Share News

Sigaachi Industry Blast: ప్రాణాలు తీస్తున్న పరిశ్రమల కక్కుర్తి

ABN , Publish Date - Jul 07 , 2025 | 03:12 AM

సిగాచీ పరిశ్రమలో పేలుడు నేపథ్యంలో ఔషధ, రసాయన, ఇతర పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఎక్కువగా ప్రచారం జరుగుతోందిగానీ..

Sigaachi Industry Blast: ప్రాణాలు తీస్తున్న పరిశ్రమల కక్కుర్తి

  • రాష్ట్రంలో ఐదేళ్లలో 700కు పైగా ప్రమాదాలు.. ఔషధ, రసాయన పరిశ్రమల్లోనే అధికం

  • యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరే కారణం

  • వారికి వత్తాసుగా అధికార యంత్రాంగం

హైదరాబాద్‌ సిటీ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): సిగాచీ పరిశ్రమలో పేలుడు నేపథ్యంలో ఔషధ, రసాయన, ఇతర పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఎక్కువగా ప్రచారం జరుగుతోందిగానీ.. తరచూ అనేక చోట్ల ప్రమాదాలు జరుగుతున్నా.. వాటి గురించి బయటకు రావట్లేదని నిపుణులు అంటున్నారు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారమే.. తెలంగాణలో ఐదేళ్లలో పలు పరిశ్రమల్లో 700కు పైగా ప్రమాదాలు జరిగినట్టు తెలుస్తోంది. వాటిలో 500కు పైగా ఔషధ, రసాయన పరిశ్రమల్లో జరిగినవే! అయినప్పటికీ.. కారణాలను అంచనావేసి, గుర్తించడంలో అధికారుల వైఫల్యం ఎంతో ఉందని నిపుణులు అంటున్నారు. ప్రమాదం జరిగినప్పుడు కార్మికుల నిర్లక్ష్యమే కారణమంటూ యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయని.. కానీ, తగిన అర్హతలు లేనివారిని తక్కువ జీతానికి నియమించుకోవడం, భద్రతా చర్యలకు సంబంధించి వారికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వకుండానే పనులు చేయించడం, నిర్ణీత విధానాల ప్రకారం పనిచేయడానికి వీలుగా వారికి అవసరమైన పరికరాలను అందించకపోవడమే ప్రమాదాలకు కారణమని మానవ హక్కుల వేదిక ప్రతినిధి సంజీవ్‌ చెబుతున్నారు. నిబంధనలన్నీ పక్కాగా అమలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రమాదకర పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి. వాటిల్లో ఎలాంటి యంత్రాలు వినియోగిస్తున్నారు. వాటి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారా? ప్రమాణాలను పాటిస్తున్నారా అనే విషయాలను మాత్రం ప్రభుత్వాలు, అధికారులు పట్టించుకోవట్లేదని.. సీనియర్‌ సైంటిస్టు కలపాల బాబూరావు ఆవేదన వెలిబుచ్చారు. విదేశాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటారని, మన దగ్గర మాత్రం యజమానులపై ఈగ కూడా వాలనివ్వకుండా తప్పంతా కార్మికులదే అన్నచందంగా కొందరు అధికారులు నివేదికలు ఇవ్వడం దుర్మార్గమని బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో ప్రమాదాలను నివారించేందుకు చట్టాలున్నా.. వాటి అమలు తీరు సరిగ్గా లేదని ఆవేదన వెలిబుచ్చారు. అలా కాకుండా.. ప్రతి కేసులోనూ నిపుణులతో నిజనిర్ధారణ చేయించాలని, నిష్పక్షపాతంగా విచారణ జరిపి యాజమాన్యాల తప్పిదాలు ఉంటే వారికి తగిన శిక్ష విధించాలి అని సూచించారు.


యజమానులే దోషులు

రసాయన, ఔషధ పరిశ్రమలలో ప్రమాదాలు తలెత్తిన ప్రతి సందర్భంలోనూ కార్మికుల చర్యలే అందుకు కారణమని ఫ్యాక్టరీస్‌ శాఖ, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు నివేదికలు రాయడం వల్ల యజమానులు తప్పించుకుంటున్నారు. నిజానికి అసలు దోషులు వారే. కనీస భద్రత చర్యలు తీసుకోకపోవడం, సమర్థులైన భద్రతాధికారులను నియమించకపోవడం, కనీస భద్రతా పరికరాలు అందుబాటులో ఉంచకపోవడం వంటి కారణాల వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పాశమైలారం ఘటన నేపథ్యంలో అయినా ఈ లోపాలపై దృష్టి సారించాలి.

- కలపాల బాబూరావు, విశ్రాంత సైంటిస్ట్‌


Also Read:

కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సవాల్..

మోదీ ప్రభుత్వం విద్వేషాలని రెచ్చగొడుతోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

వందేభారత్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

For More Telangana News And Telugu News

Updated Date - Jul 07 , 2025 | 03:12 AM