CM Revanth Reddy: ఓనమాలు రానోడూ జర్నలిస్టే!
ABN , Publish Date - Aug 02 , 2025 | 03:42 AM
రాజకీయ నాయకులపై విశ్వసనీయత దెబ్బతిన్నట్టుగానే జర్నలిస్టుల విశ్వసనీయత కూడా క్రమంగా తగ్గుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

కాగితం ఇస్తే అక్షరాలు రాయడం చేతకాని వాళ్లు.. పిచ్చిరాతలతో వ్యవస్థలను నాశనం చేస్తున్నారు
ఇంటి పేరులా ‘జర్నలిస్టు’ అని పెట్టుకుంటున్నారు
సోషల్ మీడియాలో అసభ్య భాషతో జర్నలిజాన్ని నిర్వీర్యం చేస్తున్నారు
కనీస అర్హతలు లేకుండా జర్నలిస్టులుగా చలామణీ అవుతున్న వాళ్లని సీనియర్లే పక్కన పెట్టాలి
మీడియా సమావేశాల్లో కాలు మీద కాలేసుకునే ఆ జర్నలిస్టులను చూస్తే కొట్టాలనిపిస్తుంది
‘నవ తెలంగాణ’ 10వ వార్షికోత్సవంలో సీఎం రేవంత్
హైదరాబాద్, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): రాజకీయ నాయకులపై విశ్వసనీయత దెబ్బతిన్నట్టుగానే జర్నలిస్టుల విశ్వసనీయత కూడా క్రమంగా తగ్గుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఒకప్పుడు పత్రికలు, ప్రసార సాధనాలంటే ప్రజలకు విశ్వసనీయత ఉండేదని, ప్రస్తుతం జర్నలిస్టు విలువలు పూర్తిగా తగ్గిపోయాయని వ్యాఖ్యానించారు. ఓనమాలు రాని వాళ్లు, కాగితం ఇస్తే అక్షరాలు రాయడం రాని వాళ్లు జర్నలిస్టులుగా చలామణీ అవుతూ జర్నలిజాన్ని నిర్వీర్యం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో శుక్రవారం జరిగిన ‘నవ తెలంగాణ’ సంస్థ పదో వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్.. సోషల్ మీడియా జర్నలిస్టుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవడు పడితే వాడు జర్నలిస్టు అంటూ తమ రాతలతో, చేతలతో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆవారాగా రోడ్ల మీద తిరిగే వాళ్లు కొందరు సోషల్ మీడియా జర్నలిస్టులమంటూ తమ అసభ్యకరమైన భాషతో జర్నలిజం వ్యవస్థను నిర్వీర్యం చేసి, విశ్వసనీయత దెబ్బ తీసేలా ప్రవర్తిస్తున్నారని సీఎం అన్నారు. ఇక, మీడియా సమావేశాల్లో కొందరు.. కాలు మీద కాలు వేసుకుని కూర్చోని.. ‘సీనియర్ జర్నలిస్టులకు గౌరవం ఇవ్వవా? నమస్తే పెట్టవా?’ అన్నట్టు తమ వైపు చూస్తుంటారని తెలిపారు.
అలాంటి వారిని చూసినప్పుడు వేదిక దిగి కొట్టాలని తనకు అనిపిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. కానీ, తన స్థాయి, హోదా గుర్తు వచ్చి ఆగిపోతున్నానని చెప్పారు. కలం, కాగితం ఇస్తే కొందరికి అ, ఆ లు, ఏబీసీడీలు కూడా రావని, అలాంటి ఓనమాలు రాని వారు పిచ్చిరాతలతో వ్యవస్థను నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏదో ఇంటి పేరు జర్నలిస్టు అయినట్టు, తమ తాత, ముత్తాతల నుంచి జర్నలిస్టులుగా సేవలందిస్తున్నట్టు కొందరు తమ పేరు ముందు జర్నలిస్టు అని పెట్టుకుంటున్నారని సీఎం పేర్కొన్నారు. కనీస అర్హతలు లేకుండా చాలా మంది జర్నలిస్టులుగా చలామణీ అవుతున్నారని, అలాంటి వాళ్లను సీనియర్ జర్నలిస్టులే పక్కన పెట్టాలని సూచించారు. సీనియర్ జర్నలిస్టులు అలాంటి వారిని అసలు తమ పక్కన కూడా కూర్చోపెట్టుకోకూడదని తెలిపారు. జర్నలిస్టు మేధావులంతా కలిసి జర్నలిజం అనే పదానికి అర్థం వెతకాల్సిన దుస్థితి ప్రస్తుతం తలెత్తిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన జర్నలిస్టులంతా ఒక లక్ష్మణ రేఖ గీసుకుని ఓవైపు ఉండి, అరాచకాలు చేసే జర్నలిస్టులను మరోవైపునకు నెట్టాలని ముఖ్యమంత్రి కోరారు. కాగా, ప్రజావ్యతిరేక విధానాలపై గళమెత్తాలన్నా, తప్పు చేసిన అధికార పార్టీని గద్దె దించాలన్నా కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడూ ముందుంటాయని ముఖ్యమంత్రి రేవంత్ ఈ సందర్భంగా అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టులు చేసిన ఉద్యమాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పారు. తమ్మినేని వీరభద్రం చేసిన పాదయాత్రలు, పోరాటాలు 2023లో తమ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పరోక్షంగా కారణమై ఉంటాయని అభిప్రాయపడ్డారు. ప్రజాపాలన మరో దఫా కొనసాగేందుకు కమ్యూనిస్టుల సహకారం కావాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కోరారు.
నిజాన్ని నిర్భయంగా ప్రజలకు అందించడమే జర్నలిజం : పొంగులేటి
నిజాన్ని నిర్భయంగా ప్రజలకు అందించడమే అసలైన జర్నలిజం అని ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ అనుకూల మీడియా సీఎం, మంత్రులపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ జర్నలిజం విశ్వసనీయతను దెబ్బతీస్తోందని చెప్పారు. తమకు వ్యతిరేకంగా వార్త రాసిన వారిపై గత పాలకులు ఉక్కుపాదం మోపి అణగదొక్కారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం బీఆర్‌ఎస్ అనుకూల మీడియా వికృత చేష్టలను ఉపేక్షిస్తోందని చెప్పారు. అయితే ఓ పరిమితి దాటిన తర్వాత వారి ఆగడాలను తాము కూడా ఉపేక్షించమని పొంగులేటి ఈ సందర్భంగా హెచ్చరించారు. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ.. పత్రికలంటే నిజాన్ని కప్పి ఉంచేవి కావని, ప్రజలకు పూర్తిగా విపులీకరించి చెప్పేవన్నారు. సీపీఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ట్రంప్ వ్యాఖ్యలను ఖండించలేని మోదీ ఒక దద్దమ్మ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఒక్క ప్రకటన కూడా ఇవ్వమని మాజీ సీఎం కేసీఆర్ అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ, జూలకంటి రంగారెడ్డి, సమాచార కమిషనర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదిక.. సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పణ
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై కొనసాగుతున్న విచారణ.. కస్టడీలో డాక్టర్ నమ్రత
Read latest Telangana News And Telugu News