Share News

Family Dispute: వివాహేతర బంధం అంటగట్టారంటూ ఇద్దరి బలవన్మరణం

ABN , Publish Date - Jun 30 , 2025 | 04:55 AM

సన్నిహితంగా ఉంటున్న తమ మధ్య వివాహేతర సంబంధం అంటగట్టి అనుమానిస్తున్నారంటూ ఇద్దరు కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం కొండమడుగు శివారులోని ఓ రిసార్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Family Dispute: వివాహేతర బంధం అంటగట్టారంటూ ఇద్దరి బలవన్మరణం

  • రిసార్ట్‌లో పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్న వైనం

  • యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన

బీబీనగర్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): సన్నిహితంగా ఉంటున్న తమ మధ్య వివాహేతర సంబంధం అంటగట్టి అనుమానిస్తున్నారంటూ ఇద్దరు కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం కొండమడుగు శివారులోని ఓ రిసార్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బీబీనగర్‌ ఎస్సై రమేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రానికి చెందిన బంద బాలసుధాకర్‌ (39), పసల సుష్మిల (34) సమీప బంధువులు కావడంతో చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉండేవారు. వివాహితుడైన బాలసుధాకర్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. సుష్మిలకు కూడా వివాహమైంది. హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న ఆమె.. భర్తతో కలిసి రామాంతపూర్‌ కేసీఆర్‌నగర్‌లో ఉంటున్నారు. బాలసుధాకర్‌, సుష్మిల వారి కుటుంబాలతో కలిసి ఒకే ప్రాంతంలో నివాసం ఉంటుండగా.. కొన్ని రోజులుగా వీరు సన్నిహితంగా ఉంటుండటంతో ఇరు కుటుంబాల వారు వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని అనుమానిస్తున్నారు.


ఈ క్రమంలో సుష్మిలకు భర్తతో, బాలసుధాకర్‌కు భార్యతో మనస్పర్దలు ఎక్కువయ్యాయి. దీంతో కొన్ని రోజులుగా వీరిద్దరూ మానసిక క్షోభకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27న కొండమడుగు శివారులోని ఓ రిసార్ట్‌లో వారు గదిని అద్దెకు తీసుకున్నారు. ఇద్దరూ సెల్ఫీ వీడియోలు తీసి తమ బంధువులకు పంపారు. దాంతో ఇరువురి కుటుంబసభ్యులు ఆందోళనతో ఉప్పల్‌ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వీడియోలు పంపిన సెల్‌ఫోన్‌ నంబర్‌ ఆధారంగా కొండమడుగు శివారులోని రిసార్ట్‌లో బాలసుధాకర్‌, సుష్మిల ఉన్నట్లు గుర్తించి బీబీనగర్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఎస్సై రమేశ్‌ సిబ్బందితో కలిసి రిసార్ట్‌కు చేరుకుని వారున్న గదికి వెళ్లి చూడగా అప్పటికే పురుగుల మందు తాగి వారు విగత జీవులుగా పడి ఉన్నారు. మృతదేహాలను పోస్ట్‌ మార్టం నిమిత్తం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Jun 30 , 2025 | 04:55 AM