Share News

Caste Census Congress: రేవంత్‌ టీమ్‌ భేష్‌!

ABN , Publish Date - Jul 25 , 2025 | 04:13 AM

తెలంగాణలో విస్తృత స్థాయిలో, శాస్త్రీయంగా, అర్థవంతంగా కులగణన జరిపిన తీరు దేశానికే ప్రామాణికంగా నిలిచిందని కాంగ్రెస్‌ అధినాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, ఆయన బృందాన్ని ప్రశంసించింది.

Caste Census Congress: రేవంత్‌ టీమ్‌  భేష్‌!

కులగణనపై అద్భుతంగా పని చేశారు

  • దేశానికే ప్రామాణికంగా తీర్చిదిద్దారు

  • సొంత కులం ఒత్తిడిని అధిగమించి సీఎం సాహసం

  • ముఖ్యమంత్రిపై రాహుల్‌, ఖర్గే ప్రశంసల వర్షం

  • రిజర్వేషన్లపై 50ు సీలింగ్‌ ఎత్తేయడం ద్వారా హిందూత్వ రాజకీయాలు ధ్వంసం: రాహుల్‌

  • దేశవ్యాప్త కులగణన రాహుల్‌ సాధించిన విజయం

  • సామాజిక న్యాయం 2.0 మొదలైంది: ఖర్గే

తమ పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలు తెలుసుకోవడం బీజేపీకి ఇష్టం ఉండదు. ఓబీసీలు, దళితులు, ఆదివాసులు, ఇతర కులాల స్థితిగతులు కులగణనతో వెలుగులోకి రావడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. బీజేపీ నేతల పిల్లలు ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లలో చదువుతారు. ఆ నేతలు మాత్రం ఇంగ్లిష్‌ను వ్యతిరేకిస్తారు.

- రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ, జూలై 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో విస్తృత స్థాయిలో, శాస్త్రీయంగా, అర్థవంతంగా కులగణన జరిపిన తీరు దేశానికే ప్రామాణికంగా నిలిచిందని కాంగ్రెస్‌ అధినాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, ఆయన బృందాన్ని ప్రశంసించింది. తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే పేరిట నిర్వహించిన కులగణన గురించి రేవంత్‌ గురువారం ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ ఎంపీలకు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర పార్టీ నేతలు ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణలో కులగణన జరిపించాలన్న ఆలోచనను రేవంత్‌రెడ్డి కులం వాళ్లు మెచ్చక పోవచ్చునని తాను తొలుత భావించానని, కులగణన ఎలా జరిపిస్తారా? అన్న అనుమానాలు తనకుండేవని రాహుల్‌గాంధీ అన్నారు. అయితే, రేవంత్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్‌ నేతలు తన అంచనాలను అధిగమించి, ముందుకు వచ్చి కులగణనను జరిపించారని కొనియాడారు. ఏ స్ఫూర్తితో కులగణన జరిపించాలని అనుకున్నామో అదే స్ఫూర్తితో కార్యక్రమాన్ని నెరవేర్చారని ప్రశంసించారు. తెలంగాణలో కులగణన జరిపించిన తీరు సమాజంలో అందరికీ న్యాయం జరిగే దిశన ఒక మైలు రాయిగా నిలిచిందని అన్నారు. ఈ కులగణనను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని, బీజేపీకి ఇష్టమున్నా లేకపోయినా దేశ వ్యాప్తంగా జరిగే కులగణనకు ఇది కొలమానంగా నిలవబోతోందని చెప్పారు. తెలంగాణలో కులగణన ఎలా జరగాలో అధికారులు నిర్ణయించలేదని, ప్రజలందరికీ తలుపులు తెరిచి, ఏమేం ప్రశ్నలు అడగాలో అభిప్రాయాలు కోరారని, చివరకు 56 కీలక ప్రశ్నలు గుదిగుచ్చి వాటికి సంబంధించిన సమాచారం ప్రజల నుంచి సేకరించారని రాహుల్‌గాంధీ తెలిపారు. తమకు అవకాశం లభించలేదని ఎవరు చెప్పినా వారికి మళ్లీ సర్వేలో సమాచారం ఇచ్చే అవకాశాన్ని కొత్తగా కల్పించారని గుర్తు చేశారు.


తెలంగాణ ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం 21వ శతాబ్దం డేటా అందుబాటులో ఉందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతీ పౌరుడికి సంబంధించి ప్రభుత్వం తన అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకొనే అవకాశం ఈ సర్వేతో ఏర్పడిందని చెప్పారు. కులం, విద్య, ఆరోగ్యం అంశాల్లో వెనుకబాటుతనం స్పష్టంగా కనిపిస్తోందని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించేందుకు అవకాశం ఏర్పడిందని అన్నారు. ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రానికీ తెలంగాణ మాదిరిగా ప్రతీ వ్యక్తికి సంబంధించి అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించగలిగిన శక్తి లేదని చెప్పారు. కులగణన అనంతరం విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించుకోవడం తెలంగాణ వేయబోయే రెండో అడుగని రాహుల్‌గాంధీ అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత బిల్లును రాష్ట్రపతికి పంపిందని, కేంద్రంలోని బీజేపీ సర్కారు పచ్చజెండా ఊపడం లేదని చెప్పారు. 50 శాతం రిజరేషన్ల పరిమితిని ఎత్తేయడం ద్వారానే హిందూత్వ రాజకీయాలను విధ్వంసం చేయడం సాధ్యమవుతుందని ప్రకటించారు. బీజేపీ బిహార్‌లో కులగణన సరైన పద్ధతిలో జరిపించలేదని రాహుల్‌ అన్నారు. ప్రజలకు తమ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం బీజేపీకి ఇష్టం లేదని చెప్పారు. ఓబీసీలు, దళితులు, ఆదివాసులు, ఇతర సాధారణ కులాల స్థితిగతులు కులగణనతో వెలుగులోకి రావడాన్ని బీజేపీ జీర్ణించుకోలేక పోతోందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో భూమి, ఇతర ఆస్తుల కన్నా చదువే సాధికారతకు ప్రధాన సంకేతంగా నిలిచిందని నిపుణుల కమిటీ చెప్పిందని రాహుల్‌గాంధీ ప్రస్తావించారు. హిందీ, ఇతర ప్రాంతీయ భాషలతో పాటు ఇంగ్లి్‌షను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేతల పిల్లలు ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో చదువుతున్నా నాయకులు మాత్రం ఇంగ్లీషును వ్యతిరేకిస్తారని చెప్పారు.


ఏకమైతే సామాజిక న్యాయం

బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు రాజకీయంగా ఏకమై కాంగ్రెస్‌ పార్టీకి మద్దతునిస్తే దేశవ్యాప్తంగా 60-70 శాతం ప్రజల మద్దతు లభించినట్లేనని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అప్పుడే సామాజిక న్యాయం సాధించగలమన్నారు. కులగణనను ప్రధానాంశంగా లేవనెత్తిన ఘనత రాహుల్‌గాంధీకే దక్కుతుందని ప్రశంసించారు. జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌, రాజ్యాంగాన్ని రక్షించండి నినాదాలు ఇచ్చింది కూడా రాహుల్‌గాంధేనన్నారు. రాహుల్‌గాంధీ కారణంగానే మోదీ జనగణనలో కులగణనను చేర్చారని చెప్పారు. దేశవ్యాప్తంగా బలహీన వర్గాల సామాజిక న్యాయం, సమానత్వం, సాధికారత కోసం కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ‘సామాజిక న్యాయం 2.0’ కొత్త ఉద్యమం తెలంగాణలో ప్రారంభమైందని అన్నారు. కీలకమైన కార్పొరేట్‌ బోర్డులు, న్యాయ వ్యవస్థ, బ్యూరోక్రసీ, ప్రధాన సంస్థల్లో బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం లేదని చెప్పారు. సెంట్రల్‌ వర్సిటీల్లో 80 శాతం ఓబీసీ, 83 శాతం ఎస్టీ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రస్తావించారు. జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి కమిటీకి, రాష్ట్ర మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌, మంత్రి ఉత్తమ్‌ కూడా కులగణన గురించి వివరించారు. రాహుల్‌గాంధీ, ఖర్గేలు నిపుణుల కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డితో మాట్లాడారు. ఆయన కృషిని రాహుల్‌ ప్రశంసించినపుడు తన సామాజిక బాధ్యతను నెరవేర్చానని సుదర్శన్‌రెడ్డి బదులిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే

మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 04:13 AM