Ashwini: పూస శనగ 4037 రకానికి అశ్విని పేరు
ABN , Publish Date - Apr 17 , 2025 | 04:34 AM
రాష్ట్రానికి చెందిన దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త అశ్వినికి అరుదైన గౌరవం దక్కింది. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్) కొత్తగా అభివృద్ధి చేసిన పూస శనగ 4037 రకానికి అశ్విని పేరునే పెట్టింది.

ఐసీఏఆర్ ప్రకటన.. కుటుంబ సభ్యుల హర్షం
ఖమ్మం, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/కారేపల్లి: రాష్ట్రానికి చెందిన దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త అశ్వినికి అరుదైన గౌరవం దక్కింది. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్) కొత్తగా అభివృద్ధి చేసిన పూస శనగ 4037 రకానికి అశ్విని పేరునే పెట్టింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారంతండాకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత నూనవత్ అశ్విని తన తండ్రి మోతీలాల్‌తో కలిసి గత ఏడాది కారులో వెళ్తుండగా వరదలో కొట్టుకుపోయి మృతి చెందిన సంగతి తెలిసిందే. అనతి కాలంలోనే వ్యవసాయ శాస్త్రవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న అశ్విని పేరు చిరస్థాయిలో గుర్తుండేలా గతంలో ఆమె పరిశోధన చేసిన పూస శనగ వంగడానికి ఆమె పేరునే పెడుతున్నట్లు ఐసీఏఆర్ ప్రకటించింది.
అశ్విని పేరుతో విడుదల చేసిన పూస శనగ రకం హెక్టారుకు 26.73 క్వింటాళ్ల నుంచి 36.46 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు. అశ్విని పేరుతో పూస శనగకు చెందిన వంగడం విడుదల చేయడం పట్ల ఆమె కుటుంబీకులతో పాటు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.