Share News

BJP : బీసీ.. ఎంపీ!

ABN , Publish Date - Jun 29 , 2025 | 04:30 AM

బీజేపీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. కొన్ని గంటల్లోనే కొత్త సారథి ఎవరో తేలిపోనుంది. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదివారం నోటిఫికేషన్‌ జారీ కానుంది.

BJP : బీసీ.. ఎంపీ!

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధం

  • నేడు నోటిఫికేషన్‌.. జూలై 1వ తేదీన ప్రకటన

  • రేసులో ఈటల, ధర్మపురి అర్వింద్‌, బండి సంజయ్‌

  • సమీకరణాలు మారితే రాంచందర్‌రావుకు చాన్స్‌

  • తుది పేరు ఖరారుపై జాతీయ నాయకత్వం కసరత్తు

  • ఒకే నామినేషన్‌ దాఖలయ్యే అవకాశం

హైదరాబాద్‌, న్యూఢిల్లీ, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. కొన్ని గంటల్లోనే కొత్త సారథి ఎవరో తేలిపోనుంది. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదివారం నోటిఫికేషన్‌ జారీ కానుంది. సోమవారం నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 1న అధ్యక్షుడి పేరును అధికారికంగా ప్రకటిస్తారు. రాష్ట్ర రాజకీయాలు బీసీల ఓటు బ్యాంకు కేంద్రంగా మారిన క్రమంలో.. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఆ సామాజికవర్గం వైపే బీజేపీ జాతీయ నాయకత్వం మొగ్గుచూపుతోందన్న ప్రచారం జరుగుతోంది. అందులోనూ ఎంపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీ బీసీ ఎంపీలు ఈటల రాజేందర్‌, ధర్మపురి అర్వింద్‌, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ పేర్లపై చర్చ జరుగుతోంది. ఈటల, అర్వింద్‌ ఇద్దరూ ఇప్పటికే గట్టి ప్రయత్నాలు చేశారు. బండి సంజయ్‌ పేరు కూడా వినిపిస్తున్నా.. తాను రేసులో లేనని గతంలో ఆయన పేర్కొన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఎంపీకి కాకుండా మరో సీనియర్‌ నేతకు పట్టం కట్టాలనుకుంటే.. మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావుకు అవకాశం దక్కవచ్చన్న చర్చ జరుగుతోంది. రాంచందర్‌రావుకు పార్టీ పాత తరం నాయకుల మద్దతు కూడా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకదశలో బండి సంజయ్‌ కూడా రాంచందర్‌రావు పట్ల సానుకూలత చూపారని అంటున్నాయి.


రెండేళ్లుగా వాయిదా పడుతూనే..

బీజేపీ జాతీయ నాయకత్వం 2023 జూలై 4న బండి సంజయ్‌ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యత అప్పగించింది. అది తాత్కాలికమేనని, కొన్ని నెలల్లో కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఎక్కువ మంది సీనియర్‌ నేతలు పోటీపడటం, తర్వాతి పరిణామాల్లో రెండు, మూడు గ్రూపులు ఏర్పడటంతో ఇప్పటివరకు వాయిదా పడుతూ వచ్చింది. ఒకదశలో పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి కూడా ఏర్పడింది. మరోవైపు పార్టీ జాతీయ నాయకత్వం అంతరంగం అంతుచిక్కకపోవడంతో ఆశావహులు కూడా తమ ప్రయత్నాలకు కొంత విరామమిచ్చారు. ఇన్నాళ్లకు మళ్లీ కదలిక వచ్చింది.


పోటా పోటీ సభలతో చర్చ!

ఇటీవల వికసిత్‌ సంకల్ప్‌ సభ పేరిట సభ నిర్వహించిన ఈటల రాజేందర్‌.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌తోపాటు రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సభకు ఆహ్వానించారు. మరోవైపు నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం సందర్భంగా ఎంపీ అర్వింద్‌ రైతు మహా సమ్మేళనం పేరిట బహిరంగసభ చేపట్టారు. అందులో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతోపాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొననున్నారు. ఇలా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్న ఇద్దరు ఎంపీలు పోటాపోటీగా సభలు నిర్వహించడం పార్టీలో చర్చకు దారితీసింది.


ఎన్నిక లాంఛనమే!

నూతన అధ్యక్షుడిగా ఎవరికి అవకాశం ఇచ్చేదీ జాతీయ నాయకత్వం ఖరారు చేయాల్సి ఉంది. తర్వాత ఎన్నిక లాంఛనమే కానుంది. సాధారణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు కలిసి ఎన్నుకుంటారు. పార్టీ జాతీయ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కె.లక్ష్మణ్‌, రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక రిటర్నింగ్‌ అధికారి, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే పర్యవేక్షణలో ఎన్నిక చేపడతారు. అయితే ఒకే నామినేషన్‌ దాఖలయ్యే అవకాశం ఉందని, వారే రాష్ట్ర అధ్యక్ష పదవి చేపడతారని పార్టీ వర్గాలు తెలిపాయి ఉమ్మడి రాష్ట్రంలోను, తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఓటింగ్‌ జరగలేదని గుర్తు చేశాయి. రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేతలు పార్టీ జాతీయ నాయకత్వం నుంచి ఫోన్‌ కాల్‌ కోసం ఎదురుచూస్తున్నారని, ఎంపికైనట్టు ఎవరికి ఫోన్‌ వస్తే వారే సోమవారం నామినేషన్‌ దాఖలు చేస్తారని పేర్కొన్నాయి. ఆదివారం రాత్రిలోగా ఎప్పుడైనా తమకు ఢిల్లీ నుంచి ఫోన్‌ రావొచ్చన్న ఆశాభావంతో నేతలు ఎదురుచూస్తున్నారని తెలిపాయి.


ఇవి కూడా చదవండి

పాత బాకీ అడిగితే ఇలా కొడతారా..

మహా న్యూస్ పై దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు, లోకేష్

Updated Date - Jun 29 , 2025 | 04:30 AM