Share News

Cold Wave: మళ్లీ చలి పంజా

ABN , Publish Date - Jan 21 , 2025 | 05:07 AM

రాష్ట్రంలో కొన్ని రోజులపాటు తగ్గిన చలి తీవ్రత మళ్లీ తన తడాఖా చూపిస్తోంది. కొన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఏకంగా సింగిల్‌ డిజిట్‌కు పడిపోవడంతో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు.

Cold Wave: మళ్లీ చలి పంజా

  • ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో 6.2 డిగ్రీలు

  • పలు జిల్లాల్లో దారుణంగా పడిన ఉష్ణోగ్రతలు

  • చలిగాలులతో పిల్లలు, వృద్ధులకు ఇబ్బందులు

హైదరాబాద్‌/ కోహీర్‌/ ఆదిలాబాద్‌/ ఆసిఫాబాద్‌/ హనుమకొండ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొన్ని రోజులపాటు తగ్గిన చలి తీవ్రత మళ్లీ తన తడాఖా చూపిస్తోంది. కొన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఏకంగా సింగిల్‌ డిజిట్‌కు పడిపోవడంతో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఆదివారం రాత్రి ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో 6.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవగా, ఆదిలాబాద్‌ జిల్లా బేలలో 8 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 8.9 డిగ్రీలు, నిర్మల్‌ జిల్లా పంబిలో 9.3 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 9.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే మెదక్‌ జిల్లా శివనూరులో 12.2 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా కొండపాకలో 10.9 డిగ్రీలు, హైదరాబాద్‌ పటాన్‌చెరులో 10.4 డిగ్రీలు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో 11.2 డిగ్రీలు, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తిలో 15 డిగ్రీలు, నల్లగొండ జిల్లాలో 16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


ఓ వైపు రాత్రి పూట ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌ స్థాయికి పడిపోతుంటే, కొన్ని జిల్లాలో పగటి పూట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు మించి నమోదవుతుండడం విశేషం. ఆదివారం 19 జిల్లాల్లో 35 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, ఉదయం 7 గంటల వరకు ప్రధాన రహదారులను పొగమంచు కప్పేయడంతో వాహనదారులు దారి కనిపించక తిప్పలు పడుతున్నారు. చలిగాలులకు చిన్నపిల్లలు, వృద్ధులు ఆస్తమా వ్యాధిగ్రస్తులు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి నేపథ్యంలో వీలైనంత మేరకు ప్రజలు ఇంటికే పరిమితం కావాలని, అత్యవసర పనులుంటే తగిన జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని, శివరాత్రి వరకు చలి తీవ్రత ఇదే విధంగా కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది.

Updated Date - Jan 21 , 2025 | 05:07 AM