Share News

HD Kumaraswamy: సీసీఐ, ఎస్‌ఐఐఎల్‌ పునరుద్ధరణకు చర్యలు

ABN , Publish Date - Jul 10 , 2025 | 03:43 AM

ఆదిలాబాద్‌ జిల్లాలో మూతపడ్డ కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని స్పాంజ్‌ ఐరన్‌

HD Kumaraswamy: సీసీఐ, ఎస్‌ఐఐఎల్‌ పునరుద్ధరణకు చర్యలు

  • మూతబడ్డ ఈ సంస్థలపై కేంద్ర మంత్రి కుమారస్వామి సమీక్ష

  • పునరుద్ధరణపై నివేదిక అందించాలని అధికారులకు ఆదేశాలు

  • సమీక్షలో పాల్గొన్న ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

  • పునరుత్పాదక బ్యాటరీల తయారీలో రాష్ట్రానికి ఎక్సలెన్స్‌ అవార్డు

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌ జిల్లాలో మూతపడ్డ కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని స్పాంజ్‌ ఐరన్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌ఐఐఎల్‌) పునరుద్ధరణపై సమగ్ర నివేదిక అందించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డి. కుమారస్వామి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఢిల్లీలో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర ప్రతినిధిగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో మూతపడ్డ రెండు పరిశ్రమల పరిస్థితిపై కేంద్రమంత్రి ఆరా తీశారు. ఈ పరిశ్రమల పునరుద్ధరణ దిశగా చర్యలు చేపట్టేందుకు సమగ్ర నివేదికను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు సీసీఐ, ఎస్‌ఐఐఎల్‌పై కేంద్రమంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడంపై మంత్రి శ్రీధర్‌ బాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమీక్షలో మూతపడ్డ రెండు పరిశ్రమలను పునరుద్ధరిస్తే యువతకు ఉపాధి అవకాశాల మెరుగుదల, ఆర్థికాభివృద్ధికి అవకాశముంటుందని కేంద్రమంత్రికి వివరించారు. వెనుకబడిన, నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలైన ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ పరిశ్రమల పునరుద్ధరణతో ప్రాంతియాభివృద్ధిలో సమతుల్యత సాధ్యమై రాష్ట్రం, దేశం ప్రగతి బాటలో పయనిస్తాయని పేర్కొన్నారు. ఆర్థిక, సామాజిక పురోగతికి దన్నుగా నిలిచే ఈ పరిశ్రమలను పునరుద్థరించాల్సిందిగా కోరుతూ సమగ్ర వివరాలతో కూడిన లేఖను మంత్రి శ్రీధర్‌ బాబు కేంద్రమంత్రికి అందించారు. ఈ నెలాఖరులో తెలంగాణకు వస్తానని, రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల పనితీరుతో పాటు, సంబంధిత పరిశ్రమల పునరుద్ధరణకు చర్యలు చేపట్టే దిశగా సమీక్ష నిర్వహిస్తానని కేంద్రమంత్రి కుమారస్వామి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాల మేరకు తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.


బ్యాటరీ తయారీ పరిశ్రమకు జాతీయ పురస్కారం

పునరుత్పాదక బ్యాటరీల తయారీలో అత్యుత్తమ నాయకత్వ దిశగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ పురస్కారం లభించింది. ఇండియా ఎనర్జీ స్టోరేజ్‌ అలయన్స్‌ (ఐఈఎ్‌సఏ) ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రోత్సాహం అందిస్తున్న రాష్ట్రాల ప్రభుత్వాలకు పురస్కారాలు ప్రదానం చేశారు. బ్యాటరీ తయారీ విభాగంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇండస్ట్రీ ఎక్సలెన్స్‌ అవార్డు-2025 ప్రదానం చేశారు. ఐఈఎ్‌సఏ గ్లోబల్‌ ప్రెసిడెంట్‌ స్టీఫెన్‌ ఫెర్నాన్స్‌ ఈ పురస్కారాన్ని తెలంగాణ ఎలకా్ట్రనిక్స్‌ విభాగం డైరెక్టర్‌ ఎస్‌కే శర్మకు అందించారు. రాష్ట్రానికి జాతీయ పురస్కారం రావడంపై మంత్రి శ్రీధర్‌ బాబు హర్షం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 03:43 AM