MLA Jagadish Reddy: మరో 2,3 మీడియా సంస్థల పని పడతాం
ABN , Publish Date - Jun 30 , 2025 | 03:29 AM
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి.. మీడియా సంస్థలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహాన్యూస్ చానల్ కార్యాలయంపై జరిగింది దాడి కాదని, అది బీఆర్‌ఎస్ తెలిపిన నిరసన మాత్రమేనని అన్నారు.

మేం దాడులు చేస్తే వేరేలా ఉంటుంది
మా చేతిలోనూ ఆయుధాలున్నాయి
ఏ పోలీసులూ మమ్మల్ని ఆపలేరు
మీడియా ముసుగులో స్లాటర్ హౌస్‌లు నడుపుతున్నారు
మీరు ఎక్కడ బతుకుతున్నారో, ఎవరి తిండి తింటున్నారో గుర్తుంచుకోండి
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని టార్గెట్ చేయాలన్న బీఆర్‌ఎస్ ఎన్నారై
కార్యకర్త గిరి.. రాడ్లు, రాళ్లు పంపిస్తానని ‘ఎక్స్’లో పోస్టు
సూర్యాపేట/హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి.. మీడియా సంస్థలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహాన్యూస్ చానల్ కార్యాలయంపై జరిగింది దాడి కాదని, అది బీఆర్‌ఎస్ తెలిపిన నిరసన మాత్రమేనని అన్నారు. తాము దాడులు చేస్తే ఇలా ఉండదని, అలాగని తాము దాడులు చేయబోమని అనుకోవద్దని వ్యాఖ్యానించారు. మీడియా ముసుగులో స్లాటర్ హౌస్ (కబేళా)లు నడుపుతున్నారని, మరో రెండు మూడు మీడియా సంస్థల పని కూడా పడతామని హెచ్చరించారు. ఆదివారం సూర్యాపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్‌ల వ్యక్తిత్వాలను చంపేందుకు అదే పనిగా దాడులు చేస్తున్నారని, వారి చేతుల్లోని ఆయుధాలతో వారు దాడులు చేస్తే.. లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు తమ చేతుల్లోని ఆయుధాలకు పని చెబుతారని అన్నారు. ‘మీడియా ముసుగులో దాక్కుందామనో, చంద్రబాబో, రేవంత్‌రెడ్డో కాపాడుతారనో అనుకుంటున్నారేమో! మీరు ఎక్కడ దాక్కున్నా బిన్ లాడెన్‌ను వెతికినట్లు వెతికి పట్టుకొని మీ పని చెబుతాం. ఎవరినీ వదిలిపెట్టబోం’’ అని జగదీశ్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు క్షమాగుణం ఎక్కువ అని, కానీ.. ఆయన క్షమించినా తాము వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఏ పోలీసులూ తమను ఆపలేరన్నారు. ‘‘మీరు ఎక్కడ బతుకుతున్నారో, ఎవరి తిండి తింటున్నారో గుర్తుంచుకోండి. మహాన్యూస్ యాజమాన్యం ఇప్పటికైనా కేసీఆర్‌కు, కేటీఆర్‌కు క్షమాపణ చెప్పి చెంపలు వేసుకోవాలి’’ అని సూచించారు.
కాగా, కేటీఆర్‌పై మహాన్యూస్ చేసింది జర్నలిజం కాదని, వ్యక్తిత్వాలను హననం చేయడమేని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ అన్నారు. అమాయకులైన మహిళల మానసిక, భావోద్వేగ, ప్రతిష్ఠలకు భంగం కలిగేలా మహాన్యూస్ యాజమాన్యం వ్యవహరించిందన్నారు. మరోవైపు.. మీడియా ముసుగులో పరిధులు దాటి ప్రవర్తిస్తే తాము కూడా పరిధులు దాటుతామని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. వ్యక్తిగత ఆరోపణలు చేయాలనుకుంటే జర్నలిజం వదిలి రాజకీయాల్లోకి రావాలని సవాల్ చేశారు. ఇదిలా ఉండగా.. కేటీఆర్‌పై యూట్యూబ్‌లో అసభ్యకర తంబ్ నెయిల్స్ పెడుతుంటే సైబర్ సెక్యూరిటీ సెల్ ఏం చేస్తోందని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. సిట్‌ను నడుపుతున్నది పోలీసులా? లేక పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకులా? అని ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఎల్లో జర్నలిజం పేరతో చంద్రబాబు శిష్యుడిగా బీఆర్‌ఎ్‌సపై బురదజల్లుతున్నారని ఆరోపించారు.
‘‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ని టార్గెట్ చేయండి’
అమెరికాలోని టెక్సాస్‌లో ఉంటున్న గిరి చెర్కుపల్లి అనే బీఆర్‌ఎస్ ఎన్నారై కార్యకర్త ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’పై నోరు పారుసుకున్నాడు. ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని టార్గెట్ చేయండి. రాడ్లు, రాళ్లు నేను స్పాన్సర్ చేస్తా’ అంటూ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలకు నెటిజన్లు గట్టిగా బదులిచ్చారు. ‘పార్టీ కార్యకర్త, అభిమాని అయితే గుడ్డిగా అనుసరించడం కాదు. వాస్తవాలు, అవాస్తవాలను తెలుసుకో’ అంటూ అతడి పోస్టుకు కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు దేశంలో ఇంతవరకు ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో ఉందని కొందరు పేర్కొన్నారు. నిజాలు నమ్మడం ఇష్టంలేకే మీడియా సంస్థలపై భౌతిక దాడుల గురించి ప్రస్తావిస్తారని అన్నారు. గిరి చెర్కుపల్లిపై పోలీసులు కేసు నమోదుచేయాలని కొందరు కోరారు.