Share News

Pending Bills: పెండింగ్‌ బిల్లుల వివరాలు పంపండి

ABN , Publish Date - Jul 01 , 2025 | 04:45 AM

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యా సంస్థలకు చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. ఏయే సొసైటీకి ఎంతెంత బకాయిలు ఉన్నాయి...

Pending Bills: పెండింగ్‌ బిల్లుల వివరాలు పంపండి

  • గురుకుల సెక్రటరీలను అడిగిన సీఎంవో కార్యాలయ వర్గాలు

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

  • మంత్రులు పొన్నం, అడ్లూరితో సమావేశం

  • నిధుల సేకరణకు నేడు ఉప ముఖ్యమంత్రితో భేటీ

హైదరాబాద్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి) : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యా సంస్థలకు చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. ఏయే సొసైటీకి ఎంతెంత బకాయిలు ఉన్నాయి... వాటికి ఎంతమేరకు నిధులు అవసరం అనే అంశంపైన వివరాలు అడిగినట్లు తెలిసింది. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం రాత్రి తన నివాసంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, ఆయా శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యారు. గురుకులాలకు అవసరమైన నిధులు, సెంట్రలైజ్డ్‌ టెండర్ల విషయంపై చర్చించినట్లు సమాచారం. పెండింగ్‌ బిల్లులపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎంవో కార్యాలయ వర్గాలు ఏయే గురుకుల సొసైటీకి ఎంత మొత్తంలో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయో పూర్తి వివరాలను పంపాలని ఆయా సొసైటీల సెక్రటరీలను కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారు బకాయిల వివరాలు సోమవారం రాత్రి పంపారు.


గురుకులాల్లో విద్యార్థులకు గుడ్లు, మాంసం, పండ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలను సరఫరా చేస్తున్న గుత్తేదారులకు జనవరి నుంచి బిల్లులు చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో చాలాచోట్ల గుడ్లు, చికెన్‌, అరటి పండ్ల సరఫరా నిలిచిపోయింది. అదేవిధంగా అద్దె బకాయిలు పేరుకుపోయాయి. ప్రభుత్వం ఉచితంగా అందించే ఏకరూప దుస్తులు, టై, బెల్ట్‌, షూల వంటివి ఏటా సరఫరా కాకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దీంతో గురుకులాల్లో ఇబ్బందులపై సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘గురుకులాల గోడు’ శీర్షికన ప్రచరితమైన కథనానికి ప్రభుత్వం స్పందించింది. సీరియ్‌సగా తీసుకున్న సీఎం నిధుల విడుదలపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో సంబంధిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కూడా అప్రమత్తమయ్యారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పెండింగ్‌ బిల్లుల పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గురుకులాల ఆర్థిక సమస్యల పరిష్కారానికి నిధుల మంజూరు కోసం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌, ఆయా శాఖల ఉన్నతాధికారులు కలిసి మంగళవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలవాలని నిర్ణయించినట్లు సమాచారం. పెండింగ్‌ బిల్లుల వివరాలు తెలియజేసి నిధులు విడుదల చేసేలా కోరనున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

Updated Date - Jul 01 , 2025 | 04:45 AM