షితంగా బయటపడ్డారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ ఆ ఇద్దరు పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడారు. వారిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకొని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి వారికి బెయిల్ మంజూరు చేస్తూ 15 రోజుల పాటు రిసెప్షన్‌లో ఉండి, అక్కడికొచ్చే వారిని మర్యాద పూర్వకంగా పలకరలించాలని కండిషనల్ బెయిల్ ఇచ్చింది. కాగా బుధవారం ఈ కండిషన్‌ను సరిగ్గా పాటించకపోవడంతో యువకుడు, యువతిని పోలీసు అధికారులు మందలించారు. మరోసారి కోర్టుకు పంపిస్తామంటూ హెచ్చరించారు.