Deputy CM Bhatti Vikramarka: బీసీల 42 శాతం రిజర్వేషన్ల కోసం..సీఎం నేతృత్వంలో ఢిల్లీకి బృందం
ABN , Publish Date - Jul 23 , 2025 | 06:11 AM
బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మంత్రులు

పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేలా అన్ని పార్టీల మద్దతు కూడగడతాం
ప్రధానిని, రాహుల్, ఖర్గేనూ కలుస్తాం
రిజర్వేషన్ల అంశం కేంద్రం, రాష్ట్రం మధ్య సమస్య
రాంచందర్‌రావు అర్థం చేసుకోలేదు
బీసీలు, దళితులంటే ఆయనకు చిన్నచూపు: భట్టి
హైదరాబాద్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మంత్రులు, ఇతర నేతలతో కూడిన రాష్ట్ర బృందం ఢిల్లీకి వెళ్లనుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున.. బీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడానికి అన్ని పార్టీల మద్దతు కోరేందుకు ఈ బృందం వెళుతోందన్నారు. తమ పార్టీకి చెందిన 100 మంది ఎంపీలు కూడా తమతో కలిసి వస్తారని పేర్కొన్నారు. రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన వివరాలను కలిసివచ్చే పార్టీల అధ్యక్షులకు వివరించి, ఆ పార్టీల లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల మద్దతు కూడగడతామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, తమ పార్టీ లోక్‌సభాపక్ష నేత రాహుల్‌గాంధీ, రాజ్యసభాపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేలను కూడా కలుస్తామన్నారు. బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయన్న నమ్మకం తమకు ఉందని తెలిపారు. ఈ రిజర్వేషన్లపై ఎలాంటి న్యాయపరమైన సమస్యలు వచ్చినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మంగళవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో డిప్యూ టీ సీఎం మాట్లాడారు. శాసనసభలో రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందడానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సహకరించారని, పార్లమెంటులో నూ ఆమోదం పొందడానికి ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు కలిసివస్తారని ఆశిస్తున్నామని అన్నారు. అసెంబ్లీలో సహకరించిన పార్టీలు.. పార్లమెంటులో అందుకు భిన్నంగా వ్యవహరిస్తాయని తాము అనుకోవడం లేదని చెప్పారు.
ప్రధాని సైతం నిర్ణయం మార్చుకునేలా చేశాం..
కులగణన వద్దన్న ప్రధాని నరేంద్ర మోదీ సైతం జనగణనలో కులగణన చేర్చి చేపట్టేలా తెలంగాణ ప్రభుత్వం చేసిందని భట్టివిక్రమార్క అన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ఈ పద్ధతిలో కులగణన జరగలేదని, తెలంగాణ చేపట్టిన కులగణన దేశానికి దిశానిర్దేశం చేసిందని పేర్కొన్నారు. కులగణనకు సంబంధించి కేంద్రం ఏ సమాచారం అడిగినా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కులగణన విషయంలో అన్నిరకాల పరిణామాలనూ ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకెళుతోందని చెప్పారు. ఇక మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు ఎలాం టి ఇబ్బంది రావొద్దన్న ఉద్దేశంతో ఆర్డినెన్స్ తెస్తున్నామని డిప్యూటీ సీఎం అన్నారు.
ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబరు 30 లోపు స్థా నిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఆర్‌టీఐ కమిషనర్లలో ఒక్క బీసీ లేరన్న విమర్శలపై స్పందిస్తూ.. ఇతర కార్పొరేషన్ల పోస్టుల్లో సామాజిక న్యాయం ఉంటుందని చెప్పారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించినవారు అన్నింటినీ గాలికి వదిలేశారని, తమకు నిబద్ధత ఉన్నందున ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు దళితులు, బీసీలంటే చిన్నచూపు అని భట్టివిక్రమార్క ఆరోపించారు. ఈ వర్గాల కోసం ఏ రాష్ట్రం ప్రయత్నించినా అడ్డుగా మాట్లాడటం ఆయనకు అలవాటన్నారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో రోహిత్ వేముల మృతి సంఘటనలో ఆయన పాత్ర ఏమిటో అందరికీ తెలుసునన్నారు. రిజర్వేషన్ల బిల్లును తాము తెచ్చినందున.. తామే పరిష్కరించుకోవాలని రాంచందర్‌రావు అంటున్నారని.. కానీ ఇది కేంద్రం, రాష్ట్రం మధ్య నెలకొన్న సమస్య అని తెలిపారు. బీజేపీకి సంబంధించింది కాదన్నారు. ఈ విషయాన్ని రాంచందర్‌రావు సరిగా అర్థం చేసుకోనట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. రాంచందర్‌రావు పంపించిన లీగల్ నోటీసు గురించి ప్రస్తావించగా.. తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. లీగల్ నోటీసు అందిన తర్వాత పార్టీపరంగా, వ్యక్తిగతంగా సమాధానం చెబుతామని ఆయన తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి