Bandi Sanjay: కేటీఆర్.. ఆ బ్రోకర్ ఎవరో చెప్పు
ABN , Publish Date - Apr 13 , 2025 | 03:43 AM
కాంగ్రెస్ గ్యారెంటీలపై అడుగడుగునా నిలదీస్తున్నది, హెచ్‌సీయూ భూములపై పోరాడుతున్నది తామేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.

హెచ్‌సీయూ భూముల విక్రయంలో.. రేవంత్‌తో ఉన్న బీజేపీ ఎంపీ ఎవరు
ప్రెస్‌మీట్లు తప్ప బీఆర్‌ఎస్ చేసిందేమిటి..?
6 గ్యారెంటీలపై కొట్లాడని అసమర్థ పార్టీ
పేదలకు ఇచ్చేది బరాబర్ మోదీ బియ్యమే
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి సంజయ్
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ గ్యారెంటీలపై అడుగడుగునా నిలదీస్తున్నది, హెచ్‌సీయూ భూములపై పోరాడుతున్నది తామేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. హెచ్‌సీయూ భూముల అమ్మకంలో సీఎం రేవంత్‌రెడ్డికి ఒక బీజేపీ ఎంపీ సహకరిస్తున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ మండిపడ్డారు. కేటీఆర్‌కు దమ్ముంటే, ఆయన వద్ద ఆధారాలుంటే.. ఆ బ్రోకర్ ఎవరో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. హనుమాన్ శోభా యాత్రను పురస్కరించుకుని సంజయ్ శనివారం సాయంత్రం గోషామహల్ నియోజకవర్గంలోని ఆకాశ్‌పురి హనుమాన్ ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన రాజాసింగ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఏనాడైనా ఆరు గ్యారెంటీలపై కొట్లాడిందా..? అని ప్రశ్నించారు. ప్రెస్‌మీట్లు పెట్టడం తప్ప బీఆర్‌ఎస్ చేసిన పోరాటాలు ఏంటని నిలదీశారు. కేటీఆర్‌ను ప్రజలు ఓడగొట్టినా అహంకారం తగ్గలేదని.. ఆయన అహంకారాన్ని దించుతామని అన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ అవినీతికి సంబంధించిన ఆధారాలను కేటీఆర్ ఎందుకు బయటపెట్టలేదని నిలదీశారు. ఎందుకంటే రేవంత్‌రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ ఒక్కటేనని అన్నారు. ‘‘బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్‌లారా.. మీరు మళ్లీ వచ్చేసారి కార్పొరేటర్లుగా గెలవాలనుకుంటున్నారు కదా..? మీకు ఓట్లేసి గెలిపించేది హిందువులే తప్ప అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం నేతలు, రేవంత్‌రెడ్డి, కేటీఆర్ కాదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఒక వేళ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో మీరు ఎంఐఎం అభ్యర్థికి ఓటు వేస్తే.. హిందూ సమాజమంతా ఒక్కటై మిమ్మల్ని ఓడించడం తథ్యం’’ అని సంజయ్ హెచ్చరించారు. ఓటేసే ముందు కార్పొరేటర్లంతా తమ తమ డివిజన్ ప్రజలతోపాటు కుటుంబ సభ్యుల మనోభావాలను తెలుసుకుని ఓటేయాలని కోరారు. హిందూ సమాజ సంఘటిత శక్తిని ప్రదర్శించేలా రాజాసింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో గొప్ప ర్యాలీ నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. సమాజ ధర్మం, బీజేపీ సిద్ధాంతాల కోసం పనిచేసే కట్టర్ కార్యకర్త రాజాసింగ్ అని.. ఆయనతో తమకు ఎలాంటి విబేధాలు లేవని అన్నారు.
రాహుల్ మెప్పు కోసంఆరాటం..
రాహుల్ గాంధీ మెప్పు పొందేందుకు సీఎం రేవంత్ రెడ్డి,, మోదీపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని సంజయ్ అన్నారు. కేసీఆర్ కూడా గతంలో ఇలానే మోదీపై అడ్డగోలుగా మాట్లాడారని.. అప్పుడు బీఆర్‌ఎ్‌సకు పట్టిన గతే ఇప్పుడు కాంగ్రె్‌సకూ పడుతుందన్నారు. రేషన్ ద్వారా అమ్మే బియ్యంలో కిలోకు రూ.37 ఇస్తోంది కేంద్రమేనని, అలాంటప్పుడు అవి కాంగ్రెస్ ఇస్తున్న బియ్యం ఎలా అవుతాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎన్ని చెప్పినా.. రేషన్ షాపులో ఇచ్చేది మోదీ బియ్యమేనని స్పష్టం చేశారు. రేషన్ బియ్యం కోసం కేంద్రం ఏటా రూ.వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు.
రాజాసింగ్‌ను కలిసిన గౌతమ్ రావు
హనుమాన్ శోభా యాత్రలో రాజాసింగ్‌ను హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు కలిశారు. ఈ సందర్భంగా రాజాసింగ్.. గౌతం రావుకు శాలువా కప్పి అభినందించారు. రాజాసింగ్, గౌతమ్ రావుతో బండి సంజయ్ కాసేపు మాట్లాడారు.
ఇవి కూడా చదవండి...
Harassment Of Women: కోరిక తీర్చాలంటూ మహిళను ఎంతలా వేధించారంటే
Case On KTR: కేటీఆర్ ట్వీట్‌పై పోలీసుల రియాక్షన్
Read Latest Telangana News And Telugu News