అప్పు కట్టలేదని ఇంటి గేట్లు ఎత్తుకెళ్లారు
ABN , Publish Date - Feb 13 , 2025 | 04:59 AM
బ్యాంకులో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని బ్యాంకు అధికారులు ఇంటి గేట్లు ఎత్తుకెళ్లిన ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

స్టేషన్‌ఘన్‌పూర్ డీసీసీబీ అధికారుల తీరు
ఓ మహిళ రుణం తిరిగి చెల్లించలేదని ఆమె ఇంటి గేట్లు తీసుకెళ్లిన వైనం
జనగామ జిల్లాలో ఘటన
కొడకండ్ల, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): బ్యాంకులో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని బ్యాంకు అధికారులు ఇంటి గేట్లు ఎత్తుకెళ్లిన ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడునూతులలో తండా మంజుల, మద్దెబోయిన ప్రేమలతలకు పాడిగేదెల కోసం జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉన్న డీసీసీబీ రూ.8.72 లక్షల రుణం 2021 అక్టోబరులో ఇచ్చింది. ఒక్కో గ్రూపునకు ఐదుగురు చొప్పున రెండు గ్రూపుల్లో మొత్తం 10మంది తలా ఒక పాడిగేదె కొన్నారు. అయితే కొంత అప్పు కట్టినా రెండు గ్రూపులు కలిపి మొత్తం రూ.7 లక్షల బాకీ చెల్లించలేదు. వాస్తవానికి 2023లోనే ఈ రుణ వాయిదాలు పూర్తి కావాల్సి ఉంది.
దీంతో బ్యాంకు అధికారులు లబ్ధిదారులకు 2023 అక్టోబరులో లీగల్ నోటీసులు పంపారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో బుధవారం లబ్ధిదారుల ఇంటికి బ్యాంకు సిబ్బంది లీగల్ నోటీసులు ఇవ్వడానికి వె ళ్లారు. ఈ సందర్భంగా గట్టిగా అడగడంతో రూ.3 లక్షలు చెల్లించారు. అయితే రెండు రోజుల్లో మొత్తం చెల్లిస్తామన్నా వినకుండా బ్యాంకు సిబ్బంది తమ ఇంటి గేట్లు తీసుకెళ్లారని మద్దెబోయిన ప్రేమలత ఆరోపించారు. వారే తమ గేట్లు తీసుకెళ్లమన్నారని డీసీసీబీ కొడకండ్ల బ్రాంచ్ మేనేజర్ కళ్యాణి తెలిపారు.