Share News

Bank Fraud: బ్యాంకు ఉద్యోగిని బెదిరించి పైసలు వసూల్‌

ABN , Publish Date - May 27 , 2025 | 05:20 AM

లోన్‌ కావాలంటూ పిలిచి ఓ బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసర్‌పై అమానుషంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దాడిని రికార్డు చేసి బెదిరింపులకు పాల్పడి..

Bank Fraud: బ్యాంకు ఉద్యోగిని బెదిరించి పైసలు వసూల్‌

  • లోను కావాలని ఇంటికి పిలిచి నిర్బంధం

  • దుస్తులు తీయించి దాడి.. వీడియోలు, ఫొటోలు చిత్రీకరణ

  • వాటిని తొలగిస్తామని రూ.6.50 లక్షలు వసూలు

చీరాల, మే26 (ఆంధ్రజ్యోతి): లోన్‌ కావాలంటూ పిలిచి ఓ బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసర్‌పై అమానుషంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దాడిని రికార్డు చేసి బెదిరింపులకు పాల్పడి.. తిరిగి ఆయన వద్దే నగదు వసూలు చేసిన ఘరానా వ్యవహారమిది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు తారకరామానగర్‌కు చెందిన మద్దారపు విజయసారథి బాపట్ల జిల్లా చీరాల ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచిలో ఫీల్డ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. బ్యాంకులో చీరాలకు చెందిన గరిక హేమలత రుణం తీసుకొని తిరిగి చెల్లించింది. తనకు మరోసారి ఇంటి రుణం కావాలని కోరింది. దీంతో ఆమె ఇంటి చిరునామాను బ్యాంకులో సీనియర్‌ మెసెంజర్‌గా పనిచేస్తున్న తెనాలి నెహ్రూను సారథి అడిగారు. ఆ తర్వాత నెహ్రూ ఆమెతో ఫోన్‌లో మాట్లాడారు. పక్కా పథకం ప్రకారం పట్టణ పరిధిలోని గంజిపాలెంలో ఓ ఇంటికి ఈ నెల 7న సారథిని పిలిపించారు.


ఆయన అక్కడికి వెళ్లగా బయట ఉన్న ఓ మహిళ ఆయన్ను లోపల కూర్చోబెట్టి ఎక్కడికో వెళ్లింది. వెంటనే నలుగురు ఇంట్లోకి వెళ్లి తలుపులు వేశారు. అధికారి దుస్తులు తీయించి అర్ధనగ్నంగా కూర్చోబెట్టి దాడి చేశారు. ఫొటోలు, వీడియోలు చిత్రీకరించారు. అధికారి ఫోన్‌ నుంచి రూ.72వేలను వారి ఖాతాకు మళ్లించుకున్నారు. మరో రూ.10లక్షలు ఇవ్వకుంటే మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు కేసుపెడతామని బెదిరించారు. సారథి అక్కడి నుంచివెళ్లి ఆ ఇంటికి తనను పంపిన నెహ్రూకు జరిగిన ఉదంతాన్ని వివరించారు. అయితే తాను వారితో మాట్లాడి ఫొటోలు, వీడియో డిలీట్‌ చేయిస్తానని నమ్మబలికి అందరికీ కలిపి రూ.6.50లక్షలు ఇవ్వాలని ఒత్తిడి పెంచాడు. దీంతో సారథి ఈనెల 8న అడిగిన మొత్తాన్ని నెహ్రూకు ఇచ్చాడు. ఇదికాకుండా సమస్యను పరిష్కరించినందుకంటూ నెహ్రూ మరో రూ.75వేలు తీసుకున్నాడు. ఈ క్రమంలో నిందితులు మరో రూ.5లక్షలు డిమాండ్‌ చేశారు. దీంతో ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఈ నెల 21న వన్‌టౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఏడుగురిని అరెస్ట్‌ చేసి రూ.5.70లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరో మహిళ పరారీలో ఉన్నట్లు తెలిసింది.


Also Read:

సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..

సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..

For More Health News and Telugu News..

Updated Date - May 27 , 2025 | 05:20 AM