చరిత్ర సృష్టించాం
ABN , Publish Date - Jun 22 , 2025 | 03:39 AM
అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖవేదికగా సూపర్‌హిట్ అయిందని, ప్రజల సహకారంతో చరిత్ర సృష్టించామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

యోగాను ఒలింపిక్స్‌లో చేర్చాలి.. ఇందుకు ప్రధాని చొరవ తీసుకోవాలి
విశాఖలో 3,03,654 మంది యోగా.. 23 రికార్డులు
ఏపీలో 2.17కోట్ల మంది పాల్గొన్నారు
రోజూ గంట యోగాతో పూర్తి ఆరోగ్యం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
విశాఖపట్నం, జూన్ 21 (ఆంధజ్యోతి): అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖవేదికగా సూపర్‌హిట్ అయిందని, ప్రజల సహకారంతో చరిత్ర సృష్టించామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. యోగాను కామన్‌వెల్త్, ఏషియన్ గేమ్స్‌తో పాటు ఒలింపిక్స్‌లో చేర్చేలా ప్రధాని మోదీ చొరవ తీసుకోవాలని ఆయన కోరారు. ప్రధాని నరేంద్రమోదీ పదేళ్ల కృషి ఫలించిందని, ఏపీలో ఒక్కరోజే 12 లక్షలచోట్ల 2.17 కోట్లమంది యోగాలో భాగస్వామ్యులయ్యారన్నారు. యోగా కొం దరిది కాదు.. అందరిదనే భావనను ప్రధాని మోదీ తీసుకొచ్చారని కొనియాడారు. అందువల్లే ఉదయం ఆరు గంటలకే రావాలని పిలుపునిస్తే.. తెల్లవారుజామునే చేరిపోయారని, ప్రకృతి కూడా సహకరించిందన్నారు. మొత్తం 3,03,654 మంది విశాఖలో పాల్గొన్నట్టు క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా తేలిందని, ఇది గిన్నిస్ రికార్డు అని అన్నారు. 22,122 మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాలపాటు సూర్య నమస్కారాలు చేయడంతో రెండో రికార్డ్ సొంతమైందన్నారు. దీనికి అదనంగా మరో 21 రికార్డులు సాధించి చరిత్ర సృష్టించామని తెలిపారు. విశాఖ బీచ్ రోడ్డులో శనివారం ఉదయం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలోనూ, కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలోనూ ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 2.45 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 25 వేల మందికి ధ్రువపత్రాలు ఇద్దానుకుంటే, ఆ సంఖ్య 1.8 లక్షలకు చేరింది.’’ అని చంద్రబాబు తెలిపారు. ‘‘విశాఖలో యోగా డే నిర్వహణకు అవకాశం ఇచ్చిన ప్రధానికి కృతజ్ఞతలు. మంత్రులు, అధికార యంత్రాంగం బాగా పనిచేశారు. ప్రత్యేకించి విశాఖ జిల్లా కలెక్టర్ సహా ప్రతి ఒక్కరూ కృతనిశ్చయంతో చిన్నపాటి ఇబ్బంది రాకుండా ఏర్పాట్లుచేశారు. ప్రజాప్రతినిధులంతా సంఘీభావంతో పనిచేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి కార్యక్రమం విజయవంతానికి కృషి చేశాను’’ అని తెలిపారు.
యోగా గేమ్ చేంజర్
‘‘పురుగుమందులు, ఎరువులతో భూమి విషతుల్యమైంది. ఇటువంటి భూమిలో పండే ఆహారం మనం తీసుకుంటున్నాం. ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టిన పంజాబ్ నుంచి ప్రతిరోజూ ఢిల్లీకి క్యాన్సర్ రోగులు వెళ్తున్నారు. కాలు విరిగినా, గుండెకు ఆపరేషన్ జరిగినా శరీరం దెబ్బతింటుందది. అందుకే ప్రతిరోజు ఒక గంటపాటు యోగా చేయాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే అటు కుటుంబానికి, ఇటు రాష్ట్రానికి భారం కాకుండా ఉంటారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వం చేసే ఖర్చు కూడా తగ్గుతుంది. యోగాను రాష్ట్రంలో ప్రోత్సహించేలా కార్యాచరణ రూపొందిస్తాం. ప్రజల ఆరోగ్యంపై డిజిటల్ రికార్డులు తయారుచేస్తాం. యోగా, నేచురోపతి, ఆయుర్వేదం, ప్రకృతి వ్యవసాయం గేమ్ చేంజర్ అవుతాయి. యోగాతో హింసాప్రవృత్తి తగ్గి, శాంతి కలుగుతుంది.’’ అని అన్నారు.
యోగాసనాలు వేసిన మోదీ, బాబు, పవన్
ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. యోగాంధ్ర కార్యక్రమంలో ప్రసంగాలు పూర్తయిన తరువాత వేదిక దిగి వచ్చి ప్రజల మధ్య కూర్చొన్నారు. దాదాపు దాదాపు 50 నిమిషాల పాటు యోగా చేశారు. యోగా ఇన్‌స్ట్రక్టర్ చెప్పిన ఆసనాలన్నీ వేసి వారు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. వీరి తో పాటు వెనుక మరో కంపార్టుమెంట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆసనాలు వేశారు.
2 గిన్నిస్ రికార్డులు
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ నగరంలో నిర్వహించిన రెండు కార్యక్రమాలకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ 30.16 కిలోమీటర్ల మేర 3,03,654 మందితో చేపట్టిన యోగా ప్రదర్శన గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది. 2023లో గుజరాత్‌లోని సూరత్‌లో 1.47 లక్షల మందితో యోగా నిర్వహించడమే ఇప్పటివరకూ రికార్డుగా ఉంది. ఇప్పుడు దాన్ని అధిగమించి సరికొత్త రికార్డును సృష్టించినట్టయింది. అలాగే, శుక్రవారం సాయంత్రం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 22,122 మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాల్లో 108 సార్లు సూర్య నమస్కారాలు చేశారు. ఈ కార్యక్రమానికి కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ చోటు దక్కింది.
శభాష్.. లోకేశ్!
యోగాంధ్ర సక్సె్‌సపై మోదీ ప్రశంస
విశాఖపట్నం, జూన్ 21(ఆంధ్రజ్యోతి): యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంలో కీలకపాత్ర పోషించిన రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి లోకేశ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ కార్యక్రమం నిర్వహణలో లోకేశ్ చొరవ, పనితీరు గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ వేదికపైనే ఆయనను అభినందించారు. యోగాంధ్ర విజయవంతంలో లోకేశ్ పాత్ర మరువలేనిదన్నారు.ఇలాంటి కార్యక్రమాలను ఏ విధంగా జనంలోకి తీసుకెళ్లగలమో గత నెల, నెలన్నర రోజులుగా ఆయన చేసి చూపించారని కొనియాడారు. ఆయనను ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కాగా, విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంత్రుల సబ్ కమిటీలో లోకేశ్ కీలక సభ్యుడు. పది రోజుల ముందే విశాఖపట్నం వచ్చి ఆంధ్రా యూనివర్సిటీలోని సాగరిక హాలులో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ పనితీరును పరిశీలించారు. సమీక్ష నిర్వహించేందుకు ఐదు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ వచ్చినప్పుడు కూడా ఆయనతో పాటు వచ్చి సమీక్షలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులకు జన సమీకరణపై పలు సూచనలు చేశారు.