Bhatti Vikramarka; కేంద్రం బీసీ బిల్లును క్లియర్ చేయాలి
ABN , Publish Date - Jul 30 , 2025 | 04:34 AM
దశాబ్దకాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు లబ్ధిదారులకు రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

కొత్త రేషన్ కార్డులకు.. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ వర్తింపు
తాండూరులో డిప్యూటీ సీఎం భట్టి
తాండూరు, జూలై 29 (ఆంధ్రజ్యోతి) : దశాబ్దకాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు లబ్ధిదారులకు రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో రూ.230 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, చీఫ్‌విప్ మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డితో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించాలని బీసీ బిల్లును శాసన సభలో పెట్టి గవర్నర్‌కు, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి పంపడం జరిగిందన్నారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఆ బిల్లును వెంటనే క్లియర్ చేయాలన్నారు. ఇందుకోసం సీఎం రేవంత్ నాయకత్వంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా 95 లక్షల రేషన్ కార్డులు, 4.50 లక్షల ఇళ్లకు రూ.22,500 కోట్లు కేటాయించామన్నారు.
ఈ ఏడాది మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలుగా రూ. 21 వేల కోట్లు కేటాయించామని ఆయన వివరించారు. బహిరంగ సభలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నాయకులు అభివృద్ధిని చూడలేని కబోదులని విమర్శించారు. పథకాల అమలును చూసి కూడా విమర్శించడం దారుణమన్నారు. అంతకు ముందు డిప్యూ టీ సీఎం జుంటుపల్లి సీతారామస్వామి దేవాలయాన్ని సందర్శించారు. తర్వాత రూ.200 కోట్ల వ్యయంతో దౌలాపూర్ వద్ద ఏర్పాటు చేసే ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్’, రూ.7.37 కోట్లతో తాండూరు పట్టణంలో చేపట్టే అభివృద్ధి పనులకు, 20కోట్ల వ్య యంతో చేపట్టే 6 విద్యుత్ సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. కాగా విద్యుత్ అధికారులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలో ప్రభుత్వ చీఫ్‌విప్ మహేందర్‌రెడ్డి ఫొటో, పేరు లేకపోవడంపై ఆయన అనుచర వర్గం మండిపడ్డారు. దీంతో పోలీసులు వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. అనంతరం భట్టి యాలాల మండలం జుంటుపల్లి గ్రామంలో ఉన్న తన చిన్ననాటి స్నేహితుడు డాక్టర్ రవీందర్‌రావు ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం చిన్ననాటి చిత్రాన్ని ప్రత్యేకంగా గీయించి ఆయనకు స్నేహితులు అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్
Read latest Telangana News And Telugu News