Share News

CM Reavanth Reddy: తెలంగాణకు రండి.. ప్రపంచానికి విస్తరించండి

ABN , Publish Date - Apr 22 , 2025 | 02:50 AM

హైదరాబాద్‌కు రండి.. మీ ఉత్పత్తులు తయారుచేయండి.. భారత మార్కెట్‌తోపాటు ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేసుకోండి.. తెలంగాణను మీ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోండి.. అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి జపాన్‌ కంపెనీలను సాదరంగా ఆహ్వానించారు.

CM Reavanth Reddy: తెలంగాణకు రండి..  ప్రపంచానికి విస్తరించండి

  • మీ పెట్టుబడులకు మా రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ఎంచుకోండి

  • మాది సులభతర పారిశ్రామిక విధానం

  • సర్క్యులర్‌ ఎకానమీ కేంద్రంగా ‘ఫ్యూచర్‌ సిటీ’

  • మారుబెనీ సంస్థతో కలిసి పారిశ్రామిక పార్కు

  • అంతర్జాతీయ ఎగుమతుల కోసం ‘డ్రై పోర్ట్‌’ను ఏర్పాటు చేస్తున్నాం

  • జపాన్‌ పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్‌రెడ్డి

  • ఒసాకా వరల్డ్‌ ఎక్స్‌పో-2025లో సమావేశం

  • తొలిసారిగా తెలంగాణ పెవిలియన్‌ ఏర్పాటు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ‘‘హైదరాబాద్‌కు రండి.. మీ ఉత్పత్తులు తయారుచేయండి.. భారత మార్కెట్‌తోపాటు ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేసుకోండి.. తెలంగాణను మీ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోండి..’’ అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి జపాన్‌ కంపెనీలను సాదరంగా ఆహ్వానించారు. సులభతర పారిశ్రామిక విధానం, స్థిరమైన పాలన, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు వంటివి తెలంగాణలో పెట్టుబడులకు ఆకర్షణగా నిలుస్తున్నాయని వివరించారు. జపాన్‌ పర్యటనలో ఉన్న సీఎం బృందం సోమవారం కిటాక్యూషు నుంచి ఒసాకా నగరానికి చేరుకుంది. అక్కడ జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఒసాకా ఎక్స్‌పో-2025లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జపాన్‌ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో 30వేల ఎకరాల్లో ‘ఫ్యూచర్‌ సిటీ’ నిర్మాణం జరుగుతోందని.. ఎకో, ఎనర్జీ, స్మార్ట్‌ మొబిలిటీ, సర్క్యులర్‌ ఎకానమీ కేంద్రంగా అభివృద్థి చెందుతుందని వారికి సీఎం వివరించారు. అక్కడ జపాన్‌కు చెందిన మారుబెనీ కార్పొరేషన్‌తో కలిసి ఒక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్‌ చుట్టూ 370 కిలోమీటర్ల పొడవైన రీజనల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌), రేడియల్‌ రోడ్లు, ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) మధ్య ఉన్న ప్రాంతంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్‌, ఎలకా్ట్రనిక్స్‌, సెమీ కండక్టర్లు, ఏరోస్పేస్‌ పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని వివరించారు. అంతర్జాతీయ ఎగుమతుల కోసం సమీప ఓడరేవుతో అనుసంధానిస్తూ డ్రై పోర్ట్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మూసీ నది పునరుజ్జీవంలో భాగంగా నది పొడవునా 55 కిలోమీటర్ల అర్బన్‌ గ్రీన్‌ వే అభివృద్థి చేయనున్నట్టు వివరించారు. ఇక మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. తెలంగాణ ఇప్పటికే ఐటీ, బయోటెక్నాలజీ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిందని చెప్పారు. ఏరోస్పేస్‌, ఎలకా్ట్రనిక్స్‌, టెక్స్‌టైల్స్‌ రంగాల్లో పెట్టుబడులకు అనువైన వాతావరణం రాష్ట్రంలో ఉందని వివరించారు.


భారత్‌ నుంచి తొలిసారిగా పెవిలియన్‌..

తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించేందుకు ఒసాకా ఎక్స్‌పో-2025లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పెవిలియన్‌ను ఏర్పాటుచేసింది. 150కిపైగా దేశాలు పాల్గొంటున్న ఈ ఎక్స్‌పోలో భారత్‌ నుంచి ఒక రాష్ట్రం పెవిలియన్‌ ప్రారంభించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలసి దీనిని ప్రారంభించారు. ఈ పెవిలియన్‌లో తెలంగాణలోని వైవిధ్యమైన సంస్కృతి, పారిశ్రామిక అనుకూల వాతావరణం, సాంప్రదాయ కళలు, పర్యాటక ఆకర్షణలను ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే సందర్శకులకు వివరించేలా.. రాష్ట్ర సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సంపదను ప్రతిబింబించేలా ప్రదర్శనలను ఏర్పాటు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

CM Revanth Reddy: ఆ అధికారిని రిటైరయ్యాక కొనసాగించండి

BRS MLC Kavitha: పేరుకే ముగ్గురు మంత్రులు అభివృద్ధి శూన్యం

Cybercrime: సైబర్‌ నేరగాళ్లకు కమీషన్‌పై ఖాతాల అందజేత

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 22 , 2025 | 02:50 AM