Share News

జూరాలపై బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం

ABN , Publish Date - Jun 28 , 2025 | 04:56 AM

జూరాల ప్రాజెక్టు కూలిపోతోందంటూ బీఆర్‌ఎస్‌ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జి.మధుసూధన్‌రెడ్డి (జీఎంఆర్‌), తూడి మేఘారెడ్డి ధ్వజమెత్తారు.

జూరాలపై బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం

  • 30 ఏళ్లయినా ప్రాజెక్టు చెక్కు చెదరలేదు

  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జీఎంఆర్‌, మేఘారెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): జూరాల ప్రాజెక్టు కూలిపోతోందంటూ బీఆర్‌ఎస్‌ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జి.మధుసూధన్‌రెడ్డి (జీఎంఆర్‌), తూడి మేఘారెడ్డి ధ్వజమెత్తారు. అది కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టని, 30 ఏళ్లయినా చెక్కు చెదరలేదని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా హాల్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ‘ప్రాజెక్టులోని 62 గేట్లు పనిచేస్తున్నాయి. 4 గేట్లకు మరమ్మతులు చేయాలి. తాగునీటి కోసం జూరాలలో ఏడాది పొడవునా నీళ్లు నిల్వ ఉంచుతుండటంతోనే మరమ్మతులకు ఇబ్బంది అవుతోంది. తప్పుడు ప్రచారం చేయడం వల్లనే బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓడింది’ అని మధుసూధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.


మేఘారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేసి స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది బీఆర్‌ఎస్‌ నేతల ఆలోచన అని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్లు ఇస్తే ఆ ప్రాజెక్టు పూర్తవుతుందంటూ బీఆర్‌ఎస్‌ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వారికి తామే రూ.3 వేల కోట్లు ఇప్పిస్తే ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తారా అంటూ సవాల్‌ విసిరారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేసేది ఇందిరమ్మే అని చెప్పి ప్రజలే ఆమెను ప్రధానిని చేశారని, ఇక బీజేపీ నేతలు ఎమర్జెన్సీ డ్రామాలు బంద్‌ పెట్టాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. హైకోర్టులో కేసు ఉన్నందున ఎన్నికలను ప్రభుత్వం ఆపిందని స్పష్టం చేశారు.

Updated Date - Jun 28 , 2025 | 04:56 AM