Share News

Harish Rao: అరాచకాన్ని అరికట్టేందుకు నాడు రామదండు..నేడు గులాబీ దండు

ABN , Publish Date - Apr 26 , 2025 | 03:55 AM

లంకలో రావణుడి అరాచకాలను అరికట్టడానికి ఆనాడు రామదండు కదిలిందని.. నేడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగిస్తున్న అరాచకాన్ని అడ్డుకునేందుకు గులాబీ దండు కదిలిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.

Harish Rao: అరాచకాన్ని అరికట్టేందుకు నాడు రామదండు..నేడు గులాబీ దండు

  • తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు పేగుబంధం: హరీశ్‌ రావు

  • 27న నిర్వహించనున్న ఎల్కతుర్తి సభకు పాదయాత్రగా వెళ్లిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు

సిద్దిపేట ఆంధ్రజ్యోతి, ఏప్రిల్‌ 25: లంకలో రావణుడి అరాచకాలను అరికట్టడానికి ఆనాడు రామదండు కదిలిందని.. నేడు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగిస్తున్న అరాచకాన్ని అడ్డుకునేందుకు గులాబీ దండు కదిలిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట పట్టణంలోని రంగధాంపల్లి వద్ద అమరుల స్థూపానికి ఆయన నివాళులర్పించారు. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు సిద్దిపేట నుంచి దాదాపు 1500 మంది యువకులు, పార్టీ నాయకులు చేపట్టిన పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు అవినాభావ సంబంధం ఉందని చెప్పారు.ఆనాటి కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకైనా, 2001లో బీఆర్‌ఎస్‌ ఆవిర్భవించిన సందర్భమైనా.. అన్నింటితో సిద్దిపేటకు పేగు బంధం ఉందన్నారు.


ఈ పాదయాత్ర బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడానికి విజయయాత్ర కాబోతున్నదని స్పష్టం చేశారు. దేశంలో చాలా పార్టీలు పుడుతుంటాయి.. పోతుంటాయి.. కానీ, బీఆర్‌ఎస్‌ పార్టీ లక్ష్యాన్ని ముద్దాడిందని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా చరిత్రలో నిలిచినట్లు పేర్కొన్నారు. 14 ఏళ్ల ఉద్యమం, పదేళ్ల ప్రభుత్వం, ఇప్పుడు ఏడాదిన్నర ప్రతిపక్షం, ఏ పాత్ర అయినా బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ పక్షాన నిలబడుతుందని తెలిపారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి సంక్షేమాల్లో దేశానికి ఆదర్శంగా నిలిపామని వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ 420 హామీలిచ్చిందని, ఆ పార్టీ మోసపూరిత మాటలు, అబద్ధపు హామీలు ప్రజలకు అర్థమయ్యాయన్నారు. పాదయాత్రలో కాంగ్రెస్‌ చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు.

Updated Date - Apr 26 , 2025 | 03:55 AM