Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్టు, విడుదల
ABN , Publish Date - Jun 22 , 2025 | 04:41 AM
గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని హనుమకొండలోని సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి
గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో అరెస్ట్
సొంత పూచీపై విడుదల చేసిన కాజీపేట కోర్టు
నాపై కేసులు పెడితే ఏకే 47లా వస్తా
సీఎంకు అన్ని పనుల్లో 20 శాతం కమీషన్లు
మంత్రి సీతక్క ఇసుక దందా, కడియం కబ్జాలు
ఎమ్మెల్యే నాగరాజు పోస్టింగ్‌ల దందా
రేపు వాళ్ల బాగోతాలు బయటపెడతా
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు
వరంగల్/కాజీపేట/శంషాబాద్ రూరల్/హైదరాబాద్, జూన్ 21(ఆంధ్రజ్యోతి): గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని హనుమకొండలోని సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే దుబాయ్ వెళ్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు శనివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. గత ఏప్రిల్ 21న హనుమకొండలోని ఎన్‌జీవోఎ్‌స కాలనీకి చెందిన గ్రానైట్ వ్యాపారి కట్ట మనోజ్‌రెడ్డి భార్య ఉమాదేవి కౌశిక్‌రెడ్డిపై కేసు పెట్టారు. తన భర్తను కౌశిక్‌రెడ్డి రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించారని, ఎమ్మెల్యేతో తన కుటుంబానికి ప్రాణభయం ఉందని సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్‌రెడ్డిపై బీఎన్‌ఎ్‌స సెక్షన్లు 308(2), 308(4), 352 కింద కేసు నమోదు చేశారు. తనపై అక్రమ కేసు పెట్టారని, ఏప్రిల్ 27న జరిగే బీఆర్‌ఎస్ బహిరంగ సభను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కౌశిక్‌రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన హైకోర్డు బీఆర్‌ఎస్ బహిరంగ సభ అయ్యే వరకు కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేయవద్దని, విచారణ కొనసాగించవచ్చని పేర్కొంది. అయితే, శనివారం తెల్లవారుజామున కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. సుబేదారి ఠాణా కు తరలించారు. వరంగల్ ఎంజీఎంలో వైద్య పరీక్షలు నిర్వహించి కాజీపేట రైల్వేకోర్టుకు తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి నాగలీల సుస్మిత వ్యక్తిగత పూచీకత్తుపై కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూ రు చేశారు.
సీఎం దిష్టిబొమ్మ దహనం.. తీవ్ర ఉద్రిక్తత
కౌశిక్‌రెడ్డి అరెస్టు హనుమకొండలో ఉద్రిక్తతకు దారి తీసింది. శనివారం ఉదయం 10 గంటలకు కౌశిక్‌రెడ్డిని సుబేదారి ఠాణాకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ లీగల్ టీంతో కలిసి పోలీ్‌సస్టేషన్‌కు చేరుకున్నారు. కౌశిక్‌రెడ్డితో మాట్లాడేందుకు సీఐ రంజిత్ నిరాకరించడంతో పోలీసులు, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే హుజూరాబాద్ నుంచి భారీగా బీఆర్‌ఎస్ శ్రేణులు తరలివచ్చాయి. వినయ్‌భాస్కర్‌తో పాటు పార్టీ కార్యకర్తలు కౌశిక్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బీఆర్‌ఎస్ నేత రాకేశ్ రెడ్డి మధ్యాహ్నం పోలీ్‌సస్టేషన్‌కు చేరుకున్నారు. కౌశిక్‌రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం ఎంజీఎంకు తరలిస్తున్న క్రమంలో గులాబీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. దీంతో పోలీసులు, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
కేసులు పెడితే ఏకే 47లా వస్తా: కౌశిక్‌రెడ్డి
‘‘సీఎం రేవంత్‌రెడ్డి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కేసీఆర్ నాయకత్వంలో ఏకే 47లా తయారై వస్తా. సీఎం ప్రతీ పనిలో 20 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు. మంత్రి సీతక్క ఇసుక, క్వారీ దందా.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి భూ కబ్జాలు.. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పోలీస్ పోస్టింగ్‌ల దందాలు.. అన్నీ బయటపెడతా.. రేపు తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం పెట్టి సాక్ష్యాలతో వెల్లడిస్తా’’ అని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి కాజీపేట రైల్వే కోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత ఆనందంతో కౌశిక్‌రెడ్డి కంట తడిపెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చివరికి న్యాయమే గెలిచిందన్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికొదిలేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని హరీశ్‌రావు విమర్శించారు. రైతుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరినీ కేసులతో వేధిస్తున్నారని ఎక్స్ వేదికగా విమర్శించారు.