Share News

Illegal Sand Mining: ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణ బాధ్యత రాష్ట్రాలదే

ABN , Publish Date - Jul 22 , 2025 | 05:06 AM

ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ స్పష్టం చేశారు.

Illegal Sand Mining: ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణ బాధ్యత రాష్ట్రాలదే

  • కేంద్రం తరఫున పూర్తి సహకారం అందిస్తాం: భూపేందర్‌ యాదవ్‌

  • లోక్‌సభలో ఎంపీ కడియం కావ్య ప్రశ్నకు బదులిచ్చిన కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌/హనుమకొండ, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, పాకాల సరస్సు పరిరక్షణపై లోక్‌సభలో ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. గోదావరి నదీ తీరాల్లోని ఇసుక అక్రమ తవ్వకాలు, నష్టాన్ని సమగ్రంగా బేరీజు వేస్తున్నామని తెలిపారు. నదుల పరిరక్షణ, ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణ తదితర అంశాల్లో రాష్ట్రాలకు కేంద్రం సంపూర్ణ సహకారాన్ని అందిస్తోందని చెప్పారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు (టీజీపీసీబీ) వివరాల ప్రకారం గోదావరి నది ఒడ్డున ఇసుక అక్రమ తవ్వకాల గురించి ఎటువంటి ఫిర్యాదు అందలేదని బదులిచ్చారు. అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకు కేంద్ర గనుల శాఖ మైనింగ్‌ నిఘా వ్యవస్థను అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ అటవీ శాఖ నుంచి అందిన సమాచారం మేరకు నేషనల్‌ మిషన్‌ ఫర్‌ ఏ గ్రీన్‌ ఇండియా కింద వరంగల్‌ ప్రాంతంలో ఎటువంటి అటవీకరణ ప్రాజెక్టులు చేపట్టలేదన్నారు. జాతీయ నీటి పర్యవేక్షణ కార్యక్రమం కింద ప్రతినెలా పాకాల సరస్సు నుంచి నీటి నమూనాలు సేకరిస్తున్నట్టు తెలిపారు.


హైదరాబాద్‌కు డ్రైపోర్టు ఇవ్వండి: వద్దిరాజు

హైదరాబాద్‌కు డ్రైపోర్టు మంజూరు చేయాలని బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కోరారు. రాజ్యసభలో ‘బిల్స్‌ ఆఫ్‌ లేడింగ్‌ బిల్‌-2024’పై ఆయన మాట్లాడారు. ఈ బిల్లుతో హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ తదితర నగరాల్లో మధ్య, చిన్న తరహా పరిశ్రమల్లో ఉత్పత్తయిన సరుకులను విదేశీ మార్కెట్లకు తరలించేందుకు మార్గం మరింత సుగమమవుతుందని తెలిపారు. విశాఖపట్నం, చెన్నై పోర్టుల ద్వారా తెలంగాణ సరుకులు త్వరగా ఎగుమతి జరిగేందుకు దోహదం చేస్తుందన్నారు. హైదరాబాద్‌ డ్రైపోర్టు, రీజనల్‌ రింగ్‌ రోడ్‌ వంటి వాటిని ఈ బిల్లుతో అనుసంధానించాలని, తద్వారా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.


పెరిగిపోతున్న సైబర్‌ నేరాలు: కె.లక్ష్మణ్‌

దేశవ్యాప్తంగా సైబర్‌ మోసాలు, డిజిటల్‌ ఆర్థిక నేరాలు పెరిగిపోతున్నాయని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్‌ భద్రతా యంత్రా ంగం బలోపేతంపై రాజ్యసభలో ఆయన ప్రసంగించారు. సైబర్‌ నేరాల కట్టడికి ప్రతిస్పందన వ్యవస్థలను మెరుగుపర్చడం, డిజిటల్‌ అక్షరాస్యతను ప్రోత్సహించడంతో పాటు ప్రత్యేక సైబర్‌ నేరాల సెల్‌లను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2025 | 05:06 AM