Chamala: ఆంధ్రా పాలకులది అన్యాయం.. బీఆర్‌ఎస్‌ది ద్రోహం
ABN , Publish Date - Jul 13 , 2025 | 04:03 AM
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన.. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై చర్చకు తాము సిద్ధమని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. గోదావరి, కృష్ణా జలాలపై హరీశ్‌రావు చేసిన సవాల్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు.

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన.. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధం: చామల
బీసీ రిజర్వేషన్లు ఆపే కుట్రలు: మేడిపల్లి
హైదరాబాద్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన.. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై చర్చకు తాము సిద్ధమని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. గోదావరి, కృష్ణా జలాలపై హరీశ్‌రావు చేసిన సవాల్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నామన్నారు. నీళ్ల విషయంలో ఆనాడు ఆంధ్రా పాలకులు తెలంగాణకు అన్యాయం చేస్తే.. బీఆర్‌ఎస్ పాలకులు ద్రోహం చేశారని మండిపడ్డారు. శనివారం గాంధీభవన్‌లో చామల మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు పెట్టి తగినంత సమయం కేటాయించాలనడం చూస్తుంటే సభలో హరీశ్ ఏకపాత్రాభినయం చేసే ఆలోచనతో ఆయన ఉన్నట్లు స్పష్టమవుతోందని ఎద్దేవా చేశారు. నీళ్లే కాదు.. నిధులు, నియామకాలపై కూడా తాము చర్చకు సిద్ధమన్నారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన సాగిందని విమర్శించారు. ఆనాడు బీఆర్‌ఎస్ నేతలు చిత్తశుద్ధితో పని చేస్తే తెలంగాణ అప్పుల కుప్పగా మారేది కాదన్నారు. రాజకీయాల్లో ఉనికి కోసం కవిత తాపత్రయపడుతున్నారని.. ఆమె డ్రామాలను ప్రజలు నమ్మబోరని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్లను ఆపడానికి కొందరు కోర్టు వెళ్లే కుట్రలు చేస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పాలనలో బీసీలను అడుగడుగునా అణగదొక్కారన్నారు. బీసీలకు గొర్రెలు, బర్రెలు ఇచ్చి కేసీఆర్ బీసీలను రాజ్యాధికారానికి దూరం చేశారని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీల్లో సామాజిక న్యాయం ఎప్పటికీ జరగదని విమర్శించారు. సీఎం రేవంత్ సోషల్ ఇంజనీర్‌గా మారారని, మంత్రివర్గంలోకి నలుగురు దళితులను తీసుకుని చరిత్ర సృష్టించారని కొనియాడారు. గాంధీభవన్‌లో ‘అందుబాటులో ప్రజాప్రతినిధులు’ కార్యక్రమంలో భాగంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పాల్గొని ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ తేవాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ గాంధీభవన్‌లో ఎన్‌ఎ్‌సయూఐ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి, మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కాదు: మల్లు రవి
రాజ్యాంగంపై దాడులు పెరుగుతున్నాయని.. దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి అన్నారు. కొందరు తామేదో రాజ్యాంగానికి అతీతమైనట్టు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ‘రాజ్యాంగం రూపకల్పనలో అంబేడ్కర్ పాత్ర’పై ప్రసంగించేందుకు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌కి తెలంగాణ ప్రజల తరఫున స్వాగతం పలికినట్లు తెలిపారు. జస్టిస్ గవాయ్ పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలుపై పలుమార్లు మాట్లాడారని గుర్తు చేశారు. మరోవైపు.. వరంగల్ జిల్లాలో కొండా మురళి వ్యాఖ్యల వివాదంపై ఇరు వర్గాల నివేదికను పరిశీలించిన అనంతరం ఆమోదయోగ్య నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
విమాన ప్రమాదం.. నివేదికలో బయటపడ్డ సంచలన విషయాలు
కుర్చీ దొరికితే వదలొద్దు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి