CM Revanth Reddy: మహిళలకు 60 ఎమ్మెల్యే టికెట్లు
ABN , Publish Date - Jul 08 , 2025 | 03:23 AM
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ అమలు కాబోతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 60 మంది మహిళలకు టికెట్లు ఇవ్వడంతోపాటు వారిని గెలిపించే బాధ్యత కూడా తాను తీసుకుంటానని ప్రకటించారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తాం
వారిని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా
మహిళా సంఘాలకు 21 వేల కోట్ల రుణాలిచ్చాం
ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
పిల్లల పేర్లతో తల్లులు మొక్కలు నాటాలి: రేవంత్
అగ్రి వర్సిటీలో వనమహోత్సవం ప్రారంభం
హైదరాబాద్/రాజేంద్రనగర్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ అమలు కాబోతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 60 మంది మహిళలకు టికెట్లు ఇవ్వడంతోపాటు వారిని గెలిపించే బాధ్యత కూడా తాను తీసుకుంటానని ప్రకటించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడేలా చర్యలు తీసుకుంటున్నామని, అన్నిరంగాల్లో వారిని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సోమవారం రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వనమహోత్సవం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. రుద్రాక్ష మొక్కను నాటి వనమహోత్సవానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఒక్క ఏడాదిలోనే మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల మహిళలు కూడా మహిళా సంఘాల్లో చేరాలని పిలుపునిచ్చారు. హైటెక్ సిటీలో విప్రో, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఉండేచోట మహిళా సంఘాలు తయారుచేసిన వస్తువులను మార్కెటింగ్ చేసే సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీకి వెయ్యి బస్సులను అద్దెకిచ్చేలా మహిళలను ప్రోత్సహించి, ఆదాయం పెంచుకునేలా ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందని చెప్పారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను కూడా మహిళలకే అప్పగించామన్నారు. భారత్ సమ్మిట్, మిస్‌వరల్డ్ కార్యక్రమాలకు హాజరైన ప్రతినిధులు ఇందిరా మహిళాశక్తి పేరుతో ఏర్పాటుచేసిన ప్రాంగణాన్ని చూసి తెలంగాణ మహిళలు ప్రపంచంతో పోటీ పడుతున్నారంటూ కితాబునిచ్చారని తెలిపారు. మీడియా ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం..
ప్రకృతిని మనం కాపాడితే.. మనల్ని ప్రకృతి కాపాడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ ఏడాది వనమహోత్సవంలో భాగంగా రాష్ట్రంలో 18 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారని, తల్లులు కూడా పిల్లల పేర్లతో మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటాలన్నారు. పిల్లలను సంరక్షించినట్లు మొక్కలను సంరక్షిస్తే రాష్ట్రమంతా పచ్చదనంతో పరిఢవిల్లుతుందన్నారు. వనమే మనం.. మనమే వనం అని పెద్దలు చెప్పారని, ప్రతి ఒక్కరూ పెద్దల మాటలు గౌరవించి మొక్కలు నాటాలని సూచించారు. వనమహోత్సవం కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. చెట్లను పెంచడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవడంతోపాటు జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. భౌగోళిక పరిస్థితి మెరుగుపడే విధంగా రాష్ట్రమంతా విరివిగా వనాలు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు ప్రకా్‌షగౌడ్, కాలె యాదయ్య, పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ, వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్‌లర్లు ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య, డాక్టర్ దండ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించారు.
ఇవి కూడా చదవండి
జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షా 12 వేల జీతం,
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి