Share News

CBI: తనిఖీలకు వచ్చిన వారికి లంచం

ABN , Publish Date - Jul 04 , 2025 | 03:30 AM

తనిఖీలకు వచ్చిన జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) అధికారులకు లంచాలు ఇచ్చిన విషయంలో దేశవ్యాప్తంగా పలు వైద్య కళాశాలలపై కేసు నమోదైంది.

CBI: తనిఖీలకు వచ్చిన వారికి లంచం

  • ఎన్‌ఎంసీ అధికారులకు భారీగా ముట్టజెప్పిన

  • తెలుగు రాష్ట్రాల్లోని పలు మెడికల్‌ కాలేజీలు

  • తమకు అనుకూల నివేదిక కోసం చెల్లింపులు

  • మధ్యవర్తులతో ఎన్‌ఎంసీ అధికార్ల వసూళ్లు

  • దేశవ్యాప్తంగా పలు కళాశాలలపై సీబీఐ కేసు

  • ఇప్పటివరకు ఆరుగురి అరెస్టు

హైదరాబాద్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): తనిఖీలకు వచ్చిన జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) అధికారులకు లంచాలు ఇచ్చిన విషయంలో దేశవ్యాప్తంగా పలు వైద్య కళాశాలలపై కేసు నమోదైంది. తమ కాలేజీలకు అనుకూలంగా నివేదికలు ఇవ్వాలని యాజమాన్యాలు మధ్యవర్తుల ద్వారా ఎన్‌ఎంసీ అధికారులకు పెద్ద మొత్తంలో సొమ్మును ముట్టజెప్పారు. దీనిపై జూన్‌ 30న సీబీఐ కేసు నమోదు చేసింది. ఇందులో ఏపీ, తెలంగాణకు చెందిన పలు మెడికల్‌ కాలేజీలు, మధ్యవర్తుల పేర్లు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు దేశవ్యాప్తంగా జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశారు. వరంగల్‌ జిల్లాలోని ఫాదర్‌ కొలంబో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ట్రస్టీ ఫాదర్‌ జోసెఫ్‌ కొమ్మారెడ్డి రెండు విడతల్లో రూ.20 లక్షలు, రూ.46 లక్షలు లంచంగా చెల్లించినట్లు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఫాదర్‌ కొలంబో ట్రస్టు సభ్యులు, వరంగల్‌ డయాసీస్‌ ప్రస్తుత అడ్మినిస్ట్రేటర్‌తో పాటు మరికొంత మందిని విచారించడానికి సీబీఐ సిద్ధమైనట్లు సమాచారం. ఎఫ్‌ఐఆర్‌లో 36 మంది పేర్లు ఉండగా, అందులో ఆరుగురు ఏపీ, తెలంగాణ వారు. ఎన్‌ఎంసీ పెద్దలు లంచాల కోసం పలు ప్రాంతాల్లో తమ అనుకూల వ్యక్తుల సాయం తీసుకున్నారు.


దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి అనంతపురం కదిరి ప్రాంతానికి చెందిన డాక్టర్‌ హరిప్రసాద్‌, హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీకి చెందిన డాక్టర్‌ అంకం రాంబాబు, విశాఖపట్నం అక్కయ్యపాలెంకు చెందిన డాక్టర్‌ కృష్ణకిషోర్‌లు మెడికల్‌ కాలేజీల నుంచి లంచాలు వసూలు చేసి ఢిల్లీలోని ఎన్‌ఎంసీ సభ్యుడు డాక్టర్‌ వీరేంద్రకుమార్‌కు పంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వీరిలో హరిప్రసాద్‌ పలు ప్రైవేటు వైద్య కళాశాలలకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తూ తనిఖీల సమయంలో డమ్మీ ఫ్యాకల్టీలను ఏర్పాటు చేయడం, ఎన్‌ఎంసీ లైసెన్సు పునరుద్ధరణ కోసం లేఖలు తేవడం, ఇందుకోసం లంచాలు వసూలు చేయడంలో కీలకపాత్ర పోషించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. విశాఖపట్నంలోని గాయత్రి మెడికల్‌ కాలేజీ డైరెక్టర్‌ వెంకట్‌ నుంచి రూ.50 లక్షలు వసూలు చేసి ఆ మొత్తాన్ని డాక్టర్‌ కృష్ణ కిషోర్‌ ద్వారా హవాలా మార్గంలో ఢిల్లీకి పంపినట్లు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఇదే కేసుకు సంబంధించి గతంలో చత్తీ్‌సగఢ్‌లోని శ్రీరావత్‌పురా మెడికల్‌ కాలేజీకి చెందిన ముగ్గురు డాక్టర్లు, ముగ్గురు మధ్యవర్తులను సీబీఐ అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటి వరకు కర్ణాటక, రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, తెలంగాణ, ఏపీల్లోని 40 చోట్ల సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్‌ఎంసీతో కుమ్మక్కైన మరికొన్ని ప్రైవేటు మెడికల్‌ కాలేజీలపైనా సీబీఐ దృష్టిసారించినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి

రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్.. కీలక అప్ డేట్..

తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్

టాలీవుడ్‌లో పైరసీ గుట్టు రట్టు.. ఒకరి అరెస్ట్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 04 , 2025 | 03:30 AM